( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ఏపీలో ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు దాదాపుగా ఖరారు అనే సంకేతాలు వస్తుండటంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇందుకోసం సెకండ్ వేవ్ అస్త్రాన్ని బలంగా సంధిస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు లేని అడ్డంకి మన రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? అని రేపొద్దున్న కోర్టులు ప్రశ్నిస్తే… అందుకు విశ్వసనీయతతో కూడిన సమాధానం ఇచ్చేందుకు కుయుక్తులు పన్నుతోంది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ఇందుకు ఉదాహరణ.
ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా జనవరి 15 తర్వాత సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖ నివేదిక సారాంశం. అంటే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తెగేసి చెప్పడానికి ఎంచుకున్న మార్గంగా స్పష్టమవుతోంది. రోజుకు 10 వేల కేసులు నమోదైన రాష్ట్రంలో క్రమంగా ఆ సంఖ్య 100లకు తగ్గింది. అయితే ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసుకుంటూ… ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసింది.
ఐదు మాసాల గ్యాప్‌తో వచ్చే అవకాశం ఉందట!
పొరుగు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే… దేశంలో అనేక చోట్ల ఎన్నికలు సజావుగా సాగుతుంటే… అక్కడి పరిస్థితులతో సరి పోల్చలేమని… ఇక్కడి పరిస్థితులు వేరనీ చెప్పుకుంటూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు.. ఇప్పుడు సెకండ్ వేవ్ విషయంలో మాత్రం ప్రపంచ దేశాలతో పోల్చుకోవడం గమనార్హం. కరోనా వైరస్ తీవ్ర దశలో ఉన్న దేశాలలో ఐదు మాసాల తరువాత సెకండ్ వేవ్ వచ్చిందని, ఢిల్లీలోనూ అదే జరిగిందని చెప్పుకొస్తోంది. మన రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో ఎక్కువ తీవ్రత ఉండి, ఆ తర్వాత క్రమంగా తగ్గింది. తిరిగి ఐదు మాసాల తర్వాత అంటే జనవరి 15 నుంచి మార్చి 15లోగా సెకండ్ వేవ్ అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారట. ఒక్క మన దేశంలోనే ఈ పరిస్థితి కాదట… అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాలతో పాటు ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా అంచనా వేసి అప్రమత్తం చేస్తోందట.
Must Read ;- గోల్ ఎవరికో.. హైకోర్టులో ఏపీ పంచాయతీ ఎన్నికల బాల్
ఏడుగురు నిపుణులతో అడ్వైజరీ కమిటీ..
రాష్ట్రంలో సెకండ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏకంగా ఏడుగురు సభ్యులతో అడ్వైజరీ కమిటీని నియమించింది. ముగ్గురు నిపుణులు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వారు కాగా.. మరో ముగ్గురు ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన వారు ఉన్నారు. ఈ ఏడుగురు నిపుణుల కమిటీ కరోనా వైరస్ సెకండ్ వేవ్ అవకాశాలు.. వాటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక సమర్పించింది.
ఓటమి భయంతో ఎన్నో ఎత్తులు..
స్థానిక సంస్థల ఎన్నికలు పేరెత్తితేనే వైఎస్సార్సీపి ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కళ్ళ ముందు కదలాడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పదేపదే లేఖలు రాయడం, పలు రాష్ట్రాల్లో కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండడం.. రమేష్ కుమార్ హయాంలోనే ఎన్నికలు తప్పవన్న ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తున్నట్టు చెప్పకనే చెబుతున్నారు. అడ్డగోలు ఏకగ్రీవాలు… ప్రత్యర్థుల బెదిరింపులు.. పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్‌లు సాధ్యం కాదన్న భయంతో… ఎలా వాయిదా వేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తేటతెల్లమవుతోంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం దృష్టికి ఇదే విషయాన్ని ఆయన పదే పదే తీసుకువెళ్లారు.
Also Read ;- ‘స్థానికం’ ఫిబ్రవరిలోనే.. అసెంబ్లీ తీర్మానం చెల్లదా?
ఇప్పుడు వైరస్ భయం వచ్చిందా?
వైరస్‌తోనే కలిసి సహజీవనం చేయాలి… పారాసెటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది.. అంటూ హితవు పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి … అప్పుడు లేని భయం సెకండ్ వేవ్‌లో ఎందుకు వస్తోందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. లాక్‌డౌన్ కు ముందు ఎన్నికల కమిషన్ తనకున్న విచక్షణ అధికారంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది.
ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వివాదాలకు దారితీస్తుందో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం తగ్గించడం.. ఆయన స్థానంలో మరొకరిని నియమించడం.. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పట్టుబట్టడం.. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు? అంటూ ఎన్నికల కమిషనర్‌పై నిప్పులు చెరగడం .. ఇలా ఎన్నో వివాదాలు స్థానిక ఎన్నికల చుట్టూనే తిరిగాయి. తరువాత క్రమంగా లాక్ డౌన్‌ను పెంచుకుంటూ కేంద్ర ప్రభుత్వం వెళ్లడం… దేశ ఆర్థిక పరిస్థితులు, రెవెన్యూను దృష్టిలో పెట్టుకొని అన్ లాక్ ప్రక్రియ దశల వారీగా అమలు చేయడంతో… దేశమంతా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
సాధారణ పరిస్థితులు నెలకొన్నా..
వైన్ షాప్‌లు, బార్లు .. రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, పార్కులు, చివరకు విద్యా సంస్థలు సైతం తెరచుకున్నాయి. అనంతరం దేశంలో అనేక చోట్ల ఉప ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కరోనా వైరస్ మరోసారి తిరగబెట్టే ప్రమాదం ఉందని, ప్రస్తుతం స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం అదే సాకును పదే పదే చెబుతుండడం ఆశ్చర్యకరం. ఇంతకన్నా బలమయిన కారణం మరొకటి ప్రభుత్వం వెతుక్కుంటే … కాస్త పరువైనా దక్కేది.
వెంటాడుతున్న ఓటమి భయం..
ప్రభుత్వానికి అన్ని వైపులా ఇటీవల కాలంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదన్న అభిప్రాయానికి వచ్చేసినట్టు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటున్న తీరు కూడా కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది.
ముందే పెట్టాల్సింది…
జనవరి 15 తర్వాత సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంది కనుక… ప్రభుత్వం అంతకు ముందే ఎన్నికలు నిర్వహిస్తుందా? అంటే సమాధానం మాత్రం దొరకదు. సెకండ్ వేవ్ సమాచారం ముందుగా అంచనా వేయగలిగినప్పుడు ఎన్నికలు కూడా ముందే పెట్టవచ్చు కదా అన్న వాదన వినిపిస్తోంది.
Also Read ;- మా రాష్ట్రం మా పంచాయితీ మా ఇష్టం