ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాంధ్రలో ప్రతిష్ఠాత్మక మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించి సంచయితను నియమిస్తూ విడుదల చేసిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కూడా హైకోర్టు ఇవాళ కొట్టివేసింది. మరలా అశోక్ గజపతిరాజును పునర్నియామకం చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
విలువైన ఆస్తులు.. దాని చుట్టూ వివాదాలు
ఉత్తరాంధ్రాలో మాన్సాస్ ట్రస్టుకు దాదాపు లక్ష కోట్ల విలువైన భూములున్నాయని అంచనా. అయితే అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతి రాజు కొనసాగుతుండగానే అయన్ని తొలగిస్తూ 2019లో ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ వెంటనే సంచయిత గజపతిరాజును మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్‌గా నియమిస్తూ కొత్తగా జీవోలు జారీ చేశారు. అప్పటి నుంచి ఆమె మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలు చూస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. దీంతో వారు భిక్షాటన చేస్తూ నిరసన కూడా తెలిపారు. విశాఖనగరంతో పాటు, సమీపంలో మాన్సాస్ ట్రస్టుకు వేలాది ఎకరాల భూములు ఉండటంతో వాటిపై కొందరు కన్ను వేశారని, అందుకే అశోక్ గజపతి రాజును తప్పించారనే వార్తలు వచ్చాయి. అయితే అశోక్ గజపతి రాజు ప్రభుత్వం జారీ చేసిన జీవోలు రద్దు చేయాలంటూ అశోక్ గజపతి రాజు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఏడాదిగా విచారణ సాగింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కొట్టి వేస్తూ ఏపీ హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించింది. దీంతో ట్రస్టు ఛైర్మన్‌గా మరలా అశోక్ గజపతి రాజును నియమించాల్సి ఉంటుంది.
Must Read ;- అమూల్‌పై ప్రభుత్వ నిధులు ఖర్చు చేయవద్దని హైకోర్టు ఆదేశం