అమరావతి..
కేవలం ఒక నగరమా?
కేవలం కొన్ని ఆకాశహర్మ్యాల సమూహమా?
కేవలం సచివులు, యావత్ అధికార యంత్రాంగం కొలువుతీరే భవనాల సమాహారమా?
కేవలం ఒక స్వప్నమా?
యావత్ భారతావనిలోనే అతుల్యమైన ఒక మహానగరంగా.. అనిర్వచనీయమైన తెలుగు ప్రజల భాగ్యంగా.. అగణ్యమైన తెలుగుజాతి సంపదగా.. ఇంకా ఆవిష్కృతం కాని అద్భుతం ఈ అమరావతి!
యావత్ తెలుగు ప్రజల ఆలోచనల్లో అంతరంగాల్లో హృదయాంతరాళాల్లో.. పెనవేసుకుపోయిన బలీయమైన బంధం ఈ అమరావతి.
అమరావతి- యావత్ తెలుగుజాతి అవసరం. అటు ఇచ్ఛాపురం నుంచి ఇటు కుప్పం వరకు విస్తరించిన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నడిబొడ్డున నిలిచిన నగరం.
అంతేనా..
అమరావతి.. కేవలం నగరమేనా?
చరిత్రపూర్వం నుంచి, క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం నుంచి క్రీస్తు శకం మూడో శతాబ్దం వరకు ఇవాళ్టి భారతదేశంలో సగానికంటె ఎక్కువ ప్రాంతాన్ని పరిపాలించిన శాతవాహన సామ్రాజ్యానికే రాజధాని ధరణికోట ఇమిడిఉన్న ప్రాంతం! ప్రపంచమానవాళికి కొత్త దిశానిర్దేశం చేసిన బౌద్ధం అమరంగా విలసిల్లిన క్షేత్రం. ధాన్యకటకంగా యావత్ దక్షిణ భారతానికి క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలోనే నాగరికత నేర్పిన ప్రాంతం. తీర్థంకరుడు మహావీరుని ప్రవచనాలతో పునీతమైన ప్రాంతం. తెలుగుజాతి జీవనవేణి కృష్ణమ్మ తీరంలో సుభిక్షమైన సుసంపన్నమైన ప్రాంతం.
Must Read ;- చంద్రబాబు అసామాన్య యత్నం.. రైతన్నల త్యాగ ఫలం.. అమరావతి
అమరావతి.. కేవలం నగరమేనా?
జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు, ఉపాధి వనరులకు కేంద్రమై.. అందరికీ అన్నీ అందించే కల్పతరువుగా రాష్ట్రానికి అందివచ్చిన ప్రాంతం.
అమరావతి.. కేవలం నగరంమేనా?
29 గ్రామాలకు చెందిన వందల మంది ప్రజల అగణ్య త్యాగాల ఫలం! వారి త్యాగాల్లో ఉన్నది వ్యాపారం కాదు! మన తెలుగు రాష్ట్రం మన తెలుగు రాజధాని.. అవని యవనికపై సమున్నతంగా, సముజ్వలంగా, జేగీయమానంగా వెలుగొందాలనే అనన్యమైన తపన!
ప్రపంచం తెలుగు రాష్ట్రంవైపు తలెత్తి చూసేలా ఒక మేరునగసమానమైన రాజధానిని నిర్మిద్దామని నాడు రాష్ట్ర అధినేతగా నారా చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చినప్పుడు.. ఆ ఆశను నిజం చేయడానికి వందల మంది రైతులు స్పందించి ఇచ్చిన పొలాలే పెట్టుబడిగా.. అనన్యమైన నగరానికి అవసరమైన భూ సంపద లభ్యమైన ప్రాంతం. సచివాలయం, హైకోర్టు ఇప్పటికే కొలువు తీరగా.. రాష్ట్ర పరిపాలన సజావుగా సాగడానికి ఉపకరిస్తున్న ప్రాంతం. యూనివర్సిటీలు, ప్రజాప్రతినిధుల, అధికార్ల నివాసాల కోసం తొంభై శాతం పూర్తయిన నిర్మాణాలతో అతి కొద్ది కాలంలోనే మన జాతి ఔన్నత్యాన్ని రెపరెపలాడించగలదని మనం నమ్ముతున్న నగరం.
అమరావతి ఒక విషాదమా? ఎప్పటికీ కానే కాదు! అమరావతి ఒక వాస్తవం. అమరావతి ఒక ఆశావహ దృక్పథం. అమరావతి తెలుగు జాతి గర్వ ప్రతీక. అమరావతి తెలుగుదనపు విజయపతాక!
అమరావతి- అయిదుకోట్ల మంది ప్రజల గుండెల్లో మోగే విజయ దుందుభి!
అమరావతి- తెలుగుజాతి విజయాలను నమోదు చేయడానికి అందివచ్చిన పాశుపతం!
అమరావతి- తెలుగుజాతి అస్తిత్వాన్ని యావత్ ప్రపంచానికి చెవులు తుప్పు వదిలించేలా ప్రతిధ్వనిస్తూ తెలియజెప్పే పాంచజన్య శంఖారావం!
Also Read ;- నేను రాజధానిగా పనికిరానా..! అమరావతి ఆక్రందన
అమరావతి.. నవీన తెలుగుజగతి నిర్మాణానికి శ్రీకారం
అమరావతి.. హిందువులకు ఓంకారం!
అమరావతి.. ముస్లిములకు తక్బీర్!
అమరావతి.. క్రైస్తవులకు గాస్పెల్!
==
ఇప్పుడేం జరుగుతోంది..?
అధికార వికేంద్రీకరణ పేరుతో జరుగుతున్న కుట్రల్లో అమరావతి ప్రభలకు గ్రహణం పట్టింది. గ్రహణం ఎప్పటికీ శాశ్వతం కాదు. గ్రహణం ఎంతటి ఘనమైనదైనా.. అది విడవడానికి ఒక కాలపరిమితి ఉంటుంది. తెలుగుజాతి వైభవ చిహ్నమైన అమరావతిని కాపాడుకోవడానికి జరుగుతున్న అనితరసాధ్యమైన పోరాటం ఇవాళ ఒక ఏడాది పూర్తిచేసుకుంటోంది.
అమరావతి రాజధాని పోరాటమే వేదికగా
రేగుతున్న విలాపాగ్నులు అంత సులువుగా వృథాపోయేవి కాదు. కుట్రలను దహించి వేస్తాయి
రాలుతున్న అశ్రువులు అలా క్షితిగర్భంలోకి ఇంకిపోయేవి కాదు. జలప్రళయమై ముచెత్తుతాయి.
నిస్పృహల నిశ్వాసలు గాలిలో కలిసిపోయేవి కాదు.. ధ్వంసామారుతాలై కూల్చివేస్తాయి.
త్యాగప్రతీకలైన పొలాలు మట్టిపాలయ్యేవి కాదు.. భూకంపమై కబళించి వేస్తాయి.
మోసులెత్తిన ఆశలు నింగికెగిరిపోయేవి కాదు.. మేఘాలే ఉరుములై కూలి కుట్రలను కప్పివేస్తాయి.
అమరావతి
నిన్నటి స్వప్నం
నేటి ఉద్యమం
రేపటి.. వాస్తవమై.. అద్వితీయ వైభవమై తెలుగుజాతి యశశ్చంద్రికలను ఇనుమడింపజేస్తుంది.
ఇది తథ్యం!
అమరావతి పోరాట వీరులకు జేజేలు పలుకుతూ.. వారి వెన్నంటి నిలుద్దాం!
Also Read ;- విజయవాడను దద్ధరిల్లజేసిన అమరావతి మహాపాదయాత్ర