(విజయనగరం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
అశోక్ గజపతి ఈగో దెబ్బతింది. చంద్రబాబు నాయుడు నమ్మకంతో పెద్ద పదవిలో కూర్చోబెట్టిన మహిళా నాయకురాలి గురించి, ప్రత్యర్థులతో కుమ్మక్కయినట్టుగా తీవ్రమైన ఆరోపణలు చే
శారు. విజయనగరం టీడీపీలో కీలకనేతలుగా చెలామణి అవుతున్న మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మధ్య చోటుచేసుకున్న మనస్పర్ధలు తారస్థాయికి చేరుకున్నాయి. అశోక్ గజపతిని వ్యతిరేకిస్తూ గీత విజయనగరంలో ఏకంగా పార్టీ కార్యాలయం ప్రారంభించడంతో దీన్ని అశోక్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ ముఖ్యంగా స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ ప్రోద్బలంతోనే గీత ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని విచ్చిన్నం చేసే కుట్రలో గీత చిక్కుకున్నారని, అవగాహన రాహిత్యంతో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటువంటివి వాంఛనీయం కాదని, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతకు, పూర్వ వైభవానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సివుందని తనదైన తీరులో చెప్పారు. తాను పార్టీలో ఒక సభ్యుడిని మాత్రమేనని, అందరినీ అలానే ప్రోత్సాహించానని అన్నారు. గీత కూడా ఈ (అశోక్) బంగ్లా నుండే తెలుగుదేశం పార్టీలో పనిచేసారని, తాను ఏ రోజూ అభ్యంతరం చెప్పలేదని అన్నారు.
దీటుగా బదులిచ్చిన గీత
స్థానిక మంత్రి బొత్సతో ఎవరికి అంతర్గత సంబంధాలు ఉన్నాయో విజయనగరం ప్రజలకు తెలుసని, తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని మీసాల గీత అన్నారు. పెద్దవారని గౌరవిస్తామని, వారి అడుగుజాడల్లో నడవాలని ప్రయత్నిస్తామని, అదే అదునుగా వెనక్కు పెట్టేసే ప్రయత్నం చేస్తే సహించమని సుతిమెత్తగా హెచ్చరించారు. నాయకులు, కార్యకర్తలు కోరిక మేరకే వేరే కార్యాలయం ప్రారంభించామని, అందరికీ అందుబాటులో ఉండే కార్యాలయం అవసరమని, తానేమీ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు.
Must Read ;- లియో జోస్యం నిజం : టీడీపీ రాజు గారి కోటకు బీటలే!
అచ్చెన్న నుండి పిలుపు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచన మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నుండి మీసాల గీతకు పిలుపు వచ్చినట్లు తెలిసింది. దాంతో హుటాహుటిన ఆమె తన వర్గానికి చెందిన కొంతమందితో కలిసి కింజరాపు స్వగ్రామం నిమ్మాడ వెళ్లారు. అచ్చెన్నతో కలిసి పార్టీ పరిస్థితి, కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఆమె ప్రత్యేకంగా కార్యాలయం ప్రారంభించడానికి గల కారణాలు వివరించినట్లు తెలిసింది. అలానే రెండుమూడు రోజుల్లో అచ్చెన్న విజయనగరం వచ్చి ఈ పరిస్థితిపై అశోక్ గజపతితో చర్చించనున్నట్లు తెలిసింది. మొత్తం ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీని ఒక కుదుపు కుదపగా, జిల్లాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఉంది.
Also Read ;- ఆ వెలుగులు మా తెలుగుదేశానివే: చంద్రబాబు