అతడు పనిచేస్తోంది పవిత్రమైన ఏడుకొండలవాడి సన్నిధానంలో. నివాసం ఉంటోంది కలియుగ దైవం వేంకటేశ్వరుడి పాదాల చెంతనే. ఆ భక్తి నగరంలోని ఆధ్యాత్మిక వాతావరణం కూడా అతడి బుద్ధిని మార్చలేక పోయింది. కట్టుకున్న భార్యనే కాల్ గర్ల్ గా చిత్రీకరించిన ఓ దుర్మార్గపు టీటీడీ ఉద్యోగి దురాగతం తాజాగా వెలుగులోకి వచ్చింది.
రేవంత్.. తిరుపతిలోని టీటీడీ ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో పనిచేస్తుంటాడు. ఐదు నెలల క్రితం బెంగుళురుకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి భార్యను చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా.. చివరికి ఆమెను కాల్ గర్ల్ గా కూడా చిత్రీకరించాడు. పెళ్లైన మూడో రోజు నుంచే శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఆ యువతి.. రేవంత్ తల్లికి తన బాధ చెప్పుకున్నా.. ఆమె కూడా పట్టించుకోలేదు.
రెండు రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్తానంటే, సరేనన్నాడు. తీరా వెళ్లిన తర్వాత.. ఇంట్లో పది లక్షలు నగదు, నగలు తీసుకువెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పైగా గంటకు మూడువేలు తీసుకునే కాల్ గర్ల్ అని.. తన భార్యతో తాను సన్నిహితంగా ఉన్న ఫొటోను, ఆమె ఒంటరిగా ఉన్న ఫొటోను జతచేసి.. ఆమె స్నేహితులు ఉండే వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశాడు. తన స్నేహితుల ద్వారా ఈ దారుణం గురించి తెలుసుకున్న ఆమె.. తీవ్రంగా కలత చెందింది. తనను దొంగ అనడంతో పాటు కాల్ గర్ల్‌గా ప్రచారం చేయడంతో.. బెంగళూరు నుంచి నేరుగా తిరుపతిలోని దిశ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. పోలీసులకు తన ఒంటిపై గాయాలను చూపించింది.
చివరికి అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసులు.. రేవంత్‌ను స్టేషన్ కు పిలిపించగా.. అక్కడే భార్యను, ఆమె బంధువులను దూషించాడు. ‘పెట్టీ కేసు పెట్టారు… వెయ్యి రూపాయల లోపు ఫైన్ కట్టేస్తే సరిపోతుంది…’ అంటూ వెళ్లిపోయాడు. దీంతో.. బాధితురాలు తన బంధువులతో కలిసి రేవంత్ ఇంటి ముందు బుధవారం నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు.. దిశ డీఎస్పీని బాధితురాలి వద్దకు పంపారు. రేవంత్‌పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె అలిపిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రెండోసారి ఫిర్యాదు చేసింది. బుధవారం రాత్రి రేవంత్‌ను, అతడి తల్లి ప్రసన్న జ్యోతిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇంత ధైర్యం ఇందుకేనా..
ఇంత నీచమైన పని చేసి కూడా కాస్త కూడా తొనకకుండా దిగజారీ మాట్లాడుతున్నాడు రేవంత్. పెట్టీ కేసంటూ.. తిరిగి బాధితురాలిపైనే దూషణలకు దిగడం చూస్తుంటే వీడసలు మనిషేనా అంటూ అక్కడి వారు వ్యాఖ్యానిస్తున్నారు. అతని భార్య ఇస్తున్న సమాచారం ప్రకారం వైసీపీ నేత గోరంట్ల మాధవ్ అండ చూసుకుని ఇలా భయపడకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా వ్యవహారిస్తున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు. ఇలా తప్పు చేసిన వారికి ప్రభుత్వ నేతలే అండగా నిలబడితే తన లాంటి న్యాయం ఎలా జరుగుతుందని వాపోయింది బాధితురాలు. ఇందులో తనకు న్యాయం జరిపించాలని ప్రభుత్వాన్ని కోరింది. పోలీసులలో కూడా తనకి అండ ఉన్నారని.. విఐపీ లాగా వచ్చి వెళ్లారని బాధితురాలు చెప్పుకొచ్చింది.