సాధారణంగా మనం అత్తి చెట్ల మొదళ్లలో చిన్నచిన్న ఆకు పురుగులను చూస్తుంటాం. అక్కడ వాటి కదలికలు చాలా నెమ్మదిగా ఉంటాయి. అవి తమకున్న చిన్నచిన్న కాళ్లతో ఒక అత్తి చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి ఎలా వెళతాయి? ఇందుకుగాను అవి వేటి దగ్గరైనా ‘లిఫ్టు’ తీసుకుంటాయా? తీసుకుంటే.. ఎలా అడుగుతాయి? అసలు అవి తమ వాహకాలను ఎలా ఎంచుకుంటాయి? తమ సహచర పురుగులకు ఎలాంటి సూచనలు చేస్తాయి? ఈ దిశగా ఎప్పుడైనా ఆలోచించామా? అంటే.. లేదనే చెప్పొచ్చు. కానీ, మన శాస్త్రవేత్తలు ఆలోచించారు. అధ్యయనం చేశారు. సమాధానం కనిపెట్టారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సీ) లోని సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్సెస్ (సీఈఎస్)కు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన ఈ అధ్యయనం.. జర్నల్ ఆఫ్ ఎనిమల్ అంకాలజీలో ప్రచురితమైంది. దీని ప్రకారం.. అత్తి చెట్టు మొదళ్లలో ఉండే ఆకు పురుగులు.. అక్కడే ఎక్కువగా తిరిగే కందిరీగలను తమ వాహకాలుగా మార్చుకుంటాయి. ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి చేరే క్రమంలో.. ఇవి కందిరీగల పొట్ట భాగానికి అతుక్కుంటాయి. అలా.. ఇవి తమ గమ్యస్థానం చేరగానే తమ వాహకం నుంచి విడివడతాయి. ఈ క్రమంలో ఇవి కందిరీగకు ఏమాత్రం హాని కలిగించవు. చాలా ఒద్దికగా అతుక్కుంటాయి. మనం ఎలాగైతే ఖాళీగా ఉన్న బస్సు ఎక్కడానికి ఆసక్తి చూపిస్తామో.. ఇవి కూడా అలాగే ఖాళీగా ఉన్న కందిరీగ పొట్టనే ఎంచుకుంటాయి. ఒక కందిరీగ.. ఒకటికి మించిన పురుగుల్ని ఏకకాలంలో తీసుకెళ్లి.. జాగ్రత్తగా వాటి గమ్యస్థానాన్ని చేరుస్తుందని పరిశోధకులు తెలిపారు.
ఇక్కడ.. అత్తి చెట్టు, కందిరీగల మధ్య ఉన్న సంబంధాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని పరిశోధకులు అంటున్నారు. అత్తి చెట్టు కందిరీగకు ఆహారాన్ని అందిస్తే.. కందిరీగ.. అత్తిచెట్టు పరాగసంపర్కానికి దోహదం చేస్తుందని, కానీ, ఈ ఆకుపురుగులు మాత్రం పూర్తిగా కందిరీగల పైనే ఆధారపడతాయని వారు వెల్లడించారు.
Must Read ;- పొగరాయుళ్లంటే కొవిడ్‌కి కూడా భయమే!











