కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రైతులు ఎందుకింతగా వ్యతిరేకిస్తున్నారు? ఆ చట్టాలు అమల్లోకి వస్తే ఇక వ్యవసాయం చేయడం సాధ్యం కాదా? అంటే అవుననే అంటున్నారు.. రైతు సంఘాల నాయకులు. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో చేపట్టిన సంస్కరణలు కూడా కార్పొరేట్లకు లాభాలు దోచిపెట్టడానికే అనే అభిప్రాయం, భయం రైతుల్లో కలుగుతోంది. అంతే తప్ప రైతులకు మేలు చేసేలాలేదని వారు గుర్తుచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాల వల్ల పంటల కొనుగోళ్లు, అమ్మకాలు మొత్తం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళతాయని, దీని వల్ల రైతులకు మద్దతు ధర కూడా దక్కే అవకాశం లేదని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ మార్కెట్ యార్డులు వస్తే..
కేంద్రం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల ప్రైవేటు మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసుకునే అవకాశం కార్పొరేట్ శక్తులకు దొరుకుతుంది. ప్రైవేటు మార్కెట్ యార్డులు ప్రారంభమైతే అక్కడ రైతులకు బేరమాడే శక్తి ఉండదు. ప్రభుత్వ మార్కెట్ యార్డుల్లో అయితే ధరలు పతనం అయితే ప్రభుత్వ అధికారికి ఫిర్యాదుచేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రైవేటు యార్డులను ప్రోత్సహించే బదులు, ప్రభుత్వ యార్డులను బలోపేతం చేసి, జవాబుదారీతనం పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బీహార్‌లో ఏం జరిగిందో అందరికీ తెలుసు?
బీహార్ లో 2006లో ఏపీఎంసీ చట్టాన్ని రద్దు చేశారు. తరవాత మార్కెట్ యార్డుల్లో కొనుగోలుదారుల్లేక మద్దతుధర కంటే తక్కువకే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తోంది. ఇక ఆన్ లైన్ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో పాల్గొనాలంటే పంట నాణ్యత బాగా ఉండాలి. 90 శాతం ధాన్యాన్ని కమోడిటీ ఫ్యూచర్స్‌లో అమ్మడం సాధ్యం కాదని పంజాబ్ రైతు పోరాట సంఘం తేల్చి చెప్పింది. ధరల హామీ చట్టంతో ఒప్పంద సేద్యం బలపడుతోంది. ప్రపంచం మొత్తం మీద డిమాండ్ కు అనుగుణంగా కార్పొరేట్ సంస్థలు సాగుచేస్తే పంటల వల్ల, పంటల మధ్య వైరుద్యం దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా రైతు పోరాట సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో 70 శాతం హైబ్రిడ్ విత్తనాలు, రసానాయన పురుగుమందుల వ్యాపారాలను 4 కార్పొరేట్ సంస్థలే శాసిస్తున్నాయి. నూతన చట్టాల వల్ల పంటల ప్రాసెసింగ్, సూపర్ మార్కెట్లను కూడా కార్పొరేట్ సంస్థలు శాసించే ప్రమాదం ఉందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి సంస్థలను నియంత్రించి, జవాబుదారీగా ఉండేలా చేయడం సాధ్యం కాదని కూడా వారు వాదిస్తున్నారు.
సంస్కరణల ఫలితాలు రైతులకు చేరాయా?
దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి దాదాపు మూడు దశాబ్దాలు అవుతోంది. వీటి వల్ల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల కూడా బహుళజాతి సంస్థలే లాభపడ్డాయి. పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసి మార్కెట్లో ధరలను శాసిస్తూ కార్పొరేట్ సంస్థలు లాభపడుతున్నాయి. రైతుకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఆర్థిక సంస్కరణలు కూడా కార్పొరేట్ శక్తులకు లాభాలు పంచేందుకే ఉపయోగపడ్డాయి. కానీ వ్యవసాయరంగంలో పని చేస్తున్న రైతుల ఆదాయం మాత్రం పెరగడం లేదు.
దేశంలో ఒక రైతు కుటుంబం సగటు ఆదాయం ఏడాదికి రూ.40 వేలు మించడం లేదు. అంటే వ్యవసాయరంగంలో ఆదాయం ఏ విధంగా పడిపోయిందో ఈ గణాంకాలు చూపెడుతున్నాయి. అందుకే వ్యవసాయం చేసేందుకు యువత ముందుకు రావడం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనేక సందర్బాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకు వచ్చిన నూతన చట్టాల వల్ల రైతులు తమ పంటను ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్చని చెబుతున్నారు, కానీ రైతులకు అంతశక్తి ఉందా? లేదా? అని మాత్రం ఎవరూ చూడటం లేదు. పొలాల వద్దే ధాన్యం అమ్ముకోవడానికి ఆసక్తి చూపుతున్న రైతు పొరుగు రాష్ట్రాల్లో మార్కెట్లకు, విదేశాలకు తీసుకెళ్లి అమ్ముకోగలడా అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అప్పుడు కూడా దళారులే రైతు వేషం కడతారని, రైతుల పేరుతో తక్కవ ధరకు కొనుగోలు చేసి, ఎక్కవ ధరకు స్వేచ్ఛా మార్కెట్లో విక్రయించుకుంటారని రైతు పోరాట సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే ఉత్తరాది రైతులు కేంద్రం తీసుకు వచ్చిన నూతన చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని రైతు నాయకులు చెబుతున్నారు.