వైఎస్ ఫ్యామిలీ.. తెలుగు నేల రాజకీయాల్లో ఓ ప్రత్యేక గుర్తింపు కలిగిన కుటుంబమే. వివాదాలు, అభిప్రాయ భేదాలు లేకుండా సాగిన కుటుంబంగా ఈ ఫ్యామిలీకి గుర్తింపు ఉంది. అయితే అదంతా గతం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతోనే ఉమ్మడి కుటుంబం మాటను వైఎస్ ఫ్యామిలీ పక్కనపెట్టేసిందనే చెప్పాలి. తాజాగా రాజకీయ అవసరాల కోసం వైఎస్సార్ కుమారుడు జగన్, కూతురు షర్మిల వేర్వేరు దారుల్లో నడుస్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య మాటలు కూడా కలవడం లేదు. కనీసం తండ్రికి నివాళి అర్పించే విషయంలో కూడా వీరు వేర్వేరు దారులనే ఆశ్రయిస్తున్న వైనం ఆసక్తి రేపుతోంది. మొన్న వైఎస్సార్ జయంతి సందర్భంగా విడివిడిగానే జగన్‌చ, షర్మిలలు తండ్రికి నివాళి అర్పించారు. తాజాగా వైఎస్సార్ వర్ధంతికి కూడా వీరిద్దరూ కలిసే అవకాశం లేనట్లుగానే వార్తలు వినిపిస్తున్నాయి.
ట్వీట్ తో షర్మిల రాఖీ
ఏటా రాఖీ పర్వదినాన సోదరుడు జగన్ చేతికి షర్మిల రాఖీ కడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మాత్రం ఆమె జగన్‌కు రాఖీ కట్టలేదు. కనీసం ఫోన్ చేసి అయినా పలకరించలేదు. ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేసిన షర్మిల.. సోదరుడు జగన్ కు రాఖీ గ్రీటింగ్స్ చెప్పారు. ఇక జగన్ ఈ ట్వీట్ కు కనీసం స్పందించను కూడా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా షర్మిల పలకరించే యత్నం చేసినా జగన్ పలికే స్థితిలో లేరన్న వాదనలు లేకపోలేదు. సాధారణంగా చెల్లి అలిగితే.. అన్న ఓదార్చాలి. అయితే ఇక్కడ మాత్రం చెల్లిపై ఓ రేంజిలో అసంతృప్తిని ప్రోది చేసుకున్న జగన్.. షర్మిల పేరు వినపడితేనే మండిపోతున్నారట. ఈ క్రమంలోనే ఆయన షర్మిల ట్వీట్ ను కూడా పట్టించుకోలేదట.
వర్ధంతికి ఇలా వస్తారట
సెప్టెంబరు రెండున వైఎస్ 12వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లో వైఎస్ సతీమణి విజయమ్మ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ సంస్మరణ సభకు వైఎస్ మంత్రివర్గంలోని సభ్యులకు ఆహ్వానాలు అందటం.. వారు వస్తారా? లేదా? అన్నదిప్పుడు మరో చర్చగా మారింది. ఈ కార్యక్రమానికి షర్మిల కూడా హాజరవుతున్నారు. దీంతో.. వారు ఇడుపులపాయలో వైఎస్ కు నివాళులు ఎప్పుడు అర్పించి హైదరాబాద్ వచ్చేస్తారన్నది ప్రశ్నగా మారింది. దీనికి కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రికి నివాళులు అర్పించేందుకు ఉదయమే వస్తున్నట్లుగా సమాచారం. ఉదయం 11 గంటలకే ఆయన తాడేపల్లికి బయలుదేరుతారని చెబుతున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. జగన్ తాడేపల్లికి బయలుదేరిన వెంటనే.. విజయమ్మ, షర్మిలలు వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. హైదరాబాద్ బయలుదేరుతారని చెబుతున్నారు. దీంతో.. ఈసారికి అన్నాచెల్లెలు ఇద్దరు ఎదురుపడే అవకాశం లేనట్లేనని స్పష్టం చేస్తున్నారు.
Must Read ;- ఈ మామ గారికి ఇద్దరూ కావాలట