భారత ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్న జస్టిస్ ఎన్వీ రమణపై గత ఏడాది అక్టోబరు 6న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేసిన ఫిర్యాదును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన సుప్రీంకోర్టు గోప్యమైన, అంతర్గత పద్ధతుల ద్వారా పరిశీలన జరిపామని, ఆ పరిశీలన అనంతరం ఆ ఫిర్యాదును కొట్టివేస్తున్నట్లు చేసినట్టుగా చెబుతున్న ప్రకటన బయటకు వచ్చింది. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీ కాలం ఏప్రిల్ 23తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తన వారసుడిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే…సీనియార్టీలో రెండో స్థానంలో ఉన్న ఎన్వీ రమణ పేరును సిఫారసు చేస్తూ కేంద్ర న్యాయశాఖకు లేక పంపిన విషయం తెలిసిందే.
ఆయన కుటుంబీకులు అమరావతిలో భూములు కొనుగోలు చేశారంటూ..
ఉమ్మడి ఏపీతోపాటు పలుచోట్ల న్యాయమూర్తిగా పనిచేసిన ఎన్వీ రమణ ఏపీలో న్యాయసంబంధిత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, తీర్పులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలతోపాటు ఆయన కుటుంబీకులు అమరావతిలో భూములు కొనుగోలు చేశారని ఆరోపిస్తూ గత ఏడాది అక్టోబరు 6న ఏపీ సీఎం వైఎస్ జగన్ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు సదరు ఫిర్యాదును అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని సూచించింది. దీంతో వైఎస్ జగన్ ఈ మేరకు అఫిడవిట్ కూడా సమర్పించారు.
సీజేఐ కాకుండా అడ్డుకునేందుకే..
మరోవైపు రాజకీయ దురుద్దేశంతోనే ఏపీ సీఎం జగన్ ఈ ఆరోపణలు చేశారని, న్యాయవ్యవస్థను టార్గెట్‌గా చేసుకున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. సుప్రీంకోర్టులో సీనియార్టీలో రెండో స్థానంలో ఉన్న ఎన్వీ రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నందున ఆయనను అడ్డుకునేందుకు ఈ ఫిర్యాదు చేసినట్టూ వార్తలు వచ్చాయి. జగన్ చేసిన ఫిర్యాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ఎన్వీ రమణ పేరును సిఫారసు చేస్తూ లేఖ రాయడంతో వైఎస్ జగన్ చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు తిరస్కరించిందని చెప్పవచ్చు.
ప్రకటనలో ఏముందంటే..
6 అక్టోబరు2020న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదుపై అంతర్గత పరిశీలన జరిగింది. ఆ ఫిర్యాదు ఇన్ హౌస్ పద్దతి ప్రకారం విచారించిన తరువాత ఫిర్యాదును కొట్టివేస్తున్నాం. ఇలాంటి ఫిర్యాదుపై అంతర్గత విచారణ పద్ధతి అమలవుతుంది. బహిరంగ పర్చే అవకాశం లేదు.
ఫిర్యాదు బయటకు..
ఇక ఇదే ఫిర్యాదు విషయాన్ని అప్పట్లో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న అజయ్ కల్లం మీడియా సమావేశంలో వెల్లడించారు. చంద్రబాబుకు ఎన్వీ రమణకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించడంతోపాటు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను కూడా ప్రభాతం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ అంశం తీవ్రమైన చర్చకు దారి తీసింది. గతంలో న్యాయమూర్తుల విషయాల్లో ఉన్న అభ్యంతరాలను గోప్యంగా ఆయా వ్యవస్థలకు పంపిన సందర్భాలున్నా.. వైసీపీ ప్రభుత్వం హయాంలో న్యాయమూర్తులపై వ్యక్తిగతంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే హైకోర్టు తీర్పుల విషయంలో న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను కించపర్చడంతోపాటు దురుద్దేశాలు ఆపాదిస్తూ మీడియాలో, సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన ఘటనలూ జరిగాయి. ఈ విషయంపై సీబీఐ విచారణ కు హైకోర్టు ఆదేశించిన విషయమూ తెలిసిందే.
Must Read ;- జగన్ ఎంత విషం కక్కినా.. ఆయన ‘సుప్రీం’ హీరోనే!