దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రతిష్టకు మరోసారి తెలుగు కీర్తి జతకానుంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీ కాలం ఏప్రిల్ 23న ముగియనుంది. ఆయన స్థానంలో తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ పేరును జస్టిస్ బోబ్డే సిఫారసు చేశారు. ఈ మేరకు న్యాయశాఖకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఆ లేఖ హోంశాఖ ద్వారా రాష్ట్రపతి వద్దకు చేరనుంది. సుప్రీంకోర్టులో సీనియార్టీ ప్రకారం రెండో స్థానంలో ఉన్న, అర్హత ఉన్న వ్యక్తినే సిఫారసు చేస్తారు. ఆ సిఫారసు చేసిన వ్యక్తి మాత్రమే భారత ప్రధాన న్యాయమూర్తి అవుతారు.
48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేఖలో ఎన్వీ రమణ 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించునున్నారు. NV రమణ పదవీ కాలం 26 ఆగస్టు, 2022 వరకు ఉంది. ఆ తరువాత సీనియార్టీలో జస్టిస్ నారీమన్ ఉన్నారు. ఈయనకు ఆగస్టు 12, 2021తో పదవీ కాలం ముగియనుంది. నాలుగో స్థానంలో ఉదయ్ ఉమేష్ లలిత్ ఉన్నారు. ఈయనకు నవంబరు 8, 2022వరకు పదవీ కాలం ఉంది.
ఇక NV రమణ విషయానికి వస్తే..
జస్టిస్ నూతలపాటి వెంకటరమణ 1957 ఆగస్టు 27న కృష్ణా జిల్లా పొన్నవరంలో రైతు కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు నూతలపాటి గణపతిరావు, సరోజిని. 1982లో ఆచార్య నాగార్జున వర్సిటీ నుంచి న్యాయపట్టా పొందారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా ఎన్ రోల్ అయ్యారు. హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన సమయంలో సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసులతో పాటు లేబర్, సర్వీసు, ఎన్నికల పిటిషన్లపై వాదించారు. ఆల్మట్టి డ్యామ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించారు. భారతీయ రైల్వేతో పాటు పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు.
1998 ఏప్రిల్ 7న అదనపు అడ్వకేట్ జనరల్‌గా నియమితులైన తరువాత 2000 జూన్ 27న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 ఫ్రిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమర్తిగా పలు కీలక కేసులకు తీర్పు చెప్పారు. జమ్మూ-కశ్మీరులో ఇంటర్నెట్ సస్పెన్షన్ , సుప్రీంకోర్టు సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తుందని చెప్పడం, తదితర కేసుల్లో కీలకమైన తీర్పు ఇచ్చారు.
రెండో తెలుగు వ్యక్తి..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అదిష్టించనున్న రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ. 1966 జూన్ 30న రాజమండ్రికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యారు. ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఈయన రికార్డు సాధించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో కోకా సుబ్బారావు ఇచ్చిన గోలక్‌నాథ్ – పంజాబ్ రాష్ట్రం కేసు తీర్పు అత్యంత కీలకమైంది. చాలా కేసులకు రిఫరెన్స్‌గా కూడా ఉపయోగపడుతోంది. ఈ కేసులో భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులను చట్టసభలు సవరించేందుకు వీలులేదని చారిత్రక తీర్పునిచ్చారు. ఆ అధికారం పార్లమెంటుకి కూడా లేదని తీర్పునిచ్చారు. జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ షా, జస్టిస్సిక్రి, జస్టిస్ షిలత్, జస్టిస్వైదియలింగంతో కూడిన ధర్మాసనం ఇచ్చి ఈ తీర్పు.. పలు కేసుల్లో రిఫరెన్స్‌గా ఉపయోగపడుందని చెప్పవచ్చు. ఆయన తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
Must Read ;- జగన్ ఎంత విషం కక్కినా.. ఆయన ‘సుప్రీం’ హీరోనే!