ఒక తెలుగువాడు.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. రెండు రాష్ట్రాల్లో విస్తరించిన తెలుగుజాతికి ఇది ఖచ్చితంగా గర్వకారణం. సుప్రీం కోర్టు జస్టిస్ ఎన్‌వి రమణ.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. ఈమేరకు ఆయన నియామకానికి మార్గం సుగమం చేసే లాంఛనం ఆల్రెడీ పూర్తయింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బోబ్డే.. తన పదవీవిరమణ తర్వాత.. భారత సుప్రీం కోర్టు 48వ సీజేఐగా కావడానికి ఎన్.వి.రమణ పేరును ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన కేంద్ర న్యాయశాఖకు లేఖరాశారు. జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవీవిరమణ చేస్తారు. ఆతర్వాత ఎన్ వి రమణ సుప్రీం సీజేఐ అయ్యే అవకాశం ఉంది.
ఇది జరగకుండా విషం కక్కిన జగన్!
ఎన్ వి రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా.. ఆయన క్రెడిబిలిటీని దెబ్బతీసేలా, ఆయన విశ్వసనీయతను భంగపరిచేలా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరదళం సుదీర్ఘమైన స్కెచ్ వేశారనే ప్రచారం బాగా ఉంది. హైకోర్టు న్యాయమూర్తులతో పాటు, సుప్రీం న్యాయమూర్తి ఎన్ వి రమణపై అనేక ఆరోపణలు చేస్తూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. ఎన్ వి రమణ కుమార్తెలు అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారని, అందుకే అమరావతి రాజధానికి అనుకూలంగా, అనుచితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొనడంతో పాటు ఆ లేఖలో అనేకానేక ఆరోపణలున్నాయి.
మీడియాకు లేఖ విడుదల
లేఖ రాయడం ఒక ఎత్తు అయితే.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి అజేయకల్లం.. ప్రెస్ మీట్ పెట్టి.. ఆ లేఖను మీడియాకు విడుదల చేయడం.. దేశంలో చాలా పెద్ద దుమారాన్నే లేపింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మాత్రమే కాదు.. దేశంలో ఏ పౌరుడు అయినా సరే.. న్యాయవ్యవస్థలోని కీలక న్యాయమూర్తుల మీద తమకు సందేహాలు ఉన్నప్పుడు వాటిని సహేతుక నేపథ్యంతో.. ఇలా పై వారి దృష్టికి తీసుకెళ్లడానికి అన్ని హక్కులూ ఉంటాయి. మన రాజ్యాంగం ప్రసాదించే ప్రాథమిక హక్కుల్లో అది కూడా ఒకటి. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంతటి కీలక పదవిలో ఉంటూ.. ఆ లేఖను బహిరంగ పరచడం.. మీడియాకు విడుదల చేయడం అనేది చాలా తీవ్రమైన అంశంగా అనేక మంది న్యాయనిపుణులు పరిగణించారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై కుట్రపూరిత దాడికి పాల్పడడం ద్వారా.. తమ అనుచిత స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికే ఇలాంటి ప్రయత్నం జరిగిందంటూ.. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు జగన్ పోకడలను తప్పుపట్టారు.
ఓవరాక్షన్‌తో ఉక్కిరిబిక్కిరి
ఇలాంటి ఓవరాక్షన్ ధోరణులతో జగన్ సర్కారు ఉక్కిరి బిక్కిరి అయింది. నష్ట నివారణ చర్యలకు కూడా వారికి మార్గాలు స్ఫురించలేదు. ఆ ప్రెస్ మీగ్ తర్వాత.. అజేయకల్లం ఇప్పటిదాకా ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. ఒక రకంగా అజ్ఞాతంలోకి పారిపోయినట్లుగా వాతావరణం తయారైంది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉన్న తెలుగు వ్యక్తి ఎన్ వి రమణపై ఇలా కుట్రపూరితంగా ఆరోపణలు గుప్పించడం ద్వారా.. ఆయనకు దక్కగల అవకాశాలు పలచన అవుతాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారని అప్పట్లో బహుముఖంగా వినిపించింది. ఎన్ వి రమణ ప్రతిష్ఠను దెబ్బతీసేలా.. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు అయిన అనేక మంది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రముఖులు వేర్వేరు సందర్భాల్లో.. అనేక ఆరోపణలు గుప్పించడం కూడా జరిగింది.
ఎన్ వి రమణపై విషం కక్కిన వైసీపీ శ్రేణులు
ఈ రకంగా.. ఎన్ వి రమణపై విషం కక్కడానికి, బురద చల్లడానికి పార్టీ శ్రేణులు ముమ్మరంగానే పనిచేశాయి. అధికారికంగా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేసిన వారు కొందరైతే న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో.. కక్కిన విషానికి తిరుగులేదు. న్యాయమూర్తుల మీద విషయం చిమ్మిన వారిపై హైకోర్టు స్వయంగా కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశిస్తే.. ఆ వ్యవహారం ఏమైందో ఇప్పటికీ అతీగతీ లేదు.
ఇవన్నీ క్రోడీకరించుకుని చూసినప్పుడు.. ఎన్‌వి రమణ సహా.. న్యాయమూర్తులపై న్యాయవ్యవస్థపై జగన్మోహన్ రెడ్డి చేసిన దాడి ఒక పథకం ప్రకారం జరిగినదనే అభిప్రాయమే అందరికీ కలిగింది. ఈ ప్రయత్నాలు అన్నీ కూడా రమణ సుప్రీం కోర్టు సీజేఐ కాకుండా అడ్డుపడడానికేనని, ఆయన అవకాశాలకు గండికొట్టడానికే అని చాలా మంది భావించారు.
ఫలించని జగన్ ఆశలు
అయితే.. జగన్ ఆశలు ఫలించలేదు. ఎంతగా ఆయన విషం కక్కినప్పటికీ.. జస్టిస్ ఎన్‌వి రమణ అవకాశాలు పదిలంగానే ఉన్నాయి. ఆయన ప్రాధాన్యానానికి, ఆయన సీనియారిటీకి ఏమాత్రం నష్టం జరగలేదు. ప్రస్తుత సీజేఐ బోబ్డే మరో నెలరోజుల్లో పదవీవిరమణ చేయనుండగా.. రమణను తర్వాతి సీజేఐగా సిఫారసు చేస్తూ కేంద్ర న్యాయశాఖకు లేఖ రాయడం కూడా పూర్తయింది.
రమణ సీజేఐ అయితే జగన్‌కు నష్టమేంటి?
సాధారణంగా మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి.. జాతీయ స్థాయిలో అత్యున్నత హోదాల్లోకి వెళుతోంటే.. రాష్ట్రంలో ఉన్న వారందరూ గర్విస్తారు. రమణ సుప్రీం సీజేఐ అయితే.. జగన్ ఎందుకిలా అడ్డుపడుతున్నారు? కంగారు పడుతున్నారు? అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. తన మీద ఉన్న కేసుల విషయంలో.. తన ఇష్టానుసారం కోర్టు నిర్ణయాలు వచ్చేలా ప్రభావితం చేయడం కుదరదనే ఉద్దేశంతోనే.. రమణకు వ్యతిరేకంగా జగన్ ఇలాంటి లేఖ రాశారా? అనే అనుమానాలు కూడా ప్రజల్లో వచ్చాయి.
అవి నిజమో కాదో తెలియదు గానీ.. జగన్ రాసిన లేఖకు, చేసిన ఆరోపణలకు ఎలాంటి మన్నన దక్కకపోగా.. తెలుగువాడైన ఎన్ వి రమణ.. మరో నెలరోజుల్లో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కాబోతున్నారు. ఇది తెలుగువారందరూ గర్వించాల్సిన విషయం.
Must Read ;- ‘సుప్రీం’లో మరో తెలుగు కీర్తి పతాక.. జస్టిస్ కోకా సుబ్బారావు తరువాత జస్టిస్ ఎన్వీ రమణ