కొవిడ్ సెకండ్ వేవ్ అనేది దేశం మొత్తానికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. చాలా రాష్ట్రాలు పాఠశాలలను పూర్తిగా మూసివేశాయి. పొరుగున ఉన్న తెలంగాణ కూడా బుధవారం నుంచి పాఠశాలలను పూర్తిగా మూసివేసింది. కానీ.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి చిత్రంగా కనిపిస్తోంది.
కేవలం ఆన్‌లైన్ తరగతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ చాలా గొప్పగా ప్రకటించారు. అక్కడికేదో తమ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తు మీద.. వారి విద్యా విషయక అంశాల మీద అపరిమితమైన శ్రద్ధ ఉన్నట్లుగా ఆయన చాటుకోవడానికి ప్రయత్నించారు. పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహిస్తామని, కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన సెలవిచ్చారు.
కానీ.. ఇంత పట్టుదల ఎందుకో అర్థం కావడం లేదు. తెలంగాణ వరకు పోల్చి చూసుకున్నట్లయితే.. అక్కడ నిన్నటివరకు 6-10 తరగతులకు పాఠశాలలు నడిపినప్పటికీ తాజాగా మూసేశారు. ఆన్ లైన్ కొనసాగుతాయని అన్నారు. కానీ ఏపీలో మాత్రం ససేమిరా అంటున్నారు. తద్వారా.. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే వాతావరణం సృష్టిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
ఎందుకంత ప్రమాదం?
చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కరోనా సోకినప్పటికీ.. వారిలో రోగ లక్షణాలు బయటపడడం, ప్రాణాంతకంగా పరిణమించడం తక్కువగా ఉంటుందనేది ఒక అంచనా. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ వందల సంఖ్యలో చిన్నారులు కరోనా బారిన పడుతున్నారు. అయితే.. వారికి వైరస్ సోకినట్లయితే వారిలో రోగ లక్షణాలు బయటపడకపోయినప్పటికీ.. ఇంటికి వెళ్లిన తర్వాత.. వారి తల్లిదండ్రులు వ్యాధిబారిన పడే ప్రమాదం ఎక్కువ. ఇలాంటి భయాలతోనే.. పాఠశాలలను దేశవ్యాప్తంగా మూసేయడానికి అనేక రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. కానీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రాణాలంటే లెక్కే లేనట్లుగా వ్యవహరిస్తోంది.
మూసేస్తే ఏమవుతుంది?
పాఠశాలలు మూసేస్తే ఏమైనా ఉపద్రవం సంభవిస్తుందా? అంటే.. అలాంటిదేమీ లేదు. పిల్లలకు విద్యాసంవత్సరం వృథా అయితే తప్ప ఇంకో రకం ప్రమాదం ఉండదు. కానీ.. ఇప్పటికే విద్యాసంవత్సరం వృథా కానివ్వని పరిస్థితికి చేరుకున్నాం. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు లేకుండా.. విద్యార్థులందరినీ తర్వాతి తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు నిర్ణయాలు కూడా వచ్చేశాయి. తెలంగాణ కూడా అదే బాటలో ఉంది. ఏపీలో కూడా విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తే వచ్చే నష్టమేమీ లేదు. ఎటూ జూన్/జులై నెలల్లో వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పూర్తి వాక్సినేటెడ్‌గా సురక్షిత పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అప్పుడు ఒకటి రెండు నెలల పాటూ పాత తరగతి సిలబస్‌ను చెప్పి.. తర్వాత.. కొత్త తరగతి చదువులు ప్రారంభిస్తే.. విద్యార్థులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుందని అన్నట్లుగా.. ప్రభుత్వం సంకల్పిస్తే.. అటు విద్యా సంవత్సరం వృథాకాకుండా, ఇటు చదవుల్లో వెనుకబడకుండా, అదేసమయంలో పాఠశాలలు తెరవకుండా- కోవిడ్ బారిన పడకుండా జరపడానికి అనేక మార్గాలున్నాయి. అయితే ప్రభుత్వం అలాంటి ఆలోచనలేమీ చేయకుండా.. పాఠశాలలు నిర్వహించి తీరుతాం అనేది నియంతృత్వ ధోరణికి నిదర్శనంగా ఉన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తమకు అవసరమైనప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ ముదురుతోంది.. మేం ఎన్నికలు నిర్వహించలేం అంటూ సాకులు చెప్పే ప్రభుత్వం.. తీరా ఇప్పుడు కొవిడ్ సెకండ్ వేవ్.. విజృంభిస్తున్న తరుణంలో పాఠశాలలు నిర్వహించే విషయంలో మంకుపట్టు పట్టడం ఆశ్చర్యకరం. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం నిర్ణయాలను సమీక్షించకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Must Read ;- కరోనా ఎఫెక్ట్ : తెలంగాణలో స్కూల్స్, కాలేజీలు బంద్











