పొరుగు రాష్ట్రాల్లో కోరలు చాచిన కరోనా మహమ్మారి ఇప్పుడు తెలంగాణపై విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసులే ఇందుకు ఉదాహరణ. తెలంగాణలో ఆరు రోజుల వ్యవధితో పోలిస్తే ఇప్పుడు కేసులు పెరిగాయి. కొన్నిచోట్ల స్వల్పంగా, కొన్నిచోట్ల కాస్తంత ఎక్కువగానే నమోదయ్యాయి. ప్రజల్లో నిర్లక్ష్యం ఫలితంగానే తెలంగాణలో వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోందన్న అభిప్రాయం కలుగుతోంది. తెలంగాణలో ఆదివారం 38 వేల మందికి టెస్టు చేయగా.. 157 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 35 మందికి కరోనా సోకింది. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,318కి చేరుకోగా ఇప్పటివరకు మొత్తం 2,97,681 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,654గా ఉంది.
నిర్లక్ష్యం కారణంగానే..
తెలంగాణలో ప్రస్తుతం 1,983 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 718 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. శనివారం నాటికి తెలంగాణలో 60 ఏళ్లు పైబడినవారు, 45–59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కలసి మొత్తం 2,15,980 మంది టీకా వేయించుకున్నారు. ప్రజలు మాస్కులు పెట్టుకోకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, రద్దీ ప్రాంతాలు, ప్రయాణాల్లో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతోనే మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని డాక్టర్లు అంటున్నారు.
Must Read ;- దేశంలో కొత్తగా రెండు కరోనా వేరియంట్స్..