2020 మార్చి22..జనతా కర్ఫ్యూకి కొనసాగింపుగా మార్చి 23 నుంచి తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అత్యవసరాలు తప్ప..మిగతావన్నీ బంద్ చేస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ప్రాథమికంగా మార్చి 31వరకు ఈ లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించారు. రెండురోజుల తరువాత అంటే మార్చి 25నుంచి దేశమంతా లాక్ డౌన్ ప్రకటిస్తూ ప్రధాని ప్రకటన చేశారు. సరిగ్గా ఏడాది క్రితం తెలంగాణలో లాక్ డౌన్ మొదలైంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రెండోవిడత లాక్ డౌన్‌ను ఏప్రిల్ 15నుంచి మే 3 వరకు, మూడో విడత మే 17వరకు, నాలుగో విడత మే 31వరకు ప్రకటించారు. రెండో విడత తరువాత కొన్ని మినహాయింపులు ఇచ్చారు. మొదటి విడత లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల వెతలు, బయటకు వెళ్లిన వారికి పోలీసుల ఆంక్షలు, సొంత ప్రాంతాలకు దూరంగా ఉన్న కుటుంబాలు, పిల్లలు ఒకచోట..తల్లిదండ్రులు ఒక చోట ఉన్న కుటుంబాల ఆవేదన అంతా ఇంతా కాదు. సరిగ్గా ఏడాదైంది. అదే భయం కొనసాగుతున్నా.. నిర్లక్ష్యమూ పెరిగిందని చెప్పవచ్చు. గత ఆరు నెలలుగా కొవిడ్ కేసుల సంఖ్య తగ్గినట్టు కనిపించినా.. పక్షం రోజులుగా మళ్లీ పెరుగుతుండడంతో కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో విద్యాసంస్థల మూసివేతకు సర్కారు నిర్ణయం తీసుకుంది.
పెరుగుతున్న కేసుల సంఖ్య
ఇక గడిచిన ఐదురోజుల్లో దేశంలోనూ కేసుల సంఖ్య పెరిగింది. టెస్టులూ పెరిగాయి. మార్చి 18న 39 వేలు, మార్చి 19న 42 వేలు.., మార్చి 20న 43 వేలు.., మార్చి 21న 46 వేలు.., మార్చి 22న 43 వేల కేసులు చొప్పున నమోదయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలోనూ కేసుల సంఖ్య పెరిగింది. అయితే టెస్టుల సంఖ్య పెరగడం కూడా కేసుల సంఖ్య పెరిగేందుకు కారణమైంది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన టెస్టుల సంఖ్య 96,50,662కాగా గత 24 గంటల్లో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,151 ఉండగా.. వీరిలో 1,285 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతునట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశం మొత్తం మీద కొవిడ్ బాధితుల సంఖ్య 1కోటి 16లక్షల 86వేల 796కు చేరింది.
Also Read ;- కరోనా ఎఫెక్ట్ : తెలంగాణలో స్కూల్స్, కాలేజీలు బంద్
నిర్లక్ష్యమూ కారణమే..
ఓవైపు టెస్టుల సంఖ్య పెంచడంతో కొవిడ్ కేసుల సంఖ్య పెరగడం ఒక కారణం కాగా.. పౌరుల నిర్లక్ష్యం కూడా కారణంగా కనిపిస్తోంది. గత రెండు నెలల్లో మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న వారి సంఖ్య, మాల్స్‌లో తిరుగుతున్న వారి సంఖ్య ఎక్కువైంది. సామాజిక దూరం పాటించకపోవడంతో పాటు రోగనిరోధక శక్తి పెంచుకునే యత్నం ఆపివేయడం కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓవైపు హెర్డ్ ఇమ్యూనిటీ 60శాతానికి పైగా వచ్చిందని చెబుతున్నా.. కొవిడ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. వివాహాది శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు గతంలో కొన్ని జాగ్రత్తలు పాటించే పరిస్థితి ఉండేది. అయితే క్రమేణా సాధారణ సంఖ్యలో జనం గుమి కూడడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంకూడా కారణంగా కనిపిస్తోంది.
విద్యా సంస్థల మూసివేత..
తెలంగాణలో బుధవారం నుంచి విద్యాసంస్థలను మూసివేయనున్నారు. ఈమేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాత్కాలికంగా విద్యా సంస్థల మూసివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆన్‌లైన్ క్లాసులు యథావిధిగా కొనసాగుతాయన్నారు. మెడికల్ కాలేజీలకు మినహాయింపునిచ్చారు.
విభేదించేవారూ ఉన్నారు..
కాగా కొవిడ్ భయంతో లాక్ డౌన్ మళ్లీ ఉంటుందని కొన్నిచోట్ల వార్తలు వస్తున్నా..ప్రభుత్వాలు అలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చాయి. ఆర్థిక వ్యవస్థలపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో లాక్ డౌన్‌ని వ్యతిరేకించేవారూ ఉన్నారు. అదే సమయంలో విపరీతమైన భయం కూడా ప్రమాదమేనని, కొవిడ్ కంటే టెన్షన్ చాలా డేంజర్ అని చెప్పేవారూ ఉన్నారు.
Must Read ;- అత్యవసరమైతే తప్ప… బయటకు రావొద్దు : కరోనాపై మంత్రి ఈటల సమీక్ష