Jagan Government Raises Electricity Tariffs In AP :
ఆగస్టు వినియోగానికి సంబంధించి ఈ నెల ఆరంభం నుంచి విద్యుత్ బిల్లుల జారీ మొదలైపోయింది. కొందరికి ఇప్పటికే బిల్లులు చేరినా.. మరికొందరికి త్వరలోనే బిల్లులు చేతికందనున్నాయి. ఇప్పటికే బిల్లులు అందుకున్న వారు.. జగన్ మార్కు షాక్ కు గురయ్యారు. బిల్లులు రాని వారికి త్వరలోనే షాక్ తగలనుంది. ఏడాదిన్నర క్రితం కూడా జగన్ విద్యుత్ చార్జీలను భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. అయితే నాడు విద్యుత్ బిల్లుల పెంపునకు సంబంధించి ముందుగానే చెప్పిన జగన్ సర్కారు..తక్కువ విద్యుత్ ను వినియోగించే వారిపై ఎలాంటి భారం పడదని చెబుతూనే.. శ్లాబ్ ల వారీగా భారీగా ధరలు పెంచేసి జనాన్ని పిండేశారు. నాటి షాక్ నుంచి చాలా మంది ఇంకా కోలుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే.. నెలకు సరాసరిరూ.1,500 కరెంట్ బిల్లు కట్టే వినియోగదారుడు చార్జీల పెంపు తర్వాత ఏకంగా రూ.7 వేల నుంచి రూ.25 వేల వరకు చెల్లించాల్సి వచ్చింది. ఇదేంటని అడిగితే.. మీరు వినియోగించిన విద్యుత్ కు సంబంధించిన శ్లాబ్ ల వారీగా పెరిగిన బిల్లులే వేశాం.. కట్టి తీరాల్సిందేనన్న సమాధానాలు వచ్చాయి. అంతేకాకుండా పెరిగిన బిల్లులు చెల్లించేందుకు డబ్బుల్లేక వాయిదాలు కోరినా జగన్ సర్కారు ఇవ్వలేదు. ఫలితంగా జనం నానా పాట్లు పడి ఎలాగోలా బిల్లులు చెల్లించేశారు.
ఇప్పుడు ట్రూ అప్ అంట
ఆ పెరిగిన విద్యుత్ చార్జీలకు సంబంధించిన అనుభవాలను జనం ఇంకా మరిచే పోలేదు. అప్పుడే జగన్ మరో బాదుడుకు రెడీ అయిపోయారు. గతంలో మాట చెప్పాకే బాదుడు స్టార్ట్ చేసిన జగన్.. ఈ దఫా మాట మాత్రంగా కూడా చెప్పకుండానే.. బాదుడు మొదలెట్టేశారు. గతంలో శ్లాబ్ ల వారీగా ధరలు పెంచుతున్నానని చెప్పిన జగన్..వంద యూనిట్ల లోపల వాడకం ఉన్న వారికి ఉపేక్షించారనే చెప్పాలి. అయితే ఇప్పుడు ట్రూ అప్ చార్జీల పేరిట పేదలనూ వదిలేది లేదన్నట్లుగా జగన్ సాగుతున్నారు. ట్రూ అప్ చార్జీల కింద ఒక్కో యూనిట్ కు దాని శ్లాబ్ ప్రకారం ధరతో పాటుగా అదనంగా రూ.1.23 వసూలు చేస్తారట. అంటే.. వంద యూనిట్లు వినియోగించే పేదలు కూడా తాము ఇప్పటిదాకా చెల్లిస్తున్న బిల్లుకు అదనంగా రూ.123 చెల్లించాల్సిందే. అంటే.. విద్యుత్ చార్జీల రెండో పెంపులో జగన్ పేదలను కూడా పించేస్తున్నారన్న మాటే కదా.
ఈ దఫా నిరసనలు తప్పవు
తొలి సారి విద్యుత్ చార్జీల పెంపు సందర్భంగా ఎలాగూ జనం నుంచి నిరసనలు తప్పవన్న భావనతో పేదలను మినహాయించిన జగన్ సర్కారు.. మధ్యతరగతి ప్రజలతో పాటు ధనికులను పిండేశారు. పేదలకు పెద్దగా పెరుగుదల లేని కారణంగా జనం నుంచి కూడా పెద్దగా తిరుగుబాటు లేదనే చెప్పాలి. అయితే ఈ దఫా ట్రూ అప్ చార్జీలు అందరిపైనా విధిస్తూ జగన్ సర్కారు ఇప్పటికే చర్యలు చేపట్టిన నేపథ్యంలో నిరసనలు హోరెత్తడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అప్రకటిత విద్యుత్ చార్జీల పెంపు అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. జనానికి అందుతున్న విద్యుత్ చార్జీల తాజా బిల్లులను సేకరిస్తున్న విపక్షాలు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. అయితే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఆదేశాల మేరకే జగన్ సర్కారు విద్యుత్ చార్జీలను పెంచేసిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒక వేళ మోదీ సర్కారు ఆదేశించినా.. బిల్లులు వసూలు చేసేది జగన్ సర్కారే కాబట్టి.. బిల్లులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకే చేరతాయి కాబట్టి.. జగన్ సర్కారే దోషిగా నిలబడాల్సి వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- రాబడి పెరిగినా అప్పులెందుకో?