నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఏదన్న విషయంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఏపీ ప్రజలతో ఆటలాడుతోందా? లేదంటే.. జగనే కేంద్రంలో ఈ తరహా నాటకాలు ఆడిస్తున్నారా? అంటూ ఇప్పుడు కొత్త తరహా విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా పెట్రోల్ ధరలపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చే క్రమంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు అందించిన లిఖితపూర్వక సమాధానంలో ఏపీ రాజధాని విశాఖపట్నమేనని తేల్చేసింది. అయితే ఏమైందో తెలియదు గానీ.. మూడు రోజులకే ఆ ప్రశ్నకు ఓ సవరణను యాడ్ చేస్తూ విశాఖ ఏపీకి కేవలం రెఫరల్ కేపిటల్ అంటూ సవరణ ప్రకటనను విడుదల చేసింది. ఈ విషయంపై ఏపీలో గడచిన రెండు రోజులుగా భీకర చర్చ జరుగుతోంది. అదే సమయంలో విశాఖ అభివృద్ధిపైనా అధికార వైసీపీ, విపక్ష టీడీపీపై ఓ ఆసక్తికర యుద్ధం మొదలైపోయింది. ఈ యుద్ధాన్ని విపక్ష టీడీపీ మొదలెడితే.. వైసీపీ నుంచి అసలు సమాధానమే రాని వైనంపైనా ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఏపీ ప్రజలతో ఆటలాడుతోందా?
తెలుగు నేల విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఏపీకి రాజధానిగా చంద్రబాబు సర్కారు ఎంపిక చేసిన అమరావతిని గుర్తించింది. భారత దేశ మ్యాప్ లోనూ ఇదే అంశాన్ని పొందుపరచింది. అంతేకాకుండా అమరావతిలో రాజధాని నిర్మాణానికి స్వయంగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ భూమి పూజ కూడా చేశారు. అయితే జగన్ అధికారంలోకి రాగానే.. అమరావతిని పురిట్లోనే చంపేసే చర్యలకు అడుగు పడింది. అమరావతిని కేవలం శాసన రాజధానికి పరిమితం చేసేసి.. విశాఖలో పరిపాలనా రాజధానిని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామంటూ జగన్ సర్కారు సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రకటనపై టీడీపీ తనదైన శైలిలో శాసనమండలిలో జగన్ సర్కారుకు చెక్ పెట్టగా.. రాజధానికి 34 వేల ఎకరాలిచ్చిన రైతులు 600 రోజులకు పైబడి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఏపీ రాజధాని విశాఖను తాము అంగీకరిస్తున్నామన్నట్లుగా మోదీ సర్కారు ఇటీవల పలు సందర్భాల్లో చెబుతూ వస్తోంది. ఆ క్రమంలోనే పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఏపీ రాజధాని విశాఖగా పేర్కొంటూ పార్లమెంటుకు అందించిన లిఖితపూర్వక సమాధానంలో చెప్పేసింది. అయితే రోజుల వ్యవధిలోనే విశాఖను ఏపీకి రెఫరల్ కేపిటల్ గా పరిగణిస్తూ ప్రకటన చేసింది. దీంతో కేంద్రం కావాలనే ఏపీ ప్రజలతో ఆటలాడుతోందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
జగన్ కోరిక మేరకేనా..?
ఇదిలా ఉంటే.. కేంద్రం తీసుకున్న యూటర్న్‌కు జగన్ చేసిన విజ్ఞప్తే కారణమన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామన్న దిశగా జగన్ సర్కారు ఆదిలో ఓ రేంజి స్పీడులో వెళ్లింది. అయితే ఈ విషయంపై లెక్కలేనన్ని ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో మూడు రాజధానులపై జగన్ వెనక్కు తగ్గారన్న వాదనలు వినిపించాయి. అమరావతిలోని హైకోర్టు విస్తరణకు క్షణాల్లో నిధులు విడుదల చేయడం, అనంతపురం- అమరావతి రహదారి నిర్మాణానికి మొగ్గు చూపడం లాంటి కారణాలను చూపుతూ విశ్లేషణలు సాగాయి. ఈ క్రమంలోనే పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఏపీ రాజధాని అమరావతికి బదులుగా విశాఖను పేర్కొన్న అంశం తనకు తెలిసిన వెంటనే.. జగన్ కేంద్రాన్ని సంప్రదించారని, విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటించొద్దంటూ ఆయన కేంద్రం పెద్దలను వేడుకున్నారన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆ దిశగా స్వయంగా పార్లమెంటుకే వెల్లడించిన నేపథ్యంలో దానిపై వెనకడుగు వేయలేమని కేంద్రం చెబితే.. కనీసం ఆ భావనను డైల్యూట్ అయినా చేయాలని జగన్ కోరారట. జగన్ కోరిక మేరకే కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ విశాఖను ఏపీ రెఫరల్ కేపిటల్ గానే పేర్కొనాలంటూ సవరణ జారీ చేసిందట. మరి ఈ వాదనల్లో ఏది నిజమో?.. అసలు ఏం జరుగుతుందోనన్న చర్చ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.
Must Read ;- చింతమనేని మళ్లీ అరెస్ట్ .. రీజనే ఇంటరెస్టింగ్