Even Mother Vijayamma Did Not Give Clean Chit To Jagan :
ఈ దేశంలో రామరాజ్యం అంటే ఏమిటో ప్రజలకు తెలుసు. ప్రజలకు ఎలాంటి కష్టనష్టాలు తెలియనివ్వని మంచి పాలనగా అందరూ చెబుతుంటారు. రామరాజ్యంతో పోలస్తుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చాలా అద్భుతమైన ప్రజాహితమైన పరిపాలన సాగించారనేది ఆయన అభిమానుల భావన. అందుకే వారు తరచుగా ‘రాజన్న రాజ్యం’ అని వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ల మాటల ప్రకారం రాజన్న రాజ్యం అనేది మంచి పాలన అని అనుకుంటే.. దానిని సాధించడంలోనైనా ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సక్సెస్ ఫుల్ గా ఉన్నదా అనేది ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటినుంచి అద్భుతాలు సృష్టించేస్తునారని, ప్రజలు ఆయనని దేవుడిగా కొలుస్తున్నారని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా చాలా ప్రచారం చేస్తుంటారు. ఆయన సీఎం కావడంతోనే రాష్ట్రంలో రాజన్న రాజ్యం వచ్చేసిందని కూడా చెప్పుకుంటూ ఉంటారు. జగన్ కు భజన చేయడం ద్వారా తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకునే లక్ష్యాలతో ఉండేవాళ్లు ఎన్ని మాటలైనా చెప్పవచ్చు గానీ.. ఆయన సొంత కుటుంబ సభ్యులకు మాత్రం అలాంటి నమ్మకం కలుగుతున్నట్లు లేదు.
చెల్లి తేల్చి పారేసింది
జగనన్న విడిచిన బాణం నేను అంటూ జగన్ కోసం, ఆ పార్టీ కోసం వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. పార్టీని నిలబెట్టిన చెల్లెలు షర్మిల.. ఇప్పుడు జగన్ మీద నిందలు వేయడం ఒక్కటే తక్కువ. జగన్ తో పూర్తిగా విభేదించి ఆయనకు దూరం జరిగారు. కనీసం రాఖీ కూడా కట్టలేదు. తండ్రి వర్ధంతి కార్యక్రమం నాడు అన్నతో కలిసి పాల్గొన్నా.. అన్నకు సమీపానే కూర్చున్నా.. దాదాపు 45 నిమిషాలు ఇద్దరూ ఒకేచోట ఉన్నా.. కనీసం అన్నను పలకరించలేదు. పైగా తెలంగాణలో తాను స్థాపించిన పార్టీ ద్వారా ‘‘అసలైన రాజన్న రాజ్యం’’ ఏంటో ప్రజలకు చూపిస్తానని అంటున్నారు. అంటే.. ఏపీలో జగన్ సాగిస్తున్న పాలన రాజన్న రాజ్యం కానే కాదని ఆమె సూటిగానే చెప్తున్నారు. చెల్లెలు అన్నతో విభేదించింది గనుక.. ఇలా మాట్లాడిందని అనుకోవచ్చు. కానీ తల్లి కూడా జగన్ కు ఈ విషయంలో క్లీన్ చిట్ ఇవ్వకపోవడమే గమనార్హం.
జగన్ పై తల్లికి నమ్మకం లేదు
వైఎస్సార్ వర్ధంతి నాడు హైదరాబాదులో జరిగిన షర్మిల పార్టీ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ కూడా మాట్లాడారు. ఏపీలో ముఖ్యమంత్రి అయిన తన కుమారుడు జగన్ ‘‘రాజన్న పాలన తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడని’’ మాత్రమే విజయమ్మ అన్నారు. అంటే జగన్ తల్లి దృష్టిలో కూడా ఇంకా రాజన్న రాజ్యం ఏపీలో రాలేదన్నమాట. ఆయన వందిమాగధులేమో.. రాజశేఖరరెడ్డిని మరిపించేలా వేల కోట్ల రూపాయల ప్రజాసంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, ప్రజలు రాజన్న రాజ్యాన్ని మించి.. జగన్ పాలన సాగిస్తున్నాడని అంటోంటే.. ఆయన సొంత తల్లి మాత్రం.. కొంచెం తేడాగా మాట్లాడడం విశేషం. వైఎస్ విజయమ్మ జగన్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారని గతంలోనూ వార్తలు వచ్చాయి. అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని ఆమె వ్యతిరేకించారని గుసగుసలు వినిపించాయి. అమరావతిలో దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చి.. జగన్ నిర్ణయాల కారణంగా ఆగిపోయి బావురుమంటున్న అనేక నిర్మాణాలను విజయమ్మ స్వయంగా ఒక రోజు పర్యటించి చూడడం కూడా జరిగింది. సగం పనులు జరిగిన అన్ని భవనాలను పూర్తిచేయించకపోతే ఎందుకూ కొరగాకుండా పోతాయని ఆమె అభిప్రాయపడినట్టు వినిపించింది. అయినా అమరావతికి అతీగతీ లేకుండా పోయింది. అభిమానులు జగన్ ను ఒక రకంగా కీర్తిస్తోంటే.. తల్లి విజయమ్మ.. రాజన్న పాలన తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడంటూ తన అభిప్రాయం చెప్పడం చర్చనీయాంశమే.
Must Read ;- అన్నాచెల్లెలూ.. ముభావంగా, మాటల్లేకుండా!