తెలుగు నేలకు చెందిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిజంగానే దేశ న్యాయ వ్యవస్థలో మునుపెన్నడూ లేని రీతిలో సరికొత్త సంస్కరణలు వచ్చేస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ.. శుక్రవారం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో బెయిల్ లభించిన విచారణ ఖైదీలు ఒక్క సెకన్ కూడా జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. అయినా బెయిల్ వచ్చిందంటే.. జైలు నుంచి బయటకు వచ్చేందుకు అనుమతి లభించినట్లే కదా. మరి అనుమతి వచ్చాక.. తీర్పు కాపీ రాలేదని రోజుల తరబడి ఖైదీలను జైళ్లలోనే పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ దిశగానే ఆలోచించిన జస్టిస్ ఎన్వీ రమణ.. ఈ తరహా పరిస్థితి ఇకపై తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టారు.
బెయిల్ దక్కినా.. విడుదలలో జాప్యం
కోర్టు నుంచి బెయిల్ లబించినా.. జైలుకు ఆ ఉత్తర్వులు రాలేదన్న కారణంగా విచారణ ఖైదీలను రోజుల తబరడి జైళ్లలోనే ఉంచుతున్న వైనంపై జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బెయిల్ లభించినా.. విచారణ ఖైదీల విడుదలపై ఎందుకు జాప్యం జరుగుతోందని జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు వ్యవస్థల మధ్య నెలకొన్న సమాచార పంపిణీలో జరుగుతున్న జాప్యమే ఇందుకు కారణమని కూడా ధర్మాసనం ఓ అంచనాకు వచ్చింది. వెనువెంటనే ఈ తరహా పరిస్థితి ఇకపై తలెత్తరాదంటూ వ్యాఖ్యానించిన జస్టిస్ ఎన్వీ రమణ సంచలన సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఫాస్టర్ పేరిట ఓ కొత్త వ్యవస్థను తీసుకువస్తున్నామని, దీనితో ఇకపై బెయిల్ లభించిన విచారణ ఖైదీలు క్షణాల్లో జైలు నుంచి విడుదల అవుతారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
మరి ఈ ఫాస్టర్ అంటే ఏమిటి?.. దాని విధివిధానాలు ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. ‘ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్ మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్(ఫాస్టర్)’ పేరిట కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న ఈ వ్యవస్థ ద్వారా సుప్రీం తీర్పులు, ఉత్తర్వులు తక్షణం అధికారులు, కోర్టులు, జైళ్లకు చేరేలా చూడనుంది. తీర్పుల అమలులో జాప్యానికి మంగళం పాడనున్న ఫాస్టర్.. తీర్పుల అమలులో సాకులు చూపడానికి ఆస్కారం లేకుండా చూడనుంది. సురక్షితంగా, విశ్వసనీయంగా తక్షణం ఆదేశాలు అందజేసే వ్యవస్థగానే జస్టిస్ ఎన్వీ రమణ కొత్త వ్యవస్థ పేరు తెచ్చుకుంటుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థ నిజంగానే బెయిల్ లభించిన ఖైదీలకు వరంగానే భావించాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్ ను 15 రోజుల్లోగా రూపొందించాలని, నెల రోజుల్లోగానే దీనిని అమల్లోకి తీసుకుని రావాలని జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.
Must Read ;- సుప్రీం స్ట్రైట్ క్వశ్చన్.. ‘ఇన్ సైడర్’ ఎక్కడ?