High Court Squash ACB Petition :
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. ఈ సందర్భంగా ఏసీబీ పిటిషన్ పైనా, ఏసీబీ అధికారులపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. **ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మంజూరు అయిన బెయిల్ ను రద్దు చేయాలంటే.. అందుకు గల కారణాలను చెప్పాలి కదా. మరి ఆ దిశగా కారణాలు చెప్పకుండానే బెయిల్ ఎలా అడుగుతారు? అసలు కారణాలు చెప్పకుండా బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ ఎలా వేస్తారు?** అంటూ ఏసీబీపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.
మచ్చ లేని నేత ధూళిపాళ్ల..
టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న ధూళిపాళ్ల చాలా ఏళ్ల క్రితం నుంచి సంగం డెయిరీకి చైర్మన్ గా కొనసాగుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వరుసబెట్టి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల.. రాజకీయాల్లో మచ్చ లేని నేతగా రాణిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా.. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తున్నారు. మొత్తంగా పార్టీలో ఓ నిబద్ధత కలిగిన నేతగా ధూళిపాళ్లకు మంచి గుర్తింపే ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ సంధించిన డైలాగ్ తో జనం వైసీపీ వైపు మొగ్గారు.ఈ క్రమంలో ధూళిపాళ్లకు కూడా పొన్నూరులో తొలి పరాజయం ఎదురైంది. అయినా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గని ధూళిపాళ్ల పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాలుపంచుకుంటున్నారు.
అమూల్ కోసం సంగం టార్గెట్టా?
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చినంతనే టీడీపీలోని బలమైన నేతలను టార్గెట్ చేస్తూ వారిపై కేసులు పెడుతూ సాగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవలే జగన్ సర్కారు రాష్ట్రంలోకి కొత్తగా అమూల్ డెయిరీని తీసుకొచ్చింది.అమూల్ కు పాలు పోయాలంటూ రైతులను ఒత్తిడి చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో సంగం డెయిరీకి మంచి పేరుంది. ఈ క్రమంలో గుంటూరులో అమూల్ కు మెజారిటీ వాటా దక్కాలంటే.. సంగం మూతపడాల్సిందే. ఇదే భావనతో ముందుకు సాగిన జగన్ సర్కారు.. సంగంపై ఏసీబీ దాడులు చేయించింది. ధూళిపాళ్లను అరెస్ట్ చేయించింది. అయితే కోర్టును ఆశ్రయించిన ధూళిపాళ్ల బెయిల్ తెచ్చుకున్నారు. కోర్టు ఆదేశాలను పాటిస్తూ వస్తున్నారు. అయితే ధూళిపాళ్లకు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఇటీవలే ఏసీబీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఏ కారణాల వల్ల ధూళిపాళ్ల బెయిల్ ను రద్దు చేయాలన్న విషయాన్ని మాత్రం ఏసీబీ ప్రస్తావించలేదట. దీంతో ఏసీబీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ధూళిపాళ్ల బెయిల్ రద్దు కుదరంటూ ఏసీబీ పిటిషన్ ను కొట్టేసింది.
Must Read ;- సీబీఐ ఒప్పుకుంది.. జగన్ బెయిల్ రద్దేనా?