Chief Justice of India N V Ramana Comments On Sedition Charges :
రాజద్రోహం కింద కేసులు నమోదు చేస్తున్న వైనంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో అసలు ఈ సెక్షన్ పిచ్చోడి చేతిలో రాయిగా మారిందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి ఒకరు రాజద్రోహం సెక్షన్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగానే జస్టిస్ ఎన్వీ రమణ.. రాజద్రోహం కేసులకు ఆస్కారమిస్తున్న సెక్షన్ 124 (ఏ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సెక్షన్ పై ఒక్క ఎన్వీ రమణకే కాకుండా దాదాపుగా న్యాయమూర్తులందరూ వ్యతిరేకంగానే ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ ఎన్వీ రమణ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారిపోయాయి.
రాజద్రోహం కింద కేసులు..
తమ పాలనపై విమర్శలు చేస్తున్నారన్న కోపంతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన వీడియోలను ప్రసారం చేశాయన్న కారణంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5లపై జగన్ సర్కారు రాజద్రోహం కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాజద్రోహం సెక్షన్ దుర్వినియోగం అవుతోందని, ఈ సెక్షన్ ను రాజ్యాంగం నుంచి రద్దు చేయాలన్న దిశగా పోరాటం ప్రారంభించింది. అదే రీతిలో రఘురామరాజు కూడా సుప్రీంను ఆశ్రయించారు. తాజాగా రిటైర్డ్ మేజర్ జనరల్ వోంబట్ కేర్ మొత్తంగా ఈ రాజద్రోహం సెక్షన్ నే రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ ఎన్వీ ఏమన్నారంటే..
రిటైర్ట్ మేజర్ జనరల్ వోంబట్ కేర్ పిటిషన్ గురువారం తాను నేతృత్వం వహిస్తున్న ధర్మాసనం ముందు విచారణకు వచ్చిన సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సెక్షన్ పై జస్టిస్ ఎన్వీ రమణ ఏమన్నారంటే.. ‘‘రాజద్రోహం సెక్షన్ పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. కొయ్యను మలచడానికి వడ్రంగి చేతికి రంపం ఇస్తే.. మొత్తం అడవినే నరికేసినట్టుగా ఈ చట్టం అమలు ఉంది. వ్యక్తులకు, వ్యవస్థలకు ఈ సెక్షన్ వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈ సెక్షన్ ను దుర్వినియోగం చేస్తున్న సందర్భాలున్నాయి. ప్రస్తుతం ఫ్యాక్షనిస్టులు తమ ప్రత్యర్ధులకు వ్యతిరేకంగా దీనిని వాడుతున్నారు. పాతకాలం.. పనికి మాలిన చట్టాలను తొలగించిన ప్రభుత్వం.. ఈ చట్టం జోలికి ఎందుకు పోలేదు? అంతేకాకుండా ఈ సెక్షన్ కింద శిక్షలు పడిన కేసులు నామమాత్రమే. స్వాతంత్య్ర సమరయోధులను అణచివేసేందుకే బ్రిటిష్ వలస పాలకులు అమల్లోకి తీసుకొచ్చిన ఈ చట్టం ఇంకా అవసరమా? పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ సెక్షన్ ను రద్దు చేయాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని చెప్పిన ఎన్వీ రమణ.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు.
Must Read ;- సీబీఐ ఒప్పుకుంది.. జగన్ బెయిల్ రద్దేనా?