మాయావి శ్రీకృష్ణుడినే మించిపోయారు మన రాజకీయ నేతలు. ప్రత్యర్ధులను దెబ్బ తీయటానికి.. తమ అధికారం కదలకుండా ఉండటానికి.. కొన్ని పాత్రలను వారే సృష్టిస్తున్నారు. వారితో నాటకాలు వారే ఆడిస్తున్నారు. ఆ పాత్ర తన పని పూర్తయ్యాక.. స్క్రీన్ ప్లే మార్చుకునే ఛాన్స్ ఉన్నా సరే.. ముందు తమ పని కావాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు బీజేపీ దాదాపు బెదిరిస్తూ బలాన్ని లాక్కుంటుంటే ఏం చేయలేకపోయారు.. మరోవైపు రెబెల్ లీడర్ రేవంత్‌రెడ్డి ఘాటు కామెంట్లతో.. కాంగ్రెస్ లాంటి పార్టీలో సైతం డామినేట్ చేస్తూ… కేసీఆర్‌కు థ్రెట్‌గా మారారు. ఈ రెండు ప్రమాదాలను ఎదుర్కోవటానికి కేసీఆర్ వదిలిన అస్త్రమే షర్మిల అని ప్రచారం జరుగుతోంది. లేదా అధికారం మీద యావతో షర్మిల వస్తే.. ఆమెను పరోక్షంగా ఎంకరేజ్ చేసి తనకనుకూలంగా నడిపించాలనే ప్లాన్ చేస్తున్నారని కూడా అంటున్నారు.
మొదటి నష్టం రేవంత్‌రెడ్డికే..
షర్మిలతో మొదటి నష్టం జరిగేది రేవంత్‌రెడ్డికే అనే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే రెడ్డి సామాజికవర్గం రాష్ట్రంలో రేవంత్ వైపే చూస్తోంది. వెలమ దొరల రాజ్యాన్ని ఢీకొట్టాలంటే రేవంత్‌రెడ్డే కరెక్టని వారంతా ఫీలవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధినాయకత్వం పీసీసీ చీఫ్ పదవిని రేవంత్‌కు అప్పచెప్పడానికి నానా తంటాలు పడుతోంది. కాంగ్రెస్‌లోని మిగతా నేతలు కూడా అడ్డుపడే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నారు. ఈ పరిణామాలు రేవంత్ వర్గానికి కాస్త నీరసం తెప్పించిన మాట వాస్తవం. అదే టైమ్‌లో ఎంటరైన షర్మిల .. అటు రెడ్లను.. ఇటు తన భర్త అనిల్ ద్వారా క్రైస్తవులను సమీకరించాలని చూస్తోంది. ఇప్పటి వరకు అయితే కీలకమైన రెడ్డి నేతలు ఎవరూ అటు వైపు అయితే చూడలేదు. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన రేవంత్‌రెడ్డి మాత్రం అటాక్ స్టార్ట్ చేశారు.
అన్న మీద అలిగితే..
టీఆర్ఎస్‌కు పనికొచ్చేటందుకే షర్మిల తెలంగాణకొచ్చింది. లేకపోతే అన్న మీద అలిగితే ఆంధ్రలో పార్టీ పెట్టుకోవాలి గాని.. ఇక్కడకెందుకొస్తారని కామెంట్లు వచ్చాయి. రేవంత్‌రెడ్డి కూడా నేరుగా మాటల దాడి చేశారు. దీంతో షర్మిల పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కొండా రాఘవరెడ్డి కాస్త ఘాటుగానే రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. డబ్బులు తీసుకునేవాళ్లం మేము కాదని.. డబ్బులివ్వటానికి వెళ్లి దొరికిపోయిందెవరో తెలుసని.. పైగా రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడిపించి డబ్బులు వసూలు చేసుకున్నాడంటూ ఆరోపణలు చేశారు. దీంతో రేవంత్ వర్గం భగ్గుమంది. కొండా రాఘవరెడ్డికి వాట్సప్ మెసేజులు, కాల్స్ వెళ్లాయి. కామెంట్స్ వెనక్కు తీసుకోవాలి లేదంటే తీవ్ర పరిణామాలంటూ రేవంత్ ఫ్యాన్స్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దీనిపై ఇప్పుడు రచ్చ నడుస్తోంది.
మరోవైపు బీజేపీలోకి వెళ్లిపోదామనుకున్న కాంగ్రెస్ వాళ్లు సైతం షర్మిల పార్టీ వైపు చూస్తున్నట్లు.. ఆమె వర్గం ప్రచారం చేసుకుంటోంది. ఇప్పటివరకు అయితే ఎప్పుడో వైఎస్ఆర్ హయాంలో ఒక వెలుగు వెలిగి.. తర్వాత కనుమరుగై ఖాళీగా ఉన్నవారు తప్ప ముఖ్యమైన నేతలైతే ఎవరూ బయటపడలేదు. చూడాలి మరి.. రాబోయే మూడు నెలల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో.
Also Read : పీవీకి, కేసీఆర్కు నక్కకు నాగలోకానకి ఉన్నంత తేడా ఉంది..