తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు రెండే డైలాగులు వినపడుతున్నాయి. ‘‘నిన్న కాక మొన్నొచ్చి ఏం మాట్లాడుతున్నావురా‘‘ ‘‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా‘‘ అని.
ఒకవైపు పోతే ధన బలం, దూకుడు, నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయి. అదే వైపు ఒంటెత్తు పోకడ, వ్యక్తిగత పోకడలు నెగెటివ్ లక్షణాలుగా కనపడుతున్నాయి. రెండో వైపు పోతే సీనియారిటీ, వారి ప్రాంతంలో బలగం తప్ప ఇంకేమీ కనపడటం లేదు. కాకపోతే పార్టీని ఎప్పటి నుంచో అంటిపెట్టుకుని ఉన్నవారు. అదొక్కటే పాజిటివ్. కాని పని అవదనే అనిపిస్తోంది. అందుకే మొదటి వైపే పోవాలని అనిపిస్తోంది. కాని రెండోవైపు వాళ్లంతా వెనక్కి లాగుతున్నారు. ఈ డైలమాలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఎవరికి అప్పచెబుతుందనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ పీసీసీ చీఫ్ ఇప్పటికే రేవంత్‌రెడ్డికి ఇచ్చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. కాని ఆ ప్రచారాన్ని పరోక్షంగా ఖండిస్తూ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం దూత మాణిక్యం ఠాగూర్ సంప్రదింపుల్లో బిజీ అయిపోయారు. కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ కూడా అయింది.
Must Read ;- రేవంతూ.. ఆ కవరింగ్ ఎందుకు?
బలంగా రేవంత్ వ్యతిరేక వర్గం
రేవంత్‌రెడ్డికి వ్యతిరేక వర్గం మాత్రం కాంగ్రెస్‌లో బలంగా ఉంది. కాని వారు నేతలు మాత్రమే.. వారి వెనకున్న కార్యకర్తలు మాత్రం రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే కేసీఆర్‌ని ధీటుగా ఎదుర్కోగలడు.. ఫైనాన్షియల్‌గా బలం ఉంది.. నెట్టుకు రాగలడు.. దూకుడుగా వెళ్లి కింది స్థాయిలో విశ్వాసం వచ్చేలా చేయగలడు.. ఇలా కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి టార్గెట్ సీఎం పోస్టు మాత్రమేనని.. దాని కోసం ఎప్పుడు ఏ పార్టీ అయినా మారిపోతాడని.. పార్టీ కమిట్‌మెంట్ కన్నా.. వ్యక్తిగత కమిట్‌మెంటే ఎక్కువనే విమర్శ ఉంది. అంతే కాదు.. ఏకపక్షంగా వ్యవహరించే రేవంత్‌రెడ్డితో మిగతా గ్రూపులు మింగిల్ కాలేవని.. అప్పుడు పార్టీకి నష్టం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఈ వాదన వినిపించేవారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇంకా ఇతర సీనియర్ నేతలు. కాని రేవంత్ రెడ్డిని సమర్ధించేవారు కూడా బాగానే ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఢిల్లీతో ఎక్కువ సంబంధాలున్నవారే ఉన్నారు. అదే రేవంత్‌కు పాజిటివ్ పాయింట్.
ఎప్పటి నుంచో ఉన్నవారికే ఇవ్వాలని..
నిన్నగాక మొన్న వచ్చినవారికి అందలం ఎలా అప్పగిస్తారు.. ఇస్తే కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో ఉన్నవారికే ఇవ్వాలని శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటివాళ్లు వాదిస్తున్నారు. అలా వాదిస్తే.. తమకు అవకాశాలు మెరుగు ప డతాయని.. రేవంత్‌ను తప్పించడానికి అవసరమైతే రాజీపడటానికి కూడా వారిద్దరు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
లాయల్టీ, సీనియారిటీ ఉన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డితో ఏం ఒరిగిందో చూశాం. శ్రీధర్ బాబుకు గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గాని రాష్ట్ర వ్యాపితంగా ఇమేజ్ లేదు. వారి వారి జిల్లాల్లో మాత్రం వారికి ప్రాభవం ఉంది. అంతవరకే. సంప్రదాయాలు, విలువలు, నీతి అనుకుంటే ఉపయోగం లేదు. రిజల్ట్ రావాలి.. దూసుకొస్తున్న బీజేపీకి అడ్డుకట్ట వేసి.. టీఆర్ఎస్‌ను ఢీకొట్టాలంటే సరైనోడు కావాల్సిందే. ఆ సరైనోడు రేవంత్‌రెడ్డే. అదే అధిష్టానం అభిప్రాయమనే ప్రచారం జరుగుతోంది.
Must Read ;- కవిత సహా మంత్రులు ఫెయిల్.. పలు చోట్ల ప్రముఖుల ఓటమి