Kesineni Nani Has Announced That He Will Not Be Contesting In The Upcoming Elections :
రాజకీయ పార్టీ అన్నాక.. బరిలో నిలిచి గెలిచే నేతలకే ప్రాధాన్యం ఇస్తుంది. రాజకీయాల్లో ఉండే నేతలు కూడా ఇదే కోరుకుంటారు. ఏదైనా పార్టీలో ఉన్నారంటే.. ఆ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తారు. బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతారు. ఈ తరహా మంత్రమే అటు పార్టీలతో పాటుగా ఇటు నాయకులకు కూడా ఉభయతాకరం. అలా కాకుండా పార్టీ సభ్యత్వం ఇచ్చేసి ఎన్నికల్లో సీటు ఇవ్వని పార్టీల పట్ల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. తమకు అవకాశాలు ఇవ్వకపోతే.. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారు. వేరే పార్టీల్లోకి చేరిపోతారు కూడా. అయితే అటు పార్టీతో పాటు ఇటు తనను తాను ఇబ్బందుల పాల్జేసుకునేందుకు సిద్ధమైపోయారు ఓ కీలక నేత. ఆ నేత మరెవరో కాదు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (కేశినేని నాని). టీడీపీకి సంబంధించి బెజవాడలో కేశినేని కీలక నేత కిందే లెక్క. బెజవాడలో ఎందరు నేతలున్నా.. కేశినేనిది ఓ ప్రత్యేకమైన ముద్ర. 2019 ఎన్నికల్లో జగన్ పార్టీదిశగా బలంగా వీచిన గాలిలోనూ కేశినేని నిలిచి గెలిచారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. పార్టీ నగర శాఖకు చెందిన కీలక నేతలతో అంతగా సఖ్యత లేని నాని.. నిత్యం పార్టీలో అజలడులను రేపుతూనే ఉన్నారు. తాజాగా ఆయన మరో తుఫానునే రేపారు.
బరిలోకి దిగరట
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని కేశినేని సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఆయనతో పాటు ఆయన కుమార్తె శ్వేతను కూడా పార్టీ తరఫున బరిలోకి దింపరట. అంటే.. కేశినేని నాని ఫ్యామిలీ ఎన్నికలకు చెల్లుచీటీ ఇచ్చేసినట్టే కదా. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, విజయవాడ అభ్యర్థిగా మరొకరిని చూసుకోవాలని పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన చెప్పినట్టుగా సమాచారం. నాలుగు రోజుల క్రితం చంద్రబాబును కలిసిన సందర్భంగా ఈ విషయం స్పష్టం చేసినట్టు సమాచారం. తన కుమార్తె శ్వేత కూడా పోటీ చేయబోదని, ఆమె టాటా ట్రస్ట్‌కు వెళ్లిపోయిందని అధినేతకు స్పష్టం చేశారట. అయితే, ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన పార్టీ నుంచి బయటకు వెళ్లబోనని, టీడీపీతోనే కొనసాగుతానని నాని చెప్పినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయినా పార్టీ తరఫున పోటీ చేయకుండా పార్టీలోనే కొనసాగుతానంటే.. కేశినేని పార్టీకి ఏ రకంగా ఉపయోగపడతారన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. అయినా పోటీ చేయండి మహాప్రభో అంటే.. నాతో కాదనే వారితో టీడీపీకే కాకుండా ఏ పార్టీకి కూడా ప్రయోజనం ఉండదు కదా. మరి ఈ నిర్ణయాన్ని కేశినేని మార్చుకుంటారో, లేదంటే తన మాటకే కట్టుబడతారో చూడాలి.
నేపథ్యం ఇదేనా..?
కేశినేని నాని ఈ నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. విజయవాడ మేయర్ ఎన్నికల్లో కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. అయితే శ్వేతను మేయర్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ఒప్పుకున్నా.. పార్టీ నగర శాఖలో కీలక నేతలుగా ఉన్న ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులు తీవ్రంగా వ్యతిరేకించారు. కొన్నిరోజుల పాటు శ్వేత తరఫున వారు ప్రచారానికి కూడా రాలేదు. చివరకు అధిష్ఠానం వారిద్దరికీ తలంటితే.. శ్వేత కోసం ప్రచారం చేయడానికి తమకేమీ ఇబ్బంది లేదని. అయితే తాము వెళ్లినప్పుడు అక్కడ కేశినేని నాని ఉండరాదని వారు ఓ కండిషన్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ వార్త విన్నంతనే షాక్ తిన్న కేశినేని.. కుమార్తె కోసం, పార్టీ కోసం తాను ప్రచారానికి దూరంగా ఉంటానని చెప్పేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో బుద్ధా, బొండా ప్రచారం చేసినా శ్వేత కార్పొరేటర్ గా గెలిచినా.. టీడీపీ పరాజయం పాలైంది. మేయర్ పీఠం వైసీపీ కైవసం అయిపోయింది. ఈ పరిణామాలతో పాటు బుద్ధా, బొండా తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసినా పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదన్న మనస్తాపంతో కేశినేని చాలా కాలం నుంచి మదనపడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నికల్లో పోటీ చేయరాదన్న సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
must read ;- టీడీపీ వెంటే జనసేన.. కడియం రిజల్టే సాక్ష్యం











