టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇంటిని ముట్టడించేందుకు పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ నేతృత్వంలో వైసీపీ శ్రేణులు తెగబడిన తీరు ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. చంద్రబాబు ఇంటి ముట్టడి సందర్భంగా వైసీపీ శ్రేణులు ముందుగానే దాడి చేయాలనే ఉద్దేశ్యంతోనే జెండా కర్రలు పట్టుకుని వచ్చారన్న విషయం తేలిపోయింది. అయితే టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఈ దాడిని సమర్ధంగానే ఎదుర్కొందని చెప్పాలి. ఉద్రిక్తతను చల్లబరచాల్సిన పోలీసులు వైసీపీ శ్రేణులకు వత్తాసు పలికిన తీరుపై టీడీపీ భగ్గుమంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వైసీపీ పాలనను విమర్శిస్తూ సంచలన ప్రశ్నలు సంధిస్తే.. వాటికి సమాధానం చెప్పలేకనే అయ్యన్నను వదిలేసి చంద్రబాబు ఇంటి ముట్టడికి యత్నిస్తారా? అంటూ టీడీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. చంద్రబాబును చంపేందుకే వైసీపీ శ్రేణులు యత్నించాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలు వైసీపీ శ్రేణుల తీరును నిరసిస్తూ.. జగనే స్వయంగా ఆ శ్రేణులను పంపించారని ఆరోపిస్తూ ఆందోళనలకు దిగాయి. ఈ క్రమంలో మంగళగిరిలోని డీజీపీ కార్యాలయాన్ని కూడా ముట్టడించేందుకు టీడీపీ శ్రేణులు యత్నించాయి. టీడీపీ శ్రేణుల దెబ్బకు ఏకంగా డీజీపీ ఆఫీస్ గేట్లు మూతపడిపోయాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
వడ్డీతో సహా చెల్లిస్తాం
చంద్రబాబు ఇంటి సమీపంలో జరిగిన ఉద్రిక్తతపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. జగన్ అండ చూసుకుని వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయని.. త్వరలోనే జగన్‌తో పాటు వైసీపీ శ్రేణులకు వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత ఇంటిపై నీ ఎమ్మెల్యేని, బులుగు గూండాలను పంపావంటే నీవు ఎంత దిగజారావో అర్థమవుతోందని జగన్ ను ఉద్దేశిస్తూ లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా చర్యలతో సీఎం జగన్ రోజురోజుకు అధఃపాతాళానికి దిగజారుతున్నారని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో ఉన్న మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటి నుంచి మీ ఇల్లు కూడా అంతే దూరమనే విషయం త్వరలోనే మీకు అర్థమవుతుందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఒకప్పడు జగన్ పెట్టిన ముద్దులు ఇప్పుడు పిడిగుద్దుల్లా పడుతున్నాయని లోకేశ్ సెటైర్లు సంధించారు. ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తేలిపోయాయన్నారు. జగన్ ఆడుతున్న నాటకం జనాలందరికీ అర్థమవుతోందని చెప్పారు. జగన్ లాంటి క్రూర, నేర స్వభావం చంద్రబాబుకు లేదని లోకేశ్ చెప్పుకొచ్చారు.
ఓటమి భయం మొదలైంది
మరోవైపు ఈ వివాదం మొత్తానికి కారణమని వైసీపీ ఆరోపిస్తున్న అయ్యన్నపాత్రుడు కుమారుడు, టీడీపీ యువనేత చింతకాయల విజయ్‌పాత్రుడు కూడా జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. బీసీల ప్రతినిధిగా తన తండ్రి అయ్యన్న కొన్ని ప్రశ్నలు అడిగారని.. వాటికి సమాధానం చెప్పలేకనే చంద్రబాబు ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారని విజయ్ ఆరోపించారు. చెత్తపై పన్నును ప్రశ్నించడమే అయ్యన్న చేసిన తప్పా? అని కూడా ఆయన నిలదీశారు. ఓటమి భయం మొదలైనందుకే జగన్ దాడులను ప్రోత్సహిస్తున్నారని విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు ఇంటి వద్ద నెలకొన్న ఉద్రిక్తతపై రాష్ట్ర పౌరహక్కుల సంఘం కూడా ఘాటుగానే స్పందించింది. టీడీపీ నేతలపై కర్రలు, రాళ్లతో వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడటం దారుణమని ఆ సంస్థ ఆక్షేపించింది. ఈ ఘటనలో దౌర్జన్యకారులకు పోలీసులే మద్దతుగా నిలవడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా మీడియాపైనా దాడులు జరిగాయని, వైసీపీ శ్రేణుల తీరును ఖండిస్తున్నామని పౌరహక్కుల సంఘం ఓ ప్రకటనను విడుదల చేసింది. మొత్తంగా చూస్తుంటే.. శుక్రవారం నాటి ఉద్రిక్త పరిస్థితి, దానికి దారి తీసిన కారణాలను ప్రస్తావిస్తూ టీడీపీ యువ నేతలు ఎంట్రీ ఇచ్చి వైసీపీ సర్కారుతో పాటు పోలీసులకు చుక్కలు చూపించడం మొదలెట్టారన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- కర్రలతో కొట్టుకుని.. రాళ్లు రువ్వుకుని..