మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రచారంలో రెండు ప్రధాన ప్యానల్స్ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మెగా మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. మిగిలిన హీరోల మద్దతు ఎవరికి ఉందన్నది మాత్రం తెలియదు. ఇది సెన్సిటివ్ అంశం కాబట్టి ఎవరికి వారు బయటపడటం లేదు. కాకపోతే అటు మంచు విష్ణు, ఇటు ప్రకాష్ రాజ్ లు ఆయా సినిమా ప్రముఖుల్ని కలిసి సోషల్ మీడియా ద్వారా ఫోటోలు షేర్ చేస్తున్నారు. నట సింహం బాలయ్య ఎటు వైపు ఉన్నారన్నది పెద్ద చర్చనీయాంశమైంది.

మంచు విష్ణు అఖండ సెట్ కు వెళ్లి బాలయ్యతో ముచ్చటించారు. ఆ ఫోటోలను కూడా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. మా అభివృద్ధి, సభ్యుల సంక్షేమం తదితర అంశాలను ఆయనతో చర్చించారు. తన అభిప్రాయాలతో ఏకీభవించిన బాలయ్య తనకు మద్దతు ప్రకటించారని విష్ణు తెలిపారు. మీ మద్దతు తెలపడం మాకెంతో గర్వకారణంగా ఉందంటూ విష్ణు బాలయ్యను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

అలాగే సూపర్ స్టార్ కృష్ణను కూడా కలిసి మద్దతు కోరారు. తండ్రి మోహన్ బాబుతో కలిసి కృష్ణ ఇంటికి వెళ్లి కలిశారు. మరో సీనియర్ నటుడు కృష్ణంరాజును కూడా విష్ణు కలిశారు. ఆ ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాడివేడిగా ఈ ప్రచారం సాగుతోంది. కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ మద్దతు తమకే లభించిందని మంచు విష్ణు చెబుతున్నారు. ఈ ప్రచార సరళి చూస్తుంటే సినిమా రంగంలో రెండు వర్గాలు ఉన్న విషయం బహిరంగంగానే తెలుస్తోంది. ఒక వర్గం ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తుండగా, మరో వర్గం మంచు విష్ణుకు అండగా నిలుస్తోంది. చూడాలి ఏంజరగనుందో.
Must Read ;- చంద్రబాబుతో మంచు విష్ణుకు ఎలాంటి బంధుత్వం?











