కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్న సంస్థ భారత్ బయోటెక్. ఆ సంస్థ ఎండీ క్రిష్ణా ఎల్లా చిన్న వ్యవసాయం కుటుంబం నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని నేడు ఈ స్థాయికి ఎదిగారు. క్రిష్ణా ఎల్లా గారి స్వగామం చిత్తూరు పొరుగున ఉన్న తమిళనాడులోని తిరుత్తణి దగ్గర ఓ పల్లె. వారిది సాధారణ వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం మీద మక్కువతో అందులో ఉన్నత చదువులు చదివిన ఆయన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బేయర్ ఫార్మా అగ్రికల్చర్ విభాగంలో ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత స్కాలర్ షిప్ వచ్చి అమెరికాలో ఎమ్మెస్. తర్వాత పిహెచ్‌డి చదివి అక్కడే స్థిరపడాలనుకున్నారు. అయితే ఇండియాకు వచ్చి ఇక్కడ ఏమన్నా చేసుకోమన్న వాళ్ల అమ్మ మాట విని ఇక్కడకు వచ్చేశారు.
పెట్టుబడి కోసం..
ఒక్క డాలర్ ధరకు వ్యాక్సిన్ తయారు చేస్తా అని హైదరాబాద్‌కు వచ్చి ఓ చిన్న ల్యాబ్ పెట్టుకొని 12.5 కోట్ల హెపటైటిస్ మందుల ప్రాజెక్టు ప్రపోజల్ అందుకున్నారు. అయితే పెట్టుబడి కోసం తిరుగుతుంటే అంతా నవ్వారు. చివరికి ఐడిబిఐ బ్యాంకు రూ. 2 కోట్లు ఇవ్వగా నాలుగేళ్లు శ్రమించి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చారు. 1999లో అబ్దుల్ కలాం వచ్చి ఆ వ్యాక్సిన్‌ని మార్కెట్లోకి విడుదల చేశారు. తర్వాత 400 మిల్లియన్ డోసులను 65 దేశాలకు ఎగుమతులు చేశారు.
బయోటెక్ నాలెడ్జ్ పార్క్ సలహా
1996 లో సీఎం అయిన చంద్రబాబు నాయుడిని క్రిష్ణా ఎల్లా కలిసి బయోటెక్ నాలెడ్జ్ పార్క్ సృష్టికి సలహా ఇచ్చారు. దీంతో శామీర్‌పేట్ రహదారి దగ్గరలో జీనోం వ్యాలీకి అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నుంచి 60శాతానికి పైగా పిల్లల వ్యాక్సిన్లు ప్రపంచ దేశాలకు ఎగుమతులు అవుతున్నాయి.
దేశ భక్తితో..
క్రిష్ణా ఎల్లా తన చిన్న ల్యాబ్ కు పెట్టుకున్న పేరు భారత్ బయోటెక్. దేశ భక్తితో పెట్టిన ఆ పేరుగల సంస్థ దేశం గర్వించేలా వందకు పైగా జాతీయ , అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. వైరస్‌ల మీద భారత దేశ దండయాత్ర లెక్కన చికన్ గున్యా నుండి జికా వరకు ఎన్నో వ్యాక్సిన్‌లు కనుక్కుని 65 పేటెంట్లు సాధించారు. 2011 బిజినెస్ లీడర్, టెక్నాలజీ & ఇన్నోవేషన్ లో ప్రధాని నుంచి అవార్డు అందుకున్నారు. అదే జీనోం వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్‌ను నేడు ప్రధాని మోడీ సందర్శించి కరోనా టీకా పరిస్థితిని పరిశీలించారు.
Must Read ;- కరోనా టీకా ఫైనల్ పరీక్షలు.. గుంటూరులో











