ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు టీకా సిద్దం అవుతోంది. ఈ విషయంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోస్న కోవాగ్జిన్ టీకా మంచి ఫలితాలనిస్తోంది. మూడో దశ ట్రయల్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు గుంటూరులోని ఫీవర్ ఆసుపత్రి ఎంపికైంది. వెయ్యి మంది వాలంటీర్లపై మూడో దశ కోవిడ్ టీకాను రెండు సార్లు ప్రయోగించనున్నారు. ఇక ఇక్కడి ప్రయోగాలు సక్సెస్ అయితే జనవరిలో పెద్ద ఎత్తున టీకా ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు భారత్ బయోటెక్ తెలిపింది.
రెండు దశలు సక్సెస్
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కరోనా టీకాను నిమ్స్ ఆసుపత్రిలో వాలంటీర్లపై రెండు దశలను విజయవంతంగా పరిశీలించింది. 95 శాతం ఫలితాలు సాధించారు. అయితే టీకా తీసుకున్న వారిలో కొందరికి స్వల్పంగా జ్వరం రావడం, టీకా వేసిన ప్రాంతంలో కొంచెం నొప్పి రావడం వంటి దుష్ఫలితాలను గుర్తించారు. ఇక మూడో దశ ట్రయల్స్ కు గుంటూరు ఫీవర్ ఆసుపత్రి ఎంపికైంది. ఇక్కడ ప్రతి రోజూ 50 మందికి కోవాగ్జిన్ టీకా వేయనున్నారు. 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా ముందుగా పేరు నమోదు చేయించుకుని టీకా వేయించుకోవచ్చని భారత్ బయోటెక్ అధికారులు తెలిపారు. అలా వెయ్యి మందిపై మూడో దశ టీకాను ప్రయోగించి ఫలితాలను విశ్లేషించనున్నారు.
టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఎలా వృద్ధి చెందుతున్నాయో పరీక్షిస్తారు. టీకా తీసుకున్న వారు రెండు నెలల తరవాత మరోసారి రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా రెండు డోసులు తీసుకున్న తరవాత ఎలాంటి సైడ్ ఎఫెస్టులు లేకుంటే- ఇక కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తికి సిద్దం చేస్తారు. మరో రెండు నెలల్లో హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ లో కోవిడ్ టీకా ఉత్పత్తి ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆ సంస్థ అధికారులు వెల్లడించారు.
అందుబాటు ధరలో ఉంటుంది
భారత్ లో అనేక బయోటెక్ కంపెనీలు కరోనా టీకా తయారీలో నిమగ్నం అయ్యాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్, ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ తో కలసి ప్రయోగాలు నిర్వహిస్తోంది. చాలా టీకాలు మూడో దశ ట్రయల్స్ లో ఉన్నాయి. మరో 60 రోజుల్లో మూడో దశ కూడా పూర్తి కానుంది. ఆ తరవాత ఫలితాలను విశ్లేషించి పెద్ద ఎత్తున టీకా తయారీ ప్రారంభించనున్నారు. భారత్ బయోటెక్ టీకాను చాలా తక్కువ ధరకు అందించాలని ఆ కంపెనీ భావిస్తోంది. వాటర్ బాటిల్ ధర కన్నా తక్కువ రేటుకే టీకా అందిస్తామని భారత్ బయోటెక్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణా ఎల్లా ఇప్పటికే ప్రకటించారు. అయితే టీకా ధర ఎంత ఉన్నా కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా టీకా కార్యక్రమం చేపట్టే యోచనలో ఉంది. ఇదే జరిగితే ఫిబ్రవరిలో 3 కోట్ల మందికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Must Read ;- పరీక్షల పరిమాణం సగానికి తగ్గింపు.. భారత్ బయోటెక్ కీలక నిర్ణయం