కేబినెట్ భేటీ అంటే.. పాలనలో ఆయా ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానం, కొత్తగా ప్రవేశపెట్టాలనుకునే పథకాలపై మంచీచెడ్డలపై చర్చ, ప్రజోపయోగం కోసం తీసుకునే కీలక నిర్ణయాలకు అనుమతి తీసుకోవడం, పాలనలో తీసుకురానున్న నూతన విధానాలపై చర్చలు, అప్పటికే అమలులో ఉండి లోపభూయిష్టంగా మారిన విధానాలపై చర్చలు.. ఇలా అన్నీ ప్రాధాన్యాంశాలపై చర్చలే జరిగే వేదిక. ఆయా ప్రభుత్వాల అధినేతల నేతృత్వంలో అన్ని శాఖల మంత్రులు పాలుపంచుకునే ఈ సమావేశాలు ఏపీలో ఫార్సుగా మారిపోయాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేబినెట్ భేటీల కంటే ముందుగానే జగనే ఆయా అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటికి కేబినెట్ భేటీలు నిమిషాల వ్వవధిలో ఆమోద ముద్ర వేసేస్తున్నాయి. మరి అలాంటప్పుడు గంటల తరబడి భేటీలు ఎందుకు కొనసాగుతున్నట్లు? ఎందుకంటే.. టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురించి మాట్లాడుకునేందుకే జగన్ తన కేబినెట్ భేటీలను గంటల తరబడి సాగిస్తున్నారట.
లోపాలన్నీ బాబు ఖాతాలోకే
గురువారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కూడా చంద్రబాబు నామస్మరణ తప్పించి వేరే ఏ అంశం కూడా పెద్దగా ప్రస్తావనకే రాలేదని చెప్పాలి. ఎందుకంటే.. ఇటీవల వృద్ధాప్య పింఛన్ల కోత, మోతెక్కిపోతున్న కరెంటు చార్జీలను కూడా చంద్రబాబు ఖాతాలోకే జగన్ వేసేశారు. చంద్రబాబు హయాంలో ధనికులకు కూడా పింఛన్లు ఇచ్చారట. ఈ కారణంగా అర్హులకు పింఛన్లే దక్కలేదట. ఈ విధానాన్ని సరిదిద్దేందుకే ఇప్పుడు పింఛన్లలో కోతలు పెడుతున్నామని, ఈ కోతలు కూడా అనర్హులకే పరిమితమవుతున్నాయని, అర్హులకు చెందిన ఏ ఒక్క పింఛన్ ను కూడా కోత కోయ లేదని జగన్ చెప్పారట. ఇక చంద్రబాబు హయాంలో విద్యుత్ రంగం తీవ్ర నష్టాలను చవి చూసిందని, ఆ నష్టాలను భర్తీ చేసేందుకే ఇప్పుడు విద్యుత్ చార్జీలను పెంచాల్సి వచ్చిందని జగన్ చెప్పారట. తప్పులన్నీ చంద్రబాబు చేసి ఇప్పుడు తమపై నిందలేస్తే ఎలాగని జగన్ తనదైన శైలి వాదన వినిపించారట. ఈ వాదనకు మంత్రులంతా ముక్త కంఠంతో మద్దతు పలికారట. వెరసి 3 గంటల భేటీలో మెజారిటీ సమయాన్ని చంద్రబాబు నామస్మరణకే కేటాయించారట.
కోతలు, వాతలను ఒప్పుకున్నట్టే
చంద్రబాబు నామస్మరణలో తరించిన జగన్ సర్కారు.. వృద్ధాప్య పింఛన్ల కోతలను, కరెంటు చార్జీలను పెంచినట్టుగా ఎట్టకేలకు ఒప్పుకున్నట్లే కదా అన్న వాదన ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. బయటేమో మంత్రులు పింఛన్ల కోతల్లేవు, విద్యుత్ చార్జీల వాతల్లేవు అంటూ చిలుక పలుకులు పలుకుతున్నా.. చంద్రబాబు నామస్మరణలో.. చంద్రబాబుపై నెపాన్ని మోపేందుకే అయినా.. రాష్ట్రంలో పింఛన్ల కోతలు, విద్యుత్ చార్జీల వాతలూ కొనసాగుతున్నాయని కేబినెట్ భేటీ సాక్షిగా జగన్ సర్కారు ఒప్పేసుకుందన్న మాట..
Must Read ;-,రఘురామ సెటైర్లతో జగన్ ఉక్కిరిబిక్కిరి