తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి సభ్యులు అవసరం. నిర్ణయాలతో సంబంధం లేకుండా ప్రత్యేక ఆహ్వానితుల అవసరం ఏమిటి? ఆ విధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించడానికి ప్రాతిపదిక ఏమిటి? కేవలం తిరుమలేశుడిని కాస్త వైభవంగా దర్శనం చేసుకోవడం కోసమే వారందరూ ప్రభుత్వాన్ని బతిమాలి, పైరవీలు చేసుకుని ప్రత్యేక ఆహ్వానితులుగా నియామకాలు పుచ్చుకున్నారా? ప్రభుత్వంతో అంత సాన్నిహిత్యం ఉన్నవారు.. ఎప్పుడు దర్శనానికి వెళ్లదలచుకున్నా ఆ మాత్రం గొప్పదర్శనం పొందగలరు కదా..? అనే అనుమానాలు పలువురిలో కలుగుతున్నాయి. తరచి తరచి చూస్తే.. తిరుమలేశుడి దర్శనాలను అడ్డం పెట్టుకుని పైరవీలు చేసుకుని అడ్డంగా, నిలువుగా ఎదగాలని కోరుకునే వారందరూ ప్రత్యేక ఆహ్వానితుల డిజిగ్నేషన్లను సంపాదించుకున్నారేమో అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.
ఆహ్వానితులు ఎందుకు..?
టీటీడీకి సంబంధించిన నిర్ణయాలను తీసుకునే అధికారం కేవలం బోర్డు సభ్యులకు మాత్రమే ఉంటుంది. ఆ బోర్డులో 24 మంది మాత్రమే ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మందిని నియమించారు. ఇంత జంబో బోర్డు చరిత్రలో ఎన్నడూలేదు. నిజానికి, బోర్డు సభ్యత్వం అడిగిన వారందరినీ సంతుష్టి పరచేందుకు బోర్డు సభ్యుల సంఖ్యను ప్రభుత్వం పెంచుతుందనే ప్రచారం జరిగింది కానీ, బోర్డును ఇదివరకటి లాగా 24కే పరిమితం చేసి, ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మందిని పెట్టారు. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెబుతున్న ప్రకారం.. ఆ ఆహ్వానితులకు బోర్డు సభ్యలతో సమానంగా శ్రీవారి దర్శనానికి అధికారం ఉంటుంది. దర్శనం విషయంలో ఆ హోదా వారికి వర్తిస్తుంది. సాధారణంగా బోర్డు సభ్యులు దర్శనానికి వెళ్లే ప్రతిసారీ తమ వెంట ఓ పెద్ద గుంపును తీసుకుని వెళ్లి.. ప్రత్యేక దర్శనాలు చేయించుకుంటూ ఉంటారు. తమ వెంటవచ్చేవారితో పైరవీలు చేయించుకుంటారు.
అమ్ముకోరని గ్యారెంటీ ఏమిటి?
దర్శనానికి యిచ్చే సిఫారసు ఉత్తరాలను వేల రూపాయలకు అమ్ముకునే ఎమ్మెల్యేలు కోకొల్లలు. ఎమ్మెల్యే స్వయంగా వెళ్లినప్పుడు.. ఎల్ 1 దర్శనానికి కూడా తమ వెంట 30 మంది వరకు తీసుకు వెళ్లే అవకాశ ఉంటుంది. దాన్ని అడ్డు పెట్టుకుని.. ఒక్కో టిక్కెట్ ను 15 వేల రూపాయల వరకు బేరం పెట్టి.. ప్రతి నెలా లక్షల్లో సంపాదించుకుంటున్న ఎమ్మెల్యేలూ ఉన్నారు. వారికితోడుగా ఇప్పుడు ఈ ప్రత్యేక ఆహ్వానితులు కూడా జత చేరినట్టు కనిపిస్తోంది. ఈ ప్రత్యేక ఆహ్వానితుల్లో మరీ.. టికెట్లను అమ్ముకునే స్థాయి అథములు ఉండకపోవచ్చు గానీ.. తమ తమ వ్యాపార ఇతర రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడే వారికి గొప్ప దర్శనాలు చేయించడానికి వారు … ఈ ఆహ్వానితుడనే హోదాను అడ్డు పెట్టుకుంటారనడంలో సందేహం లేదు. ఆ రకంగా చూస్తే పైరవీకారులందరికీ.. ఆహ్వానితుల హోదాను ఏపీ ప్రభుత్వం కట్టబెట్టినట్టుగా కనిపిస్తోంది.
Must Read ;- ఏపీలో రగులుతున్న హిందూ భక్తులు











