పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకే అంటున్న ప్రభుత్వ పెద్దలు, బతికుంటేనే భవిష్యత్తు అనేది కూడా గుర్తుంచుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు పరీక్షలు రద్దు చేసి మంచి మేనమామ అనిపించుకుంటారో, ప్రాణాలతో చెలగాటమాడేలా పరీక్షలు పెట్టి కంసుడు అనిపించుకుంటారో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తేల్చుకోవాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌తో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వివిధ రంగాల నిపుణులతో సోమవారం ఆన్లైన్(జూమ్)లో టౌన్‌హాల్ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో నారా లోకేశ్ మాట్లాడుతూ దేశంలో 24 గంటల్లో 3 లక్షల 50 వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఇవి 10 రెట్లు పెరిగే అవకావం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని తెలిపారు.కరోనా సునామీలా విరుచుకుపడుతోందని మన ప్రధాని మోదీ రాష్ట్రాలను అప్రమత్తం చేయడం పరిస్థితి తీవ్రతని తెలియజేస్తోందన్నారు.
ఏపీలో 24 గంటల్లో 12,634 కేసులు
ఏపీలో 24 గంటల్లో 12,634 కేసులు కరోనా కేసులు నమోదయ్యాయని, 20 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని అధికారిక లెక్కలే వెల్లడిస్తున్నాయన్నారు. మన ఆరోగ్య, పరిశ్రమల శాఖల మంత్రులు మాట్లాడుతూ ఏపీలో ఆక్సిజన్ కొరత లేదని ప్రకటించిన మరుసటిరోజే విజయనగరం మహారాజా ఆస్పత్రి ఐసీయూలో ఐదుగురు ఆక్సిజన్ కొరతతో చనిపోయారని, దీనిపై మంత్రులు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. రాజమండ్రి, గుంటూరు ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ కొరత ఏర్పడిందని, కరోనా పేషెంట్లకు ఆస్పత్రిలో బెడ్డు దొరకడంలేదు, కోవిడ్‌తో చనిపోయిన వారికి అంత్యక్రియలకు శ్మశానంలో స్థలం కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం పరీక్షలు నిర్వహించే సమయం అంటే, మే మొదటివారానికి కోవిడ్ వైరస్ పీక్ స్టేజ్‌కి చేరుతుందని ఐఐటీ కాన్పూర్ నిపుణులు హెచ్చరించడం కరోనా తీవ్రతను సూచిస్తోందన్నారు. ఇంటికి మూడు మాస్కులివ్వలేని మన ముఖ్యమంత్రి ఏ జాగ్రత్తలు తీసుకోకుండా పరీక్షలు పెట్టి, 15 లక్షలకు పైగా విద్యార్థుల జీవితాలకు ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. ఏపీ సచివాలయంలో ఇప్పటివరకు 10 మంది ఉద్యోగులు చనిపోయారని, ఉద్యోగులైన భార్యాభర్తలు కోవిడ్ బారిన పడి మృతి చెందారని, వారి పిల్లలకు దిక్కెవరని ప్రశ్నించారు. కోవిడ్ కోరలు చాచిన వేళ 15 లక్షల మంది విద్యార్థుల్ని పరీక్షలకు ఒకేసారి రప్పిస్తే వారి తల్లిదండ్రులకు కోవిడ్ వచ్చి మరణిస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పరీక్షలు రద్దు చేయాలని 87 శాతం మంది కోరుతున్నారని అనేక సర్వేలు వెల్లడిస్తున్నా, సర్కారు ఏకపక్ష నిర్ణయాలు సమంజసం కాదన్నారు.
ఇప్పటివరకూ 100 మందికి పైగా టీచర్లు కోవిడ్‌తో చనిపోయారని, ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని ఉపాధ్యాయుల సంఘం కూడా ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు. చదువు చెప్పి..పరీక్షలు నిర్వహించాల్సిన ఉపాధ్యాయులకు రక్షణలేకపోతే ..పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలా? విద్యార్థులకు రక్షణ లేకపోతే వారిని పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లే తల్లిదండ్రులకు ఎవరు రక్షణ కల్పిస్తారని సర్కారుని లోకేశ్ నిలదీశారు. పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ రద్దు చేయాలి..ప్లస్ టూ వాయిదా వేయాలని 18వ తేదీన ఓ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరానని గుర్తు చేశారు. 22వ తేదీన పరీక్షల రద్దు డిమాండ్‌తో మొదటి టౌన్‌హాల్ సమావేశంలో వచ్చిన అందరి అభిప్రాయాల మేరకు ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా పరీక్షలు రద్దు చేయాలనుకునేవారు 9444190000 వాట్సప్ నెంబర్‌కి CBE2021 మెసేజ్ చేయాలని కోరామన్నారు. ఈ వాట్సప్ నంబర్‌కి పరీక్షల రద్దు కోరుతూ 2 లక్షల 35 వేల మంది మద్దతు ఇచ్చారన్నారు. 1లక్షా 13 వేల మంది తమ అభిప్రాయాలను పంపారని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పరీక్షల రద్దు చేయించేలా ప్రభుత్వానికి సూచనలు చేయాలని గవర్నర్‌కు లేఖ రాశానని వివరించారు. అన్నివర్గాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని పరీక్షలపై ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. నేను లేఖ రాసినందు వల్లే పరీక్షలు పెడతామనే మొండి వైఖరి విడనాడాలని సూచించారు. “నాకెటువంటి ఇగోలు లేవు..నేను రాసిన లేఖలన్నీ విత్‌డ్రా చేసుకుంటాను. దయచేసి పిల్లల ప్రాణాలు కాపాడేందుకు పరీక్షలు రద్దు చేయండి.“ అని నారా లోకేష్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పరీక్షల రద్దు ఉద్యమాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలి, న్యాయపోరాటం చేయాలా వద్దా అనే అభిప్రాయాలు తెలియజేయాలని అందరినీ కోరారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో దాదాపు 1000 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘనేతలు, వివిధరంగాల మేధావులు చేరారు. ఈ సందర్భంగా జూమ్‌లో పెట్టిన పోల్‌లో న్యాయపోరాటం చేయాల్సిందేనని 97 శాతం అభిప్రాయపడ్డారు. పరీక్షలు రద్దుకి న్యాయపోరాటానికి వెళ్తున్నామని నారా లోకేశ్ ప్రకటించారు.
పిల్లలకు ఏమైనా అయితే తట్టుకోలేం : స్మిత, గాయని
కొవిడ్ సెకండ్ వేవ్ టైంలో కనీసం ఆస్పత్రిలో బెడ్, ఆక్సిజన్ కూడా అందించలేని పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి ఇంకా ప్రమాదం. ఏమి జరిగినా తట్టుకుంటాం గానీ, పిల్లలకు ఏమైనా అయితే తట్టుకోలేం. రాజకీయాలకు అతీతంగా పిల్లల భద్రత దృష్టిలో ఉంచుకుని పరీక్షలు వాయిదా వేయాలి.
మానసిక ఆందోళనలో విద్యార్థులు : డాక్టర్ ఎన్బీ సుధాకర్ రెడ్డి, సైకాలజిస్ట్
ఓ వైపు కరోనా, మరో వైపు పరీక్షలు ఎలా ఎదుర్కోవాలి అనే ఆందోళనలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. మానసిక ఆందోళనతో తలనొప్పి, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు బయట పడుతున్నాయి. మరో వైపు కరోనా విజృంభిస్తుంటే పరీక్షలు పెడతామనడం మూర్ఖత్వమే.
ఒత్తిడిల మధ్య పిల్లలకు పరీక్షలు తగదు : మాధవరావు, వందేమాతరం ఫౌండేషన్
పరీక్షల విధానమే లోపభూయిష్టమని సర్వేలు చెబుతున్నాయి. పరీక్షలు అంటే ఒత్తిడి…కరోనా భయం మరో ఒత్తిడి..రెండింతల ఒత్తిడి మధ్య పిల్లలకు పరీక్షలు నిర్వహించడం మంచిది కాదు.\
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: రవిచంద్ర, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు
మొండిగా పరీక్షలు నిర్వహిస్తామని అంటున్న ప్రభుత్వం కనీసం విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలైన తీసుకోవాలి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు.
పరీక్షల రద్దుపై పిటిషన్ వేయవచ్చు: జంధ్యాల రవిశంకర్, ప్రముఖ న్యాయవాదులు
గతేడాది నా కుమారుడు ఇంటర్ పాసై బిట్స్ పిలానీలోకి వెళ్లాడు. వాళ్లకు కూడా పరీక్షలు ఆలస్యమై .. ఎంట్రన్స్‌లు అయిపోయే సరికి దాదాపు నవంబర్ అయిపోయింది. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. సెకెండ్ సెమిస్టర్ అయిపోయి కూడా ఏడాదవుతోంది. ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్‌లో జాయిన్ అయ్యేవారికి ప్రాబ్లమ్ లేదు. పది, జూనియర్ ఇంటర్ వాళ్లకు పరీక్షలు పెట్టడం కూడా పెద్ద ముఖ్యమేమీ కాదు. పది పరీక్షలు పెట్టకపోవడం వల్ల వచ్చే సమస్యేమీ లేదు. రైట్ లివ్ ముఖ్యం. ఆర్టికల్ 21 కింద ఇది చాలా ముఖ్యం. మెడికల్ హెల్త్, రైట్ టూ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. పది పరీక్షలు రద్దు వల్ల పెద్ద సీరియస్ ఏమీ కాదు. వందమంది టీచర్లు చనిపోయారు. 15 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు, 7 లక్షల మంది ఇంటర్మీడియట్ వాళ్లు ఉన్నారు. వీరందరూ మైనర్లే. వాళ్లతో ఒక్క పేరెంట్ వెళ్లినా 32 లక్షల మంది ఎఫెక్ట్ అవుతారు. వీరు ఇద్దరికో, ముగ్గురికో అంటించినా 80 లక్షల మందికి పైగా ఎఫెక్ట్ అవుతారు. ఇవన్నీ చాలా సీరియస్ ఇష్యూస్. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలను వాయిదా వేశారు. ఐఐటీ, నీట్ లాంటి పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. దేశంలో 40 లక్షల మంది కరోనా బారిన పడి చనిపోతారని నివేదికలు చెబుతున్నాయి. 10 లక్షల మంది త్వరగా చనిపోతారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇన్ఫెక్ట్ అయ్యే వాళ్ల రేషియో ఎంత ఉంటుందో ఆలోచించాలి. కోర్టులో విద్యార్థులు, తల్లిదండ్రులతో పరీక్షల రద్దుపై రిట్ పిటిషన్ వేయవచ్చు. ఇది హక్కుల కోసం పోరాటం. 29వ తేదీ లోగా పిటిషన్ వేయాలి.
Must Read ;- ఏపీలో పది,ఇంటర్ పరీక్షల నిర్వహణపై జోక్యం చేసుకోండి.. గవర్నర్‌కు లోకేశ్ లేఖ











