‘మళ్లి కూయవే గువ్వా’ అంటూ సినిమాల్లో తన పాటల ప్రయాణం మొదలు పెట్టిన కందికొండ చిన్న వయసులోనే గొంతు క్యాన్సర్ తో బాధ పడటం ఎంతోమందిని కలచివేస్తోంది. 47 ఏడేళ్ల వయసున్న కందికొండ కిమ్స్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే పాటలెన్నో రాశారు. ముఖ్యంగా జాన పద పాటల రచనలో కందికొండది అందెవేసిన చేయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాగుర్ల పల్లి ఆయన సొంతూరు. ఆయన పూర్తిపేరు కందికొండ యాదగిరి.
దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్ డీ పూర్తి చేసుకోవడమే కాదు తెలంగాణ పండుగల విశష్టతలనూ, విశేషాలనూ తెలిపేలా ఎన్నో పాటలు రాశారు. జీ.హెచ్. ఎం.సి, తెలంగాణ బోనాల పాట, సమ్మక్క సారక్కల పాట, కాళేశ్వరం పాట, దీపావళి పాట, సంక్రాంతి పాటలన్నీ ఆయన కలం నుంచి పుట్టినవే. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంతో ఆయన సినిమా పాటల ప్రయాణం మొదలైంది.
దేశముదురు, పోకిరి, మున్నా, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి చిత్రాలలో దాదాపు 1200కు పైగా పాటలు రాశారు. 15 రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత కిమ్స్ ఆస్పత్రికి మారారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
మంత్రి కేటీఆర్ చేయూత
కందికొండ ఆరోగ్య పరిస్థితి మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. ఆయన చికిత్స వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిపి రెండున్నర లక్షల సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రి యాజమాన్యం తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సూచించారు. ప్రతి రోజూ వెంటిలేటర్ ఛార్జీలే రూ. 70 వేల వరకూ చెల్లించాల్సి వస్తోందట. వారి ఫోన్ నంబర్ 8179310687. ఎవరైనా సాయం అందించదలుచుకుంటే ఈ నంబర్ లో సంప్రదించాల్సిందిగా సూచించారు.
ప్రస్తుతం కందికొండకు కీమో థెరపీ చికిత్సను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్ గానే ఉందని వైద్యులు అంటున్నారు. ఆయన కోలుకోవాలంటే లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు అంటున్నారు. చిన్న వయసులోనే కందికొండకు ఈ పరిస్థితి రావడాన్ని ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో ఒక విధంగా ఆయన ప్రాణాలను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు.
Must Read ;- జూన్ 4న బాలుకు తెలుగు చిత్రసీమ స్వరనీరాజనం











