‘ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు’.. పూరి మార్కు డైలాగ్ అంటే ఇంతకుమించి ఏమీ చెప్పలేం. ఈ డైలాగ్ ను బట్టే పాత్ర స్వభావం ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది.
‘పోకిరి’ సినిమా విడుదలై ఈ ఏప్రిల్ 28కి 15 ఏళ్లు. ‘బద్రి’ సినిమా టైమ్ లోనే దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ కథను రాసుకున్నారంటే ఈ పాత్ర మీద ఆయన ఎంతగా మోజు పెంచుకున్నారో మనకు అర్థమవుతుంది. ‘ఉత్తమ్‌సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ’ కథ కాస్తా ‘పోకిరి’గా మారడం వెనక చాలా కథే నడిచింది. మహేష్ బాబు సరసన ఇలియానా జంటగా రూపొందిన ‘పోకిరి’ గురించే అందరికీ తెలుసుగాని అసలు కథ మాత్రం ఎవరికీ తెలియదు. పూరి తన కథకు మొదట అనుకున్న హీరోహీరోయిన్లు వేరు.. ఆ తర్వాత వచ్చిన హీరోహీరోయిన్లు వేరు. కథ విన్న రవితేజ ఓకే చెప్పినా ఆయనకు ‘ఆటోగ్రాఫ్’ అవకాశం వచ్చి అటు వైపు మొగ్గుచూపారు.
అసలు సోనూసూద్ ని హీరోగా పెట్టి చేసేద్దామన్న ఆలోచన కూడా పూరి జగన్నాథ్ కు వచ్చిందట. అదీ కార్యరూపం దాల్చలేదు. దాదాపు 12 సినిమాల ప్రయాణం కొనసాగినా ఉత్తమ్ సింగ్ మాత్రం తెరమీదకు రాలేకపోయాడు. అసలు ‘ఇడియట్’ సినిమాని మహేష్ తో చేయాల్సి ఉన్నా ఆ కథ మహేశ్ కు నచ్చకపోవడం వల్ల రవితేజతో పట్టాలెక్కింది. ఉత్తమసింగ్ పాత్రను మహేశ్ చేస్తేనే బాగుంటుందని పూరి అనుకోవడం ఆయనను సంప్రదించడం జరిగింది. 2004 నవంబరు 3న హైదరాబాద్ తాజ్ హోటల్లో పూరి, మహేశ్ సిటింగ్ ఏర్పాటైంది.
హీరో సిక్కు కుర్రాడు. పాత్ర పేరు ఉత్తమ్ సింగ్. మాఫియా ముఠాలో చేరతాడు. వాళ్ల మధ్యే ఉంటూ వాళ్లను ఖతమ్ చేస్తాడు. క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటంటే `ఉత్తమ్‌సింగ్ ఓ పోలీసాఫీసర్. పూరి కథ చెప్పడం పూర్తికాగానే ‘ఎక్స్ లెంట్ మైండ్ బ్లోయింగ్’ అనేశారు మహేశ్ సినిమా డైలాగ్ మాదిరిగానే. కాకపోతే సిక్కు బ్యాక్ డ్రాప్ వద్దనడంతో మార్చాల్సి వచ్చింది. వచ్చే ఏడాది చేద్దాం అనడంతో నాగార్జునతో ‘సూపర్’ పూర్తి చేసి ఉత్తమ్ సింగ్ ప్రాజెక్టు చేపట్టారు. కాకపోతే టైటిల్ మార్చాలని మహేశ్ కోరడంతో ‘పోకిరి’ ఖరారు చేశారు పూరి.
సినిమాని త్వరగా పూర్తి చేయడం పూరి వల్లే సాధ్యం. 70 రోజుల్లో ఆ సినిమాని పూర్తి చేశారు పూరి. అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ ఏడెకరాలు, అల్యూమినియమ్ ఫ్యాక్టరీ, చెన్నైలోని బిన్నీమిల్స్, బ్యాంకాక్, పుకెట్ ఐలెండ్.. ఇవీ షూటింగ్ లొకేషన్లు. 2006 ఏప్రిల్ 28న ‘పోకిరి’ విడుదలైంది. ఆ సినిమా సాధించిన కలెక్షన్ రికార్డుల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. 75 సంవత్సరాల తెలుగు సినిమా రికార్డులను తిరగ రాసింది.
పాత్రల కోసం వేట..
మహేశ్ సరసన హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయాలా అని ఆలోచించారు. సూపర్ లో చేసిన ఆయేషా టకియా అనుకున్నారు. తర్వాత పార్వతీ మెల్టన్, దీపికా పదుకునే, కంగనా రనౌత్.. ఇలా రకరకాల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరికి దేవదాసు భామ ఇలియానాను అవకాశం వరించింది. పూరి తన భార్య లావణ్య ముద్దు పేరునే మహేశ్ కు పెట్టారు. అదే పండు. నిజంగానే ఆ పండు మైండ్ బ్లాక్ చేసేశాడు. హీరోకి ధీటైన విలన్ కావాలి కాబట్టి ప్రకాశ్ రాజ్ ఆ పాత్రకు న్యాయం చేశారు. ఓ సీన్ లో ప్రకాశ్ రాజ్ ని హీరో ఒక్క పీకు పీకితే థియేటర్ సౌండ్ లేకుండా సైలెన్స్ తో జనం ముందుంచారు. ఆ సన్నివేశం విపరీతంగా పేలింది.
పూరి బలం.. బలగం..
తెలుగు సినిమా రంగంలో దర్శకులందరిదీ ఓ దారి పూరి జగన్నాథ్ ది ఓ దారి అనుకోవాలి. అందరూ ఆలోచించేలా ఆయన ఆలోచించరని ఆయన తన సినిమాల ద్వరా రుజువు చేశారు. హీరోని పక్కా మాస్ పాత్రలో ఎలా నిలబెట్టాలో పూరికి తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు. అలాంటి మాస్ నాడి తెలిసిన దర్శకుడాయన. ఆయన బలం పవర్ ఫుల్ డైలాగ్స్.. ఆ డైలాగ్ పంచ్ లే సినిమాని నిలబెడతాయి. ఆయన చెప్పదలుచుకున్న పాత్ర తాలూకు స్వభావం ఆ డైలాగుల్లో కనిపిస్తుంది. ఆయన పాత్రను బట్టే కథను అల్లుకుంటాడేమో అనిపిస్తుంది. కథలో గొప్పతనం ఏమీ లేకపోయినా కథనంతో ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టేస్తాడు.
Must Read ;- సినిమా గుండెల్లో కరోనా గుబులు.. విడుదల వాయిదా
ఆయన మనసుకెక్కిందే కథ.. మనసుకెక్కిందే స్క్రిప్టు’ అంటారు రచయితగా ఆయనతో ట్రావెల్ చేసిన తోట ప్రసాద్. ఆయన సెల్ప్ బాస్ అంటూ కితాబిచ్చారు. పూరిదంతా టేకిట్ ఈజీ పాలసీ.. బహుశా ఇదే ఆయనను వర్మ దగ్గర శిష్యరికం చేసేలా చేసిందేమో. ఆయన సినిమాల్లో కూడా అదే ప్రతిఫలిస్తుంది. అందరూ ఆలోచించే దానికి భిన్నంగా ఆలోచించడం ఆయన స్టయిల్. జీవితాన్ని రివర్స్ లో ఆయన చూస్తాడు.. అలాగే జనానికి చూపిస్తాడు. ముఖ్యంగా తన సినిమా ఎలా ఉండబోతుందో టైటిల్ ద్వారానే చెప్పేయడం పూరి ప్రత్యేకత.
అది ‘పోకిరి’ చూస్తేనే అర్థమవుతుంది. ఇక మాస్ టైటిల్స్ లోనూ ఆయన మహారాజే. ఇడియట్, పోకిరి, లోఫర్, రోగ్, టెంపర్, లైగర్.. ఇలా సాగిపోతాయి ఆయన టైటిల్స్. డైరెక్టర్ కు ఉండాల్సిన లక్షణాలు సూటిగా స్పష్టంగా చెప్పడం, వేగంగా సినిమా తీయడం.. డ్రామా పండించడం. నేటి తరంలో ఈ లక్షణాలన్నీ పూరి జగన్నాథ్ కు మాత్రమే ఉన్నాయి. సినిమాని త్వరగా పూర్తిచేసి వేడివేడి దోశలాగా వడ్డించడం పూరికి మాత్రమే తెలిసిన విద్య. అందుకే ఈరోజు ‘పోకిరి’ గురించి రాస్తూ పూరి దర్శకత్వ విధానాన్ని కూడా ప్రస్తావించాల్సి వచ్చింది.
-హేమసుందర్
Also Read ;- పవర్ స్టార్ తో మరోసారి పూరి జగన్నాథ్