కన్నడ చిత్ర నిర్మాత, నటి మాలాశ్రీ భర్త రాము కరోనాతో కన్నుమూశారు. కర్ణాటకలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ లాక్ డౌన్ పెట్టారు కూడా. రాముకు కన్నడ చిత్ర పరిశ్రమలో కోటి రాముగా పేరు. ఆయన కన్నడంలో అనేక హిట్ సినిమాలను నిర్మించారు. గత వారం ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. మూడు రోజుల క్రితం బెంగళూరులోని ఎం.ఎస్ .రామయ్య ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు చేస్తున్న చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదు. సోమవారం రాత్రి ఆస్పత్రిలో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆయన భార్య అయిన నటి మాలాశ్రీ తెలుగు వారికి సుపరిచితురాలు. ఆమె బాలనటిగా తెలుగు , తమిళ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించింది. కన్నడ సినిమా నంజుడి కల్యాణ అనే సినిమాతో హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసింది. స్టార్ హీరోయిన్ హోదా సంపాదించి కన్నడ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపింది. 1980-90 దశకంలో ఆమె నటించిన ప్రతి కన్నడ సినిమా హిట్ అయ్యింది. కన్నడ రంగంలో యాక్షన్ హీరోయిన్ పాత్రకు పెట్టింది పేరుగా నిలిచి లేడీ అమితాబ్ అనే పేరు సంపాదించింది.
తెలుగులో ప్రేమఖైదీతో పరిచయమైంది. పరువు ప్రతిష్ట, తోడికోడళ్లు, బావమరిది, ఊర్మిళ, బంగారు మొగుడు, అల్లరి పోలీసు, ఆంధ్ర కిరణ్ బేడీ, సాహసవీరుడు సాగరకన్య, భద్రాచలం, చాముండి, ఘరానా అల్లుడు, మన్మద సామ్రాజ్యం.. ఇలా అనేక హిట్ సినిమాలతో మంచి పేరు సంపాదించింది. హీరో సుమన్ తో కలిసి ఎక్కువ సినిమాలు చేసింది. ఆమె నటించిన అనేక సినిమాలు తెలుగులోకి డబ్బ్ చేశారు. కన్నడంలో భారీ చిత్రాలు నిర్మిస్తున్న రామును ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
Must Read ;- కరోనాతో దర్శకుడు సాయిబాలాజీ కన్నుమూత











