‘నేలటిక్కెట్’ తెలుగు నేలపై అడుగుపెట్టిన మాళవికాశర్మ ‘రెడ్’ మీద చాలా ఆశలు పెట్టుకుంది. పక్కా కమర్షియల్ ఫార్ములాతో తెరెకెక్కిన ఈ సినిమాలో మాళవిక అందాల ఆరబోతకే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుంది. ఇందులో ఆమె పాత్ర పేరు మహిమ అట. దర్శకుడు కిశోర్ తిరుమల సెట్లో కూడా ఆమెను మహిమ అనే పిలిచేవారట. అటు మోడల్ గానూ, ఇటు నటిగానూ ఈ భామ బిజీగా ఉంది. మోడల్ గా చేస్తే ఎంచక్కా దుబాయ్, థాయ్ లాండ్ లాంటి చోటుకు వెళ్లి షూటింగ్ లో ఎంజాయ్ చేసేదట. సినిమాల్లో మాత్రం అలా ఎంజాయ్ చేయడం కుదరదని అంటోంది. పాత్రను అర్థం చేసుకుని నటించాలి కాబట్టి ఇక్కడ ఎంజాయ్ మెంట్ ఉండదని, కేవలం డెడికేషన్ తోనే నటించాల్సి ఉంటుందని అంటోంది.
ఇంతకీ రెడ్ లో రామ్ సరసన నటించే అవకాశం ఎలా వచ్చిందో తెలుసా? ఎల్ఎల్ బీ రెండో ఏడాది తర్వాత ఇంటర్న్ షిప్ చేస్తున్నప్పుడు నిర్మాత స్రవంతి రవికిశోర్ ఫోన్ చేశారట. ఆఫీసుకు వెళ్లి కలిస్తే కిశోర్ తిరుమల కథ చెప్పడంతో నచ్చి ఈ సినిమా అంగీకరించానని తెలిపింది. షూటింగ్ చేస్తున్నప్పుడు రామ్ తనతో క్లోజ్ గా మూవ్ అయినా బయట మాత్రం రిజర్వుడ్ గా ఉంటారని అంది. సినిమాల్లో కనిపించే ఆయన ఎనర్జీ బయట ఎందుకు కనిపించడం లేదోనని వాపోయింది. ఈ సినిమా మొదట్లో తను చాలా టేకులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. ఈ విషయంలో రామ్ తనకు హీరోగా ఎంతో కోపరేట్ చేశారని చెప్పింది.
Must Read ;- అడ్వకేట్ గా మారిన ‘నేలటిక్కెట్టు’ భామ

కరోనా పెరగడానికి ఐదు రోజుల ముందు వరకూ ఇటలీలో షూటింగ్ లో పాల్గొన్నామని, విమానంలో మాస్క్ ధరించినా యూరప్ వెళ్లాక అన్నీ పక్కన పడేశానని వివరించింది. అక్కడి నుంచి తిరగొచ్చాక గానీ అసలు విషయం తెలియలేదని, ఆ విషయం తలచుకుంటేనే భయమేస్తోందని అంది. హీరోగా రామ్ టాలెంట్ కు మాత్రం ఈ భామ కితాబిస్తోంది. డ్యాన్సల్లో రామ్ స్పీడుకు తట్టుకోలేకపోయానంటోంది. ఆయనతో డ్యాన్సులు వేయడం కష్టమంటోంది. ఈ సినిమా కోసం డైలాగులు రిహార్సల్ చేశానని, దీని కోసం ప్రత్యేకంగా తెలుగు ట్యూటర్ ను పెట్టుకున్నట్టు వివరించింది. లిప్ సింక్ కోసం ఇలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది.
మాళవిక కాలేజీలో చదువుకునే రోజుల్నుంచే మోడలింగ్ చేస్తోంది. చాలా కమర్షియల్ యాడ్స్ చేసింది. హిమాలయ, మీరా, కోకోనట్ ఆయిల్, సంతూర్ సోప్ లాంటి యాడ్స్ లో నటించింది. ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో 8 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. ఫిట్ నెస్ మీద బాగా దృష్టి పెట్టింది. అదరూ బరువు తగ్గాలనుకుంటుంటే ఈమె మాత్రం కాస్త బరువు పెరగాలనుకుంటోంది. దీని కోసం ఫిట్ నెస్ ట్రైనర్, డైటీషియన్ ను నియమించుకుంది. దక్షిణాదివారు కొంచెం బొద్దుగా ఉంటే అమ్మాయిలనే ఇష్టపడతారని, అందుకే తానీ నిర్ణయం తీసుకున్నానని వివరించింది. తెలుగులో మాళవిక వెలుగులు ఎలా ఉంటాయో చూడాలి.











