Manchu Vishnu Controversy Statement :
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల విషయంలో జరిగే రచ్చ ఇంతలో ఆగేటట్లు లేదు. ఈ పదవికి ప్రకాష్ రాజ్ తో పోటీ పడుతున్న మంచు విష్ణు తన ప్యానల్ ను ఇంతవరకు ప్రకటించలేదుగానీ తరచూ వార్తల్లో నిలుస్తూ సంచలనాలకు తెరతీస్తున్నారు. ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించి మౌనంగా అంతా గమనిస్తున్నారు. ఈ వ్యవహారంలో నందమూరి బాలకృష్ణ పేరును తెరపైకి లాగటమే కాదు కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలను మంచు విష్ణు చేయడం కొత్త వివాదాలకు తెరతీసింది.
మా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నిక ఏకగ్రీవం అయి నందమూరి బాలకృష్ణ ఈ పదవికి ఎంపికైతే తాను ఎంతో సంతోషిస్తాననడం వెనక కారణం ఏమై ఉంటుందన్న చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. ఇందులోకి బాలయ్యను లాగడం ఎంతవరకు సబబు అని ఓ వర్గం అంటోంది. తెలుగు సినీ పరిశ్రమ పెద్దలంతా కలిసి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తాను మా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటాననని అన్నారు.
కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, సత్యనారాయణ, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, జయసుధ.. ఇలా తెలుగు సినీ పరిశ్రమ పెద్దలంతా కలిసి ఏకగీవ్రంగా ‘మా’ అధ్యక్షుడిని ఎన్నుకుంటే తాను ఈ ఏడాది ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని, అలా కాకుంటే ఎన్నికల్లో పోటీ చేసి తీరతానని ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఈ సినిమా పెద్దలు ఎవరిని ఏకగీవ్రంగా ఎన్నుకున్నాతనకు అభ్యంతరం లేదని అన్నారు. బాలయ్య అన్నలాంటి వ్యక్తి అనీ, ఒకవేళ ఆయన్నే అధ్యక్షుడిగా ఎన్నుకుంటే తాను సంతోషిస్తానని అన్నారు.
ఆయన ఈ పదవికి ఎన్నికైతే అందరికీ మేలు జరుగుతుందని అన్నారు. నందమూరి బాలకృష్ణ సమకాలికులైన కొందరు మా ఎన్నికల్లో నిలబడలేదని, వారిలో ఎవరైనా తనకు అభ్యంతరం లేదని అన్నారు. ఈ ఎన్నికల విషయంలో ఇంత రాద్దాంతం జరగడం మీద ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు అసంతృప్తితో ఉన్నారు. ఏకగ్రీవ ఎన్నిక దిశగా మా అడుగులు పడే సూచన కూడా లేదు. కావాలనే మంచు విష్ణు ఈ మాటలు అన్నట్లు తెలుస్తోంది.
ఆ నటులు ఎవరు?
కొందరు నటులపై మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలతో వారెవరు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ఊచలు లెక్కించాల్సిన చాలామంది బయట తిరుగుతున్నారంటే తను చేసిన సాయం వల్లేనని చెప్పారు. ఈ మాటల్ని విష్ణు ఎందుకు అనాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు. ఆ వ్యక్తులు విష్ణు పోటీపై ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేశారా? అని కూడా ఆరాతీస్తున్నారు. వారెవరై ఉంటారన్న ఊహాగానాలు కూడా సాగుతున్నాయి.
వారు అండర్ వేర్ తో పోలీస్ స్టేషన్ లో ఉంటే తాను తెల్లవారు జామున 4.30 గంటలకు వెళ్లి విడిపించుకు వచ్చానని చెప్పారు. వారు ఎక్కువ మాట్లాడితే ఆ పేర్లను బయటపెడతానని బెదిరించారు. విష్ణు ఇలా మాట్లాడటం ఏమీ బాగుండలేదని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో అతను సంయమనం పాటించి ఉండాల్సిందని అంటున్నారు.