విజయ్ … కొంతకాలంగా ఈ పేరు సక్సెస్ కి మారుపేరుగా మారిపోయింది. తమిళనాట కొత్త రికార్డులకు కేంద్రంగా నిలిచిపోయింది. కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఎప్పటికప్పుడు విజయ్ తన జోరు తగ్గకుండా చూసుకుంటూ వస్తున్నాడు. సినిమా .. సినిమాకి ఆయన రేంజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. వసూళ్ల విషయంలో ఆయన సినిమాలు కొత్త రికార్డులను సెట్ చేసి పెడుతున్నాయి. ఆ రికార్డులను అందుకోవడం మిగతా హీరోలా టార్గెట్ అయిపోయింది. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందటే అభిమానుల్లో ఉత్సాహం కట్టలు తెంచుకుంటుంది .. థియేటర్ల దగ్గర జాతర కనిపిస్తుంది.
విజయ్ కి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకు తగినట్టుగానే ఆయన తన సినిమాల్లో మాస్ అంశాలు ఉండేలా చూసుకుంటాడు. వాళ్లను దృష్టిలో పెట్టుకునే తన పాత్రను డిజైన్ చేయించుకుంటాడు. తనదైన స్టైల్ తో ఆ పాత్రలను ఆడియన్స్ కి మరింత దగ్గరగా తీసుకెళతాడు. కొంతకాలంగా ఆయన తన సినిమాల భారీతనాన్ని పెంచుతూ వచ్చాడు. బడ్జెట్ కి తగినట్టుగానే అవి భారీ విజయాలను అందుకున్నాయి. తెలుగు థియేటర్స్ లోను ఆ సినిమాలు సందడి చేశాయి. ఖర్చుతో కూడిన కథలతో .. డిఫరెంట్ లుక్స్ తో ఎంటర్టైన్ చేసే దిశగానే ఆయన ముందుకు వెళుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఆయన ‘మాస్టర్’ సినిమా రూపొందింది. కార్తి ‘ఖైదీ’ సినిమాతో .. స్క్రీన్ ప్లే అంటే ఇది అని నిరూపించిన లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. ఒక లారీతో .. లుంగీ, టవల్ ధరించిన ఒక హీరోతో సింపుల్ గా ‘ఖైదీ’ కథను నడిపించి కాసుల వర్షం కురిపించిన క్రెడిట్ ఆయన ఖాతాలో ఉంది. అలాంటి దర్శకుడి నుంచి వస్తున్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ‘జేడీ’ పాత్రలో విజయ్ చెలరేగిపోనున్నాడని తెలుస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా పెద్ద సంఖ్యలో థియేటర్లను ఆక్రమించబోతోంది. ఈ సినిమాతో విజయ్ సరికొత్త రికార్డులతో సంచలనం సృష్టించడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు.
Also Read: కోటీ మందితో కొత్త రికార్డు నెలకొల్పిన విజయ్ దేవరకొండ