Is Ambati Rambabu Trapped By YSRCP MLA’s :
వైసీపీ కీలక నేత, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు చెందినది చెబుతున్న ఓ వీడియో గడచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో సోమవారం నాడు మరింతగా వైరల్ కాగా.. స్వయంగా అంబటి వివరణ ఇచ్చారు. తనపై కుట్ర జరుగుతున్నదని, అందులో భాగంగానే ఈ తరహా వీడియోలు ప్రత్యక్షమవుతున్నారని, గడచిన 15 రోజుల నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోందని కూడా స్వయంగా అంబటే చెప్పుకొచ్చారు. తనపై కుట్ర జరుగుతోందని, ఆ కుట్రలో భాగంగానే ఈ వీడియో విడుదలైందని కూడా ఆయనే చెప్పుకొచ్చారు. ఇలాంటి వీడియోలను తన నియోకజవర్గ ప్రజలు గానీ, వైసీపీ కేడర్ నమ్మొద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయాలన్నాక ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు సహజమే అయినా.. అంబటిపై హనీ ట్రాప్ ను తలపించేలా ఈ కుట్రకు పాల్పడిందెవరన్న విషయమే ఇప్పుడు అమితాసక్తి రేకెత్తిస్తోంది.
అంబటికి జగన్ హామీ
వైసీపీ అధికారంలోకి వస్తే.. జగన్ వాయిస్ ను బలంగా వినిపించే అంబటి రాంబాబుకు మంత్రి పదవి ఖాయమన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019లో జగన్ సీఎం కాగానే.. ఆయన కేబినెట్ లో అంబటికి స్థానం తప్పనిసరి అని, హోం మినిస్ట్రీనే ఆయనకు అప్పగించబోతున్నారని కూడా కథనాలు వినిపించాయి. అయితే జగన్ కేబినెట్ లో అంబటికి చోటు దక్కలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన అంబటిని పిలిచి మరీ జగన్ పరిస్థితిని వివరించారట. రెండేళ్ల తర్వాత కేబినెట్ పునర్వవస్థీకరణలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తానని కూడా హామీ ఇచ్చారట. ఈ క్రమంలో జగన్ కేబినెట్ కు రెండున్నరేళ్ల వయసు త్వరలోనే నిండనుంది. దీంతో అప్పుడే కేబినెట్ ప్రక్షాళనకు సంబంధించి ఊహాగానాలు మొదలైపోయాయి. అంతగా రాణించని మంత్రులను తప్పించి.. వారి స్థానంలో ఇతరులకు అవకాశం కల్పించే దిశగా జగన్ కూడా అడుగులు వేస్తున్నారు. జగన్ లో చాలా స్పష్టంగానే కనిపిస్తున్న ఈ మార్పును గమనించిన పార్టీ ఎమ్మెల్యేలు ఈ దఫా ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాల్సిందేనన్న కోణంలో తమదైన శైలి యత్నాలు ప్రారంభించారట.
16 మందిలో 10 మంది ఆశావహులు
ఈ యత్నాల్లో భాగంగానే కుట్రలు, కుతంత్రాలు, వర్గ పోరు, ఒకరిని తొక్కేస్తేనే తమకు పదవి దక్కుతుందన్న వ్యూహాలు, తమకు పోటీగా ఉన్న వారిని జాబితా నుంచి తొలగించే దిశగా మరింత పదునైన ప్లాన్ లు.. ఇలా చాలానే రంగంలోకి దిగేశాయట. వీటిలో భాగంగా గుంటూరు జిల్లాలోనూ ఈ తరహా పోరుకు ఎప్పుడో తెర లేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన రెండో జిల్లాగా ఉన్న గుంటూరులో మొత్తం 17 నియోజకవర్గాలు ఉంటే.. వాటిలో 15 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ తరఫున ఇద్దరు గెలవగా.. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఇటీవలే వైసీపీ పక్షానికి మారిపోయారు. మొత్తంగా ఇప్పుడు వైసీపీకి గుంటూరు జిల్లాలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు లెక్క. ఈ 16 మందిలో మంత్రి పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య 10 మేర ఉన్నట్లుగా సమాచారం. వారిలో కేవలం ఒక్కరికే మంత్రి పదవులు దక్కగా.. మిగిలిన వారంతా రెండో దఫాలో అయినా చాన్స్ దక్కించుకునే దిశగా యత్నాలు ముమ్మరం చేశారట. ఆశావహులు అధికంగా ఉన్న నేపథ్యంలో పార్టీలో వర్గ పోరు అనివార్యంగా మారిందట. ఈ వర్గ పోరులో భాగంగా.. ఒకరిని తొక్కేస్తేనే కదా తమకు పదవి దక్కేది అన్న కోణంలో కొందరు తమ పార్టీ ఎమ్మెల్యేలపైనే కుట్రలకు తెర తీసినట్లుగా తెలుస్తోంది.
మరిన్ని వీడియోలు ఉన్నాయట
ఇందులో భాగంగానే.. రీషఫిలింగ్ లో మంత్రి పదవి ఖాయమని భావిస్తున్న అంబటి రాంబాబును రేసు నుంచి తప్పించేందుకు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు యత్నాలు ప్రారంభించారట. ఇందులో భాగంగానే గతంలో ఓ మహిళ చేసిన ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న వైనాన్ని ఆసరా చేసుకుని.. అదే తరహాలో దాని కంటే కాస్తంత బలమైన వివాదంలో అంబటి చిక్కుకునేలా ప్లాన్ చేశారట. ఇందులో భాగంగా హనీ ట్రాప్ ను ఎన్నుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. ఓ మహిళతో అంబటి మాట్లాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టేశారట. ఏడాదిగా ఈ వ్యూహం నడుస్తుండగా.. ప్రస్తుతానికి ఒక్క వీడియోను విడుదల చేసిన ప్రత్యర్థులు.. మరిన్ని వీడియోలను కూడా రెడీగా పెట్టుకున్నారట. ఈ వీడియోతో అంబటి అవకాశాలు మృగ్యం కాకపోతే.. మరిన్ని వీడియోలను విడుదల చేసేలా వ్యూహాలు రచిస్తున్నారట. ఈ వ్యూహంతో అంబటి ఎలాగైనా రేసు నుంచి తప్పుకోక తప్పదని.. అప్పుడు తమ అవకాశాలు మెరుగు కావడంతో పాటుగా మంత్రి పదవి దక్కడం ఖాయమనే దిశగానే వారు వ్యూహాలు రచిస్తున్నారట.
సూత్రధారులు ఎవరబ్బా?
గుంటూరు జిల్లాలో మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), విడదల రజని(చిలకలూరిపేట), ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి), కాసు మహేశ్ రెడ్డి(గురజాల), అన్నాబత్తుని శివకుమార్(తెనాలి), గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(నరసరావుపేట), షేక్ ముస్తఫా (గుంటూరు ఈస్ట్), బొల్లా బ్రహ్మనాయుడు (వినుకొండ), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేరుగు నాగార్జున (వేమూరు) ఉన్నారు. వీరిలో అంబటితో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా జగన్ గతంలోనే హామీ ఇచ్చారు. ఈ లెక్కన హోం మంత్రి మేకతోటి సుచరితను తప్పించినా.. వీరిద్దరిలో ఇకరికో, లేదంటే ఇద్దరికీ మంత్రి పదవులు ఖాయమనే చెప్పాలి. మరి జిల్లాకు దక్కే ఈ పదవులను వీరిద్దరే ఎగురవేసుకుపోతే ఎలా?.. ఈ దిశగానే సీనియర్ ఎమ్మెల్యేలు పిన్నెల్లి, ముస్తఫాలతో పాటు జూనియర్లు అయినా విడదల రజనీ, కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్ది శ్రీనివాసరెడ్డిలు కూడా తమ వంతు యత్నాలు సాగిస్తున్నారట. ఇక మేరుగు నాగార్జున, శ్రీదేవీలు కూడా తమ వంతు యత్నాలు సాగిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ ను బరి నుంచి తప్పించి ఎమ్మెల్యే టికెట్ ఎగురవేసుకుపోయిన విడదల రజనీ అయితే మంత్రి పదవి కోసం తనదైన శైలిలో యత్నిస్తున్నారట. మరి వీరిలో ఎవరు అంబటిని టార్గెట్ చేశారన్న విషయం ఎప్పుడు తెలుస్తుందో? అసలు వెలుగు చూస్తుందో? లేదో? చూడాలి.
Must Read ;- జగన్ కేసులపై సుప్రీంలో ప్రత్యేక ధర్మాసనం