‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత బన్నీతో ‘ఐకాన్’ అనే మూవీ తీస్తున్నామని దిల్ రాజు బ్యానర్ నుంచి ప్రకటన వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళుతుందని చెప్పారు. అయితే అనూహ్యంగా దాని స్థానంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ‘అల వైకుంఠపురములో’ సినిమా చేశాడు. పోనీ.. దీని తర్వాత అయినా ‘ఐకాన్’ ఉంటుందనుకుంటే.. అప్పుడు కూడా సుకుమార్ తో ‘పుష్ప’ సినిమా మొదలు పెట్టేశాడు బన్నీ. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీ అయిపోయాడు బన్నీ. ఈ సినిమా ఆగస్ట్ 13న విడుదల కానుంది.
బన్నీతో ‘ఐకాన్’ తెరకెక్కించాలనుకున్న వేణు శ్రీరామ్.. పవర్ స్టార్ తో ‘వకీల్ సాబ్’ సినిమా తెరకెక్కించాడు. రేపే విడుదల కాబోతున్న వకీల్ సాబ్ మూవీపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిజల్ట్ తో వేణు శ్రీరామ్ కెరీర్ ముడిపడి ఉందిప్పుడు. ఈ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ పైనే నిర్మాణం జరుపుకుంది. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన దిల్ రాజు కు వేణు శ్రీరామ్ పనితనం పై పూర్తి నమ్మకం వచ్చిందట. పక్కకి వెళ్ళిపోయిందనుకున్న ఐకాన్ సినిమాను తిరిగి పట్టాలెక్కిస్తానంటున్నాడు దిల్ రాజు.
‘ఐకాన్’ సినిమా కనబడుటలేదు అనే ట్యాగ్ లైన్ తో మంచి పోస్టర్ తో ప్రకటన జరిగింది. ఐకాన్ గా బన్నీ ఎలా ఉండబోతున్నాడు అనే ఆసక్తి కనబరిచారు అభిమానులు. అయితే ఇప్పటికీ ఇంకా ఐకాన్ గురించి అప్టేడ్ రాకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారని భావించారు అందరూ. అయితే ఇప్పుడు దిల్ రాజు .. ఐకాన్ సినిమాను త్వరలోనే తీస్తానని ప్రకటించడంతో .. మళ్ళీ టాలీవుడ్ లో ఐకాన్ మీద చర్చలు జరుగుతున్నాయి. నిన్ననే విడుదలైన పుష్ప సినిమా టీజర్ లో బన్నీకి సుకుమార్ ‘ఐకాన్ స్టార్’ బిరుదు ఇవ్వడంతో .. మళ్ళీ ఐకాన్ అనే పదం వార్తల్లో నిలిచింది. దానికి తోడు దిల్ రాజు ఐకాన్ సినిమా నిర్మిస్తానని చెబుతుండడంతో .. ఇటు అభిమానులకు, అటు వేణు శ్రీరామ్ కు ఉత్సాహం వచ్చిందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఐకాన్ సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుందట.
ALSO READ :బన్నీకి విలన్ గా ‘క్రాక్’ జయమ్మ?