కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందులో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్ ఎంతో ప్రత్యేకత కనబరుస్తున్నారు. రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా సత్వరం స్పందిస్తున్నారు. వెంటనే దాన్ని పరిష్కరించే వరకూ విశ్రమించడం లేదు. ఏపీకి చెందిన వ్యక్తి పరాయి దేశంలో కష్టాలు పడుతున్నా కూడా తన పవర్‌తో ఆయన్ను సురక్షితంగా లోకేశ్ కాపాడారు. కొద్ది రోజుల క్రితం దివ్యాంగులు ఐఐటీల్లో చేరడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఒంటి చేత్తో పరిష్కరించారు.
కువైట్‌లో తాను పడరాన్ని పాట్లు పడుతున్నానని శివ అనే నంద్యాలకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాను చాలా కష్టపడి బతుకుదెరువు కోసం కువైట్ వచ్చానని.. అలా ఓ బ్రోకర్ చేతిలో మోసపోయానని బాధితుడు ఓ సెల్ఫీ వీడియోలో రోదిస్తూ చెప్పాడు. తనను తన భార్య కూడా పట్టించుకోవడం మానేసిందని చెప్పాడు. తాను ఒక ఎడారి ప్రాంతంలో చిక్కుకున్నానని.. అక్కడ కుక్కలు, బాతులకు ఆహారం పెట్టడమే తన పని అని చెప్పుకున్నాడు. చుట్టుపక్కల ఎక్కడా ఒక్క చెట్టు కూడా లేదని, కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవని చెప్పారు. తన యజమానులు కూడా తనను బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించాడు.
ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ మూడు రోజుల క్రితం స్పందించారు. బాధితుడిని రక్షిస్తామని భరోసా ఇచ్చారు. విదేశాంగ శాఖ సాయం చేయాలని.. అలాగే బాధితుడిని గుర్తించి సాయం చేయాలని ఎన్నారై టీడీపీ విభాగానికి సూచించారు. అనంతరం రెండు రోజులకే బాధితుడ్ని రక్షించగలిగారు. శివ అనే కువైట్ బాధితుడు ప్రస్తుతం ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీలో సేఫ్ గా ఉన్నాడని తెలిపారు. త్వరలోనే అతణ్ని ఏపీకి రప్పిస్తామని వెల్లడించారు. ఈ మేరకు శివ మాట్లాడిన ఓ వీడియోను కూడా నారా లోకేశ్ పోస్ట్ చేశారు.
అంతకుముందు నారా లోకేశ్ ఓ వాట్సప్ మెసేజ్ కు స్పందించి.. రాష్ట్రంలోని దివ్యాంగులంతా సంబరపడేలా చేశారు. దివ్యాంగులకు ఇంటర్ సర్టిఫికేట్ జారీలో ఇంటర్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు కారణంగా వారు ఐఐటీల్లో ప్రవేశం పొందడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న అలాంటి సమస్యను నారా లోకేశ్ ఒక్క జీవో విడుదల చేసి పరిష్కరించగలిగారు. పైగా మంగళగిరిలో ప్రజా దర్బార్‌ను ప్రతిరోజూ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి నుంచి వినతులను స్వీకరిస్తూ.. వాటి పరిష్కరానికి కృషి చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఇలా యువనేత పాలనలో తనదైన ముద్ర వేస్తూ.. తక్షణం స్పందిస్తూ గంటల వ్యవధిలో సమస్యలను పరిష్కరిస్తున్న తీరును అంతా అభినందిస్తున్నారు.