తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ప్రస్థానం మొదలయ్యేదాకా.. రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న నేతలను వేళ్లపైనే లెక్క పెట్టొచ్చు. అయితే ఎప్పుడైతే టీడీపీ ప్రస్థానం మొదలైందో.. తెలుగు నేల రాజకీయాల్లోకి కొత్త తరం ఎంటరైపోయింది. ఎప్పటికప్పుడు కొత్త తరం రాజకీయాల్లోకి రావడం అప్పటి నుంచే మొదలైందని కూడా చెప్పాలి. ఇలా లెక్కలేనంత మందికి టీడీపీ రాజకీయ ఓనమాలు నేర్పింంది. అలా టీడీపీ వద్ద ఓనమాలు దిద్దకుకుని రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును, హోదాను సంపాదించుకున్న వారిలో ఎందరో రాజకీయ నేతలు.. ఆ హోదాలను కొందరు నిలబెట్టుకుంటే. మరికొందరు టీడీపీకి ద్రోహం చేసి ఆ హోదాలను కాలదన్నుకుంటున్నారు. ఇలాంటి రెండో వరుసలో మరో పేరు చేరిపోయింది. ఆయన మరెవరో కాదు.. మాజీ మంత్రి, తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నేత మోత్కుపల్లి నర్సింహులు.
టీడీపీలోనే అందలానికి..
నల్లగొండ జిల్లాకు చెందిన మోత్కుపల్లి టీడీపీతోనే రాజకీయ అక్షరాభ్యాసం చేశారనే చెప్పాలి. పార్టీ తరఫున ఆయన ఏకంగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఈయన.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక టీడీపీ మాదిరే ఒకింత ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా పార్టీ మాదిరే ఆయన కూడా అలాగే గట్టిగానే నిలబడ్డారు. అయితే ఏమైందో గానీ.. పార్టీ అధికారంలో లేకున్నా.. పదవులు కావాలంటూ తన మనసులోని మాటను బయటపెట్టుకుని బజారుకెక్కారు. తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకున్నా.. ఏపీలో అధికారంలో ఉంది కదా.. అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో దోస్తానా ఉంది కదా.. ఏ గవర్నర్ గిరీనో ఇప్పించొచ్చు కదా ఆయన కొత్త రాగం అందుకున్నారు. ఈ దిశగా పార్టీ అధిష్ఠానం ఏం ఆలోచించిందో తెలియదు గానీ.. మోత్కుపల్లికి గవర్నర్ గిరీ అయితే దక్కలేదు. దీంతో ఒక్కసారిగా తీవ్ర నిర్ణయం తీసుకున్న మోత్కుపల్లి.. టీడీపీకి గుడ్ బై చెప్పేశారు.
బీజేపీ అయిపోయింది.. ఇక టీఆర్ఎస్..
ఆయారాం గయారాం నేతలను ఎంతమందినో చూసిన టీడీపీ ఈ పరిణామంతో కొంత బాధపడి ఉంటుందేమో గానీ.. పార్టీగా పెద్దగా నష్టమేమీ జరగలేదు. అయితే అప్పటిదాకా పార్టీ రెక్కల కింద ఉంటూ వచ్చిన మోత్కుపల్లి.. ఆ రెక్కల నుంచి బయటకు వెళ్లిపోయి.. ఏకంగా బీజేపీలో చేరిపోయారు. సొంత కేడర్ మీదే బీజేపీ ఏ విధమైన ఆసక్తి చూపుతుందో తెలుసు కదా. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన మోత్కుపల్లి లాంటి నేతలు ఆ పార్టీకి ఎందుకు ఆనుతారు. అందుకే.. మోత్కుపల్లిని పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా చూపిన ఆసక్తి.. ఆ తర్వాత చూపలేదు. దీంతో టీడీపీని ఎందుకు వీడానురా అంటూ మదనపడిన మోత్కుపల్లి.. ఆ అవమాన భారాన్ని భరించలేక బీజేపీ నుంచి కూడా ఎగ్జిట్ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ లో అంతా బాగున్నంత వరకే.. లేదంటే సొంత పార్టీ నేతలకు కూడా ఎలాంటి గౌరవం దక్కుతుందో మాజీ మంత్రి ఈటలను చూస్తేనే అర్థమవుతోంది. మరి ఆ పార్టీలో అయినా మోత్కుపల్లి ఇమడతారా? లేదంటే.. అంతిమంగా మళ్లీ సొంత గూటికే చేరక తప్పదా? అన్న వాదనల వినిపిస్తున్నాయి.
Must Read ;- కేసీఆర్ కు ఎంత భయమంటే?.. ఈటల ‘స్టిక్’కు కీలక పోస్ట్!











