Actor Prabhas And Director Nag Ashwin Film Started Shooting :
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్, మరో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే, మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ లతో వైజయంతీ మూవీస్ లాంటి ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ నిర్మించే భారీ చిత్రం పట్టాలెక్కేసింది. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా తెరెకెక్కుతోంది. మహానటి తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును వైజయంతీ సంస్థ చేపట్టింది. ఈరోజు జరిగిన ప్రారంభోత్సవం కార్యక్రమంలో బిగ్ బీ అమితాబ్, దీపికా పదుకొనే కూడా పాల్గొన్నట్టు సమాచారం. దాదాపు రూ. 500 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమా రూపొందుతోంది.
సైంటిఫిక్ ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇంతకుముందు ఈ సంస్థ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. మొదట్లో దీనికి సీక్వెల్ రూపొందబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ సినిమా కథ విషయంలో భారీగానే కసరత్తులు జరిగినట్టు సమాచారం. ఈ కథ మీద కె. రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు లాంటి దిగ్గజ దర్శకుల అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు వార్తలొచ్చాయి.
తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయికి పెంచాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ సినిమా ప్రారంభోత్సవం కోసం అమితాబ్ ముంబై నుంచి వచ్చారు. జులై 24న దీనికి ముహూర్తం అని, కొత్త సినిమా ప్రారంభం, కొత్త వాతావరణం అని అమితాబ్ నిన్ననే ట్వీట్ చేశారు. ఓ వారం పాటు ఈ సినిమా షూటింగులో పాల్గొని అమితాబ్ ముంబై వెళ్లిపోతారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రాలేదు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో భారీ తారాగణం ఉంటుంది. ఆ వివరాలను నిర్మాతలు గోప్యంగా ఉంచుతున్నారు.
Must Read ;- ప్రభాస్ సలార్ లో బాలీవుడ్ బ్యూటీ. ఇంతకీ ఎవరా బ్యూటీ..?











