TRS Activists Number Touches 61 Lakhs :
రాజకీయ పార్టీ అంటే తెర ముందు నేతలు కనిపిస్తుంటారు గానీ.. తెర వెనుక ఉండే కార్యకర్తల బలమే ఆ పార్టీని నిలబెడుతుంది. ఈ లెక్కన నేతల కంటే పార్టీ కార్యకర్తలే రాజకీయ పార్టీలకు ముఖ్యమని చెప్పాలి. అందుకే కాబోలు.. ప్రాంతీయాభిమానంతో ప్రస్థానం మొదలెట్టిన తెలుగు దేశం పార్టీ భారీ సంఖ్యలో కార్యకర్తలను కలిగిన పార్టీగా గుర్తింపు పొందింది. టీడీపీ మాదిరే.. టీడీపీలోనే రాజకీయ వ్యూహాలు నేర్చుకునక్న నేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఇప్పుడు ఇదే రీతిలతో రికార్డు నమోదు చేసింది. దేశంలో అత్యధిక మంది సభ్యులతో కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ కు గుర్తింపు దక్కిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి బుధవారం సంచలన ప్రకటన చేశారు.
61 లక్షల సభ్యత్వమట
పల్లా రాజేశ్వరరెడ్డి వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం టీఆర్ఎస్ లో 61 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 61 లక్షల మందిలో 48 లక్షల మంది కార్యకర్తలకు సంబంధించిన డిజిటలైజేషన్ పూర్తి అయ్యింది. ఇంకో 13 లక్షల మంది సభ్యుల డిజిటలైజేషన్ జరగాల్సి ఉంది. ఈ లెక్కన దేశంలో అత్యధిక సంఖ్యలో కార్యకర్తలను కలిగిన ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ అవతరించిందని పల్లా చెప్పుకొచ్చారు. గడచిన ఏడేళ్లలో తెలంగాణలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యం.. రాష్ట్రంలోని ఇతర పార్టీలకు చెందిన నేతలను భారీ ఎత్తున టీఆర్ఎస్ లోకి చేర్చుకోవడం.. తదితర కారణాల వల్ల టీఆర్ఎస్ సభ్యత్వం పెరిగి ఉంటుందని అంతా అనుకుంటున్నా.. మరీ 61 లక్షలకు పెరిగిందని పల్లా చెప్పడం గమనార్హం.
టీడీపీని చూసి బీజేపీ…
ఇదిలా ఉంటే.. తొలుత ఈ రికార్డును తెలుగు దేశం పార్టీ కైవసం చేసుకుందని చెప్పాలి. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. నారా లోకేశ్ అప్పుడప్పుడే పార్టీ కార్యక్రమాలకు అంకితమైన వేళ.. 2015లో టీడీపీ సభ్యత్వం 54 లక్షలకు చేరుకుంది. నాడు టీడీపీకి ఉన్న యాక్టివ్ సభ్యుల సంఖ్యకు సరిసమానంగా ప్రాంతీయ పార్టీ కాదు కదా.. జాతీయ స్థాయిలోనూ ఏ పార్టీ లేదన్న వాదనలు వినిపించాయి. టీడీపీ ఘనతను చూశాకే… 2015 తర్వాత బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన మాస్ క్యాంపెయిన్ ద్వారా కోటి సభ్యత్వాన్ని టచ్ చేసింది. తాజాగా ప్రాంతీయ పార్టీల విషయంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించడం గమనార్హం.
Must Read ;- బాబు అంటే.. టీఆర్ఎస్‌కు ఇంకా భయమే