జగన్ వద్దబ్బా, చంద్రబాబే రావాలి అనేదే జనం పల్స్ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఏపీలో ఇప్పుడు పురపాలికల ఎన్నికల కోలాహలం నెలకొంది. మొన్నటిదాకా పంచాయతీ పోరు సాగగా… ఇప్పుడు పుర పోరు ఊపందుకుంది. పంచాయతీ ఎన్నికల్లో జిమ్మిక్కులు, దౌర్జన్యాలతో దూకుడు సాగించిన వైసీపీకి పుర పోరులో మాత్రం గట్టి ఎదురు దెబ్బ తగిలేలానే కనిపిస్తోంది. ఈ మేరకు పుర ప్రజల పల్స్ ఏమిటో? వారిలో జగన్ సర్కారుపై ఎలాంటి భావన గూడుకట్టుకుందో?, వారు ఇప్పుడు ఏమి కోరుకుంటున్నారన్న విషయాలను విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) వెల్లడయ్యేలా చేశారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ నగరంలో సుడిగాలి పర్యటన సాగిస్తున్న నాని.. జనంతో మమేకమై ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా నగరంలోని ఓ డివిజన్‌లో ఇద్దరు మహిళలతో మాట్లాడిన నాని… వారి సిసలైన అభిప్రాయాలను వెలికి తీశారు. ఈ సందర్భంగా నాని పెద్దగా ఏమీ మాట్లాడకున్నా…. నానిని చూసినంతనే సదరు మహిళలు జగన్ సర్కారుపై విరుచుకుపడిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాకుండా మళ్లీ చంద్రబాబే రావాలని ఆ మహిళలు ముక్తకంఠంతో చెప్పిన విషయం కూడా ఆసక్తి రేకెత్తించేదే.
ఓ చేత ఇస్తూ మరో చేతితో లాగేసుకుంటున్నారు
అన్ని వర్గాలకూ అన్నీ చేశానని చెప్పుకుంటున్న జగన్ నిజంగానే ఏమి చేశారన్న విషయాన్ని ఆ మహిళలు… వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ముందు పెట్టి మరీ జగన్ అండ్ కోను చెడుగుడు ఆడేసుకున్నారనే చెప్పాలి. సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న జగన్… ఓ చేత ఇస్తూ మరో చేతితో లాగేసుకుంటున్న వైనాన్ని కూడా ఆ మహిళలు కళ్లకు కట్టేలా బయటపెట్టేశారు. ఇక మాకు జగన్ పాలన చాలు.. మళ్లీ చంద్రబాబే రావాలి. ఎన్ని జరిగినా… జనంపై భారం పడకుండా చూడటంలో చంద్రబాబును మించిన వారు లేరని కూడా వారు చెప్పేశారు. మొత్తంగా పుర పోరులో జగన్ పార్టీకి ఘోర పరాభవం తప్పదన్న సంకేతాలను వారు చాలా విస్పష్టంగానే వెల్లడి చేశారు. ఇలా పురపాలికల్లో జనం పల్స్ ఎలా ఉందన్న విషయాన్ని కేశినేని నాని చాలా చాకచక్యంగా బయటపెట్టారు. జగన్ సర్కారు గురించి, వైసీపీ పాలన గురించిన జనం మాటను వెల్లడి చేసిన నాని… ఇది నా మాట కాదు… చంద్రబాబునాయుడి గారి మాట కాదు…. తెలుగు దేశం పార్టీ మాట కాదు… జనం మాట అంటూ నాని తన ఫేస్ బుక్ పేజీ వేదికగా జనం పల్స్‌ను సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్ వచ్చాక ఆకాశాన్నంటిన ధరలు
ఈ సందర్భంగా కేశినేని నానితో విజయవాడ మహిళలు ఏమన్నారన్న విషయానికి వస్తే…. అసలు జగన్ వచ్చాక ధరలు ఆకాశాన్నంటాయి. గతంలో రూ.100లతో కూరగాయలు దొరుకుతుంటే… ఇప్పుడేమో రూ.300 నుంచి రూ.400 పెట్టాల్సి వస్తోంది. సంక్షేమం అంటే… ధరలు పెంచడమేనా? అసలు జగన్ వచ్చాక పేదలకు ఎంతో న్యాయం జరిగిందని చెబుతున్న దాంట్లో నిజం లేనే లేదు. ఓ చేతితో ఇచ్చి రెండో చేతితో లాగేసుకుంటున్నారు. గతంలో రూ.150 మేర వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడేమో ఏకంగా రూ.750 దాకా వస్తోంది. సంక్షేమం అంటే ఇదేనా? రూ.500 పెన్షన్ వచ్చేటప్పుడు చాలా సుఖంగానే ఉన్నాం. ఇప్పుడు రూ.2 వేలకు పైగా పెన్షన్ వస్తున్నా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు. కరెంటు చార్జీలు, నిత్యావసరాల ధరలు అన్నింటినీ పెంచేసుకుంటూ పోతూ.. పెన్షన్‌ను రూ.2 వేలకు పైగా ఇస్తే ఏం లాభం. రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలు అందరికీ ఇళ్లు ఇచ్చామని జగన్ చెబుతున్నారు. ఎక్కడ ఇచ్చారో చూపించాలి. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం. మరి మాకు ఎక్కడ ఇళ్లు ఇచ్చారు అని ఆ మహిళలు చేతిలో వైసీపీ మేనిఫెస్టోను పట్టుకుని మరీ, దానిని తెరిచి పక్కా ఇళ్ల గురించి వైసీపీ చెప్పిన మాటను చూపించి మరీ నిలదీశారు.
‘జగన్ అన్నీ అనర్థాలే తీసుకువచ్చాడు’
అంతటితో ఆగని సదరు మహిళలు… జగన్ వచ్చాడు కరోనాను తీసుకువచ్చాడు. విశాఖలో కాలు పెట్టాడు… స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేసేలా చేశాడు. జగన్ వచ్చి అన్నీ అనర్థాలే తీసుకువచ్చాడు. ఇలాంటి జగన్ ఇక మాకు వద్దు. ఏం చేసినా… ఎన్ని తిప్పలు పడ్డా… జనం మీద భారం పడకుండా చూసుకున్న చంద్రబాబే మళ్లీ కావాలి. రావాలి. ఇక మాకు వైసీపీ వద్దు. జగనూ వద్దు. మేం ఓట్లేయకుండానే జగన్ గెలిచారా? మేం ఓట్లేస్తేనే జగన్ గెలిచారు. ఇప్పుడు జగన్‌కు గుణపాఠం చెప్పి తీరతాం అంటూ ఆ మహిళలు తమదైన శైలిలో ఓ రేంజిలో జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. మొత్తంగా పురపోరులో జగన్ అండ్ కోకు గట్టి ఎదురు దెబ్బ తప్పదన్న విశ్లేషణలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.