కుప్పంలో చంద్రబాబు పర్యటించనుండటంతో జగన్ శిబిరంలో టెన్షన్ మొదలైంది. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అదిరింపులు, దాడులు… వగైరాలతో ఎలాగోలా మెజారిటీ పంచాయతీలను గెలుచుకున్నామని చెప్పుకుంటున్న అధికార వైసీపీకి ఇప్పుడు అసలు సిసలు పరీక్ష మొదలు కానుందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఏపీలో పుర పోరుకు తెర లేసిన సంగతి తెలిసిందే. విపక్ష టీడీపీని మరింత బలహీనపరుస్తున్నామన్న సంకేతాలను ఇచ్చేందుకు వైసీపీ ఇప్పటికే నానా తంటాలు పడుతోంది. అయితే వైసీపీ పన్నుతున్న వ్యూహాలన్నీ ఇప్పుడు పటాపంచలు కానున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు బయలు దేరుతున్నారు. ఫలితంగా కుప్పం కోటలు బద్దలు కొట్టామని బీరాలు పలుకుతున్న వైసీపీకి ఇప్పుడు అసలు సిసలు పరీక్ష మొదలు కానుందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అంతే కాకుండా పంచాయతీ ఎన్నికల్లో కుప్పం కోటలో జెండా ఎగురవేశామని చెప్పుకుంటున్న వైసీపీ… ఇప్పుడు చంద్రబాబు ప్రత్యక్షంగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో తమ మాటను నిలబెట్టుకునే క్రమంలో వైసీపీ శిబిరంలో టెన్షన్ అమాంతం పెరిగిపోయిందని కూడా చెప్పక తప్పదు.
Must Read ;- పంచాయతీల్లో సిసలు గెలుపు టీడీపీదే.. 4,230 గ్రామాల్లో విజయకేతనం
చంద్రబాబు కోటను బద్దలు కొట్టామని బీరాలు..
మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలో 89 పంచాయతీలు ఉండగా… 75 పంచాయతీలను గెలుచుకున్నామని చెప్పుకున్న వైసీపీ… చంద్రబాబు కోటను బద్దలు కొట్టామని బీరాలు పలికింది. చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఇక చంద్రబాబు పని అయిపోయినట్టేనన్నట్లుగా తనదైన శైలి కలరింగ్ కూడా ఇచ్చారు. మొత్తంగా పంచాయతీ ఎన్నికల్లో జబ్బలు చరుచుకున్న వైసీపీకి ఇప్పుడు అసలు సిసలు పరీక్ష ఎదురు కానుంది.
చంద్రబాబు సొంత నియోజకవర్గ కేంద్రం కుప్పం మున్సిపాలిటీ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నందున కుప్పం మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో కుప్పం తమదేనని నిరూపించుకున్నామని చెప్పిన వైసీపీ… తన మాట నిజమేనని నిరూపించుకోవాలంటే… కుప్పం మున్సిపాలిటీని కూడా గెలుచుకుని తీరాల్సిందే. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగేవి కాబట్టి.. చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీలతో ముడిబడిన ఎన్నికలు కావడంతో చంద్రబాబు నేరుగానే రంగంలోకి దిగేస్తున్నారు.
కుప్పంలో అడుగుపెట్టనున్న చంద్రబాబు
ఇందులో భాగంగా తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు. గురువారం చంద్రబాబు కుప్పంలో అడుగుపెట్టనున్నారు. పట్టణంలో పర్యటనతో పాటుగా స్థానిక పార్టీ శ్రేణులతోనూ చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మున్సిపోల్స్‌లో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా చంద్రబాబు నిర్దేశించనున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయడం, అక్రమాలకు పాల్పడటం ద్వారానే కుప్పం పరిధిలోని మెజారిటీ పంచాయతీలను వైసీపీ గెలుచుకున్నదన్న వాస్తవాన్ని కూడా చంద్రబాబు పార్టీ శ్రేణులకు తేటతెల్లం చేయనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు అనుసరించిన దుర్మార్గాలను కూడా చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించనున్నట్లుగా సమాచారం.
అదే సమయంలో మున్సిపోల్స్‌లో పార్టీని విజయ తీరాలకు చేర్చాల్సిన బాధ్యత, అందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్లుగా సమాచారం. ఎన్నికల ఎత్తుల్లో తలపండిన చంద్రబాబు కుప్పంలో అడుగుపెడుతున్నారన్న విషయం తెలిసిన మరుక్షణమే వైసీపీ శిబిరంలో ప్రత్యేకించి పెద్దిరెడ్డి వర్గంలో పెను కలవరమే మొదలైనట్లుగా సమాచారం.
Also Read ;- నారావారిపల్లెలో వైసీపీ ఆగడాలు!