తమకు పట్టు లేదనే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఇప్పుడంతా ఎన్నికల కోలాహలమే. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీల పోరు ముగియగా… తాజాగా పుర పోరుకు తెర లేసింది. మున్సిపల్ ఎన్నికలకు ఓ వైపు కసరత్తు జరుగుతుండగానే.. మరోవైపు శాసన మండలిలో ఇటీవల ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఉపాధ్యాయ కోటా కింద ఖాళీ అయిన ఈ రెండు ఎమ్మెల్సీ సీట్ల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా… నామినేషన్ల దాఖలుకు మంగళవారంతో గడువు ముగిసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని ఓ స్థానం, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని మరో స్థానానికి ఈ ఎన్నికలు జరగనున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల స్థానానికి ఏకంగా 20 నామినేషన్లు రాగా… ఉభయ గోదావరి జిల్లాల స్థానానికి 12 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత గానీ… ఈ ఎన్నికల బరిలో ఎంతమంది అభ్యర్థులు ఉంటారన్న విషయం వెల్లడి కాదు.
వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ సంఘం ఉన్నా..
ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటామని జబ్బలు చరుచుకుంటున్న అధికార వైసీపీ… మున్సిపోల్స్‌లోనూ తమ పార్టీనే మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని చెబుతోంది. అంతేకాకుండా ఆ తర్వాత జరిగే ఎంపీటీసీ, జడ్సీటీసీ ఎన్నికల్లోనూ తమదే హవా అంటూ బాకాలు ఊదుతోంది. సరే… ఎన్నికలన్నాక, ఏ రాజకీయ పార్టీ అయినా ఇదే తరహా ప్రకటనలు గుప్పిస్తుంది. మరి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైసీపీ ఎందుకు నిర్ణయించిందన్నది ఇప్పుడు అంతుబట్టడం లేదన్న వాదన వినిపిస్తోంది. సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలకు యువజన విభాగం, మహిళా విభాగం తరహాలో ఉపాధ్యాయ విభాగాలు కూడా పని చేస్తున్న వైనం తెలిసిందే. ఇదే కోవలో వైసీపీ కూడా వైఎస్సార్‌టీఎఫ్ (వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్) పేరిట ఓ ఉపాధ్యాయ సంఘాన్ని కూడా పెంచి పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారం కోసం జరిగే ఉద్యమాల్లో ఈ యూనియన్ ఒకింత దూకుడుగానే పని చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. మొత్తంగా వైఎస్సార్ టీఎఫ్ పేరిట ఉపాధ్యాయ సంఘం ఉన్నప్పటికీ… టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైసీపీ ఎందుకు నిర్ణయం తీసుకుందన్న విషయంపై పలు విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!
రెండు జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు..
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి పెద్దగా బలం లేదనే చెప్పాలి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఏదో జగన్ ఒక్క ఛాన్స్ అంటూ ఇచ్చిన పిలుపునకు ప్రజలు భారీగా స్పందించిన నేపథ్యంలో… వైసీపీ వైపు గాలి వీయగా… ఈ రెండు జిల్లాల్లోనూ వైసీపీకే మెజారిటీ స్థానాలు దక్కాయి. ఇక అమరావతి రాజధానిని కూకటివేళ్లతో పెకిలించే దిశగా జగన్ వేస్తున్న అడుగులపై ఈ రెంఅమరావతి డు జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పాలనపై నానాటికీ వ్యతిరేకత పెరుగుతుండగా… ఈ రెండు జిల్లాల్లో సదరు వ్యతిరేకత ఓ రేంజిలో ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లోనూ సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌కు మెజారిటీ దక్కినా…కాపుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఆ రెండు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో వైసీపీకి పెద్దగా బలం లేదనే చెప్పాలి. కాపుల రిజర్వేషన్లపై ఓ స్పష్టమైన వైఖరితో లేని వైసీపీకి ఈ రెండు జిల్లాల్లో అంతకంతకూ వ్యతిరేకత పెరుగుతోందన్న సూచనలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. వెరసి ప్రస్తుతం జరుగుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నాలుగు జిల్లాల్లో కూడా వ్యతిరేక పవనాలే వీస్తాయన్న స్పష్టమైన సంకేతాలు అందిన కారణంగానే వైసీపీ బరి నుంచి తప్పుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఓటమి ఛాయలు..
అంటే… ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపించిన నేపథ్యంలోనే వైసీపీ బరిలోకి దిగేందుకు వెనుకాడిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అదే తమకు అంతో ఇంతో బలముందని భావిస్తున్న రాయలసీమ పరిధిలో అయితే టీచర్స్ ఎన్నికలను వైసీపీ వదిలేయడం జరుగుతుందా? అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంటే… కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో తనకు పట్టు లేదని తనకు తానే నిర్ధారించేసుకున్న వైసీపీ… టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్దేశించుకుందన్న మాట. అయినా అధికార పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటమేంటని ఎవరైనా అడిగితే… టీచర్స్ కోటా ఎమ్మెల్సీలు కదా… అందులో టీచర్స్ కమ్యూనిటీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తాము రాజకీయం చేయదలచుకోలేదని వైసీపీ చెబుతోందట. మరి మీకు కూడా వైఎస్సార్ టీఎఫ్ పేరిట ఓ టీచర్స్ యూనియన్ ఉంది కదా అంటే… దాని సూచన మేరకే తాము మిన్నకున్నామని చెబుతోందట. అంతే తప్పించి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తనకు ముందే కనిపించిందన్న మాటను మాత్రం ఒప్పుకునేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా లేరని చెప్పక తప్పదు.
Also Read ;- నారావారిపల్లెలో వైసీపీ ఆగడాలు!











