కృష్ణా జిల్లా కొండపల్లి రిజర్వు ఫారెస్టులో మట్టి అక్రమ తవ్వకాల్లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆయన బావమరిది వంద కోట్ల విలువైన మట్టిని తరలించారని టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్ర ఆరోపణలు చేశారు. మైలవరం వీరప్పన్ అంటూ దేవినేని చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అక్రమ మైనింగ్ వ్యవహారంలో అటవీశాఖ సిబ్బంది సీజ్ చేసిన రూ. 3 కోట్ల విలువైన వాహనాలను వదిలేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారని దేవినేని ఆరోపించారు.
గట్టిగానే తవ్వారుగా…
కొండపల్లి రిజర్వు ఫారెస్టులో వంద కోట్ల విలువైన గ్రావెల్‌ను అక్రమంగా తరలించిన వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గానే తీసుకుంది. అయితే అప్పటికే వందకోట్ల అక్రమాలు జరిగిపోయాయి. అక్రమాలను అడ్డుకోవడంలో విఫలం అయ్యారంటూ కృష్ణా జిల్లా డీఎఫ్ వో మంగమ్మను బదిలీ చేశారు. మరో ఆరుగురు కింది స్థాయి సిబ్బందిపై వేటు వేశారు. తాజాగా సీజ్ చేసిన వాహనాలు విడుదల చేయకుంటే మారుమూల అటవీ ప్రాంతాలకు బదిలీలు తప్పవని ఎమ్మెల్యే బావమరిది అటవీ సిబ్బందిపై బెదిరింపులకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
AlsoRead;-పోలవరంపై పాత, కొత్త నీటి పారుదల మంత్రులు ఏమంటున్నారంటే…
అధికారుల తప్పే కారణమా?
కొండపల్లి రిజర్వు ఫారెస్టులో భారీగా అక్రమ మట్టి తవ్వకాలు జరిగాయని నిర్ధరించిన అధికారులు రూ.3 కోట్ల విలువైన వాహనాలు సీజ్ చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన అధికారులు, రాజకీయ ఒత్తిళ్లతో కోర్టుకు సమర్పించకుండా మిన్నకుండిపోయారు. దీంతో ఆ వాహనాలను రూ.10 వేల పూచీకత్తుపై విడుదల చేయాలని అప్పటి డీఎఫ్ వో మంగమ్మ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వుల కాపీ చూపించి ఎమ్మెల్యే బావమరిది వాహనాలను విడుదల చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నాడని తెలుస్తోంది. అయితే భారీగా అక్రమాలు చోటుకున్న ఈ కేసులో పది వేల పూచీకత్తుతో వాహనాలు విడుదల చేస్తే, భవిష్యత్తులో సమస్యలు తప్పవని కొండపల్లి అటవీ అధికారులు వాహనాలను వదలడం లేదు. దీంతో కొండపల్లి అటవీ దొంగల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
మైలవరం వీరప్పన్ ఎవరు?
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరో వీరప్పన్ లా తయారయ్యాడని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే, ఆయన బావమరిది కలసి కొండపల్లి రిజర్వు ఫారెస్టులో వందకోట్ల విలువైన మట్టిని తరలించి కొండపల్లి అటవీ దొంగలుగా మారారని దేవినేని విరుచుకుపడ్డారు. వీరిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోగా అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసిన అటవీ అధికారులను వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. దేవినేని ఆరోపణలు, మైలవరం ఎమ్మెల్యే, ఆయన బావమరిది బెదిరింపులతో కొండపల్లి రిజర్వు ఫారెస్టులో మట్టి అక్రమాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
AlsoRead;-ఎవరు చస్తున్నారు? ఎవరు దొరుకుతున్నారు? ఎవరు స్మగ్లరు?











