Former Ministers Ramasubbareddy And Adinarayana Reddy’s Political Future In Dilemma :
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన సీనియర్ రాజకీయవేత్తలు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిల రాజకీయ భవిష్యత్తు పెను ప్రమాదంలో పడిపోయిందనే చెప్పాలి. తెలుగు దేశం పార్టీలో ఉండగానే.. ఇద్దరూ మంత్రులయ్యారు. జిల్లాలోని కీలక నియోజకవర్గం జమ్మలమడుగుకు చెందిన వీరిద్దరూ టీడీపీలో ఉండగా.. నిశ్చింతగానే కొనసాగారు. రాజకీయ పరంగానే కాక ఫ్యాక్షన్ పరంగానూ బద్ధ విరుధోలుగా మెలగిన వీరు.. టీడీపీలో ఉండగా చేయి చేయి కలిపి ముందుకు సాగారు. అయితే ఇప్పుడు ఇద్దరూ టీడీపీని వీడి ఎందుకూ కొరగాకుండా పోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రామసుబ్బారెడ్డి టీడీపీని వైసీపీలో చేరిపోగా.. ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరికీ ఆయా పార్టీల్లో ఏమాత్రం ప్రాధాన్యం దక్కడం లేదు కదా.. అసలు వారు తమ పార్టీల్లో ఉన్నారన్న విషయమె తెలియనట్టుగా ఆయా పార్టీల అధిష్ఠానాలు వ్యవహరిస్తున్నాయట. వెరసి ఆయా పార్టీల్లో తీవ్ర నిరాదరణకు గురి అవుతున్నామన్న భావనతో వీరిద్దరూ ఎటూ పాలుపోని స్థితిలో పడిపోయారట. మొత్తంగా వీరిద్దరికీ ఆ పార్టీల్లో ఇప్పుడు ఊపిరాడటం లేదనే చెప్పాలి.
ఎటూ వెళ్లలేని స్థితిలో రెడ్డిగారు
టీడీపీలో ఉండగా.. ఓ వెలుగు వెలిగిన రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగుపై మంచి పట్టుంది. షాద్ నగర్ జంట హత్యల కేసులో దోషిగా తేలేవరకు ఆయనకు జమ్మలమడుగులో తిరుగే లేదు. ఈ కేసులో శిక్ష పడిన సమయంలోనూ రామసుబ్బారెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే కేసు నేపథ్యంలో మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయక తప్పలేదు. అయినా కూడా టీడీపీ ఆయనను దూరం పెట్టలేదు. శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదయ్యాక కూడా రామసుబ్బారెడ్డికి టీడీపీ మంచి గుర్తింపే ఇచ్చింది. జమ్మలమడుగు టికెట్ ఆయనకే ఇచ్చింది. అయితే సుదీర్ఘంగా జైల్లో ఉన్న కారణంగా నియోజకవర్గంపై పట్టు సాధించిన ఆదినారాయణ రెడ్డి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. అయినా కూడా పార్టీలో ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం తగ్గలేదు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అయితే మొన్నటి ఎన్నికల తర్వాత సడెన్ గా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అక్కడ ఆయనపై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆయనను ఏమాత్రం పట్టించుకోవడం లేదు కదా.. ఏకంగా అవమానాల పాలు చేస్తున్నారట. దీంతో వైసీపీ నుంచి బయటకు రాలేక.. పార్టీలో ప్రాధాన్యం దక్కించుకోలేక రామసుబ్బారెడ్డి తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారట.
ఆదినారాయణకు చిక్కులు
ఇక జమ్మలమడుగులోనే కీలక నేతగా ఎదిగిన ఆదినారాయణ రెడ్డి.. ముందు కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత వైసీపీలో కొనసాగారు. కాంగ్రెస్ తో పాటు వైసీపీలోనే ఆయన ఎమ్మెల్యేగానే నెగ్గారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు సీఎంగా ఉండగా.. వైసీపీని వీడిన ఆయన టీడీపీలో చేరారు. ఇచ్చిన హామీ మేరకు ఆదికి చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అంతా బాగుందనుకున్న సమయంలో 2019 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు అసెంబ్లీ ఇచ్చిన చంద్రబాబు.. ఆదికి కడప పార్లమెంటు సీటిచ్చారు. వైసీపీ దిశగా వీచిన గాలిలో వీరిద్దరూ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత వైసీపీ వేధింపుల భయంతో ఆది టీడీపీని వీడి బీజేపీలో చేరారు. ఎప్పుడైతే టీడీపీని వీడి బీజేపీలో చేరారో.. అప్పుడే ఆది రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయిందన్న వాదనలు వినిపించాయి. అనుకున్నట్లుగానే.. ఆదికి ఇప్పుడు బీజేపీలో ఏమాత్రం ప్రాధాన్యం దక్కడం లేదట. తన సొంత జిల్లా కడపలో జరుగుతున్న నిరసనలకు కూడా బీజేపీ ఆయనను పిలవడం లేదట. మరోవైపు ఆదిని వదిలేసిన ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు ఇప్పుడు టీడీపీలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. వెరసి ఎటు వెళ్లాలో తెలియక ఆది దిక్కులు చూస్తున్నారట.
Must Read ;- టీడీపీకి దమ్ముంది.. మరి వైసీపీ మాటేంటో?