గుంటూరులో పట్టపగలు నడిరోడ్డుపై బీటెక్ విద్యార్థిని రమ్యను ఉన్మాది హత్య చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వేగంగా స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో వైసీపీ సర్కారు ఏ మేర రచ్చరచ్చ చేసిందో తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై విచారణ చేసేందుకు జాతీయ మహిళా కమిషన్ గుంటూరు వచ్చిన సందర్భంగానూ అదే తరహా రచ్చ చోటుచేసుకుంది. మహిళా కమిషన్ సభ్యులకు సరైన భద్రత కల్పించని జగన్ సర్కారు.. మహిళా కమిషన్ సభ్యులకు తమ వాదనలు వినిపించేందుకు వచ్చిన టీడీపీ నేతలు, ప్రజా సంఘాల నేతలను అడ్డుకునేందుకు మాత్రం భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ఎక్కడిక్కడ విచారణకు అడ్డంకులు సృష్టించింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
సింగిల్ కానిస్టేబుల్ తో భద్రతా?
మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న జగన్ సర్కారు.. అందులో భాగంగా దిశ చట్టాన్ని ప్రతిపాదించామని, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, దిశ యాప్ ను ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకుంటోంది. అదేంటో గానీ.. జగన్ సర్కారు ఇన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలు, లైంగిక వేధింపులు, ఏకంగా హత్యలు జరుగుతున్నా జగన్ సర్కారు మాత్రం అడ్డుకోలేకపోతోంది. అంతేకాకుండా ఈ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశామని చెబుతున్న సర్కారు.. వారికి ఎలాంటి శిక్ష పడేలా చేయలేకపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రమ్య ఘటనపై విచారణ చేపట్టేందుకు వచ్చిన జాతీయ మహిళా కమిషన్ బృందానికి జగన్ సర్కారు నామమాత్రపు భద్రతను కేటాయించి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంది. మహిళా కమిషన్ బృందానికి కేవలం సింగిల్ లేడీ కానిస్టేబుల్ ను భద్రతగా కేటాయించింది. దీనిపై మహిళా కమిషన్ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది.
జనం మాట వినిపించకుడా..
మహిళా కమిషన్ తన విచారణలో భాగంగా బాధిత కుటుంబ సభ్యులతో పాటుగా తమను కలిసేందుకు వచ్చిన మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధుల వాదనలను సేకరించాల్సి ఉంది. అయితే మహిళా కమిషన్ సభ్యులను కలవకుండా ఆయా సంఘాలతో పాటుగా రాజకీయ పార్టీలైన టీడీపీ, బీజేపీ ప్రతినిధులను కూడా అడ్డుకుంది. మహిళా కమిషన్ సభ్యులకు సింగిల్ కానిస్టేబుల్ తో భద్రతను కల్పించిన జగన్ సర్కారు.. ఆయా వర్గాల వారు కమిషన్ సభ్యులను కలవనీయకుండా భారీ ఎత్తున పోలీసు వలయాన్నే రంగంలోకి దించింది. మొత్తంగా మహిళా కమిషన్ విచారణపై జగన్ సర్కారు వ్యవహరించిన ద్వంద్వ వైఖరిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Must Read ;- ఏపీ హోం మంత్రి సుచరిత కాదు.. మరెవరు?