గుంటూరు వైసీపీలో మరో రచ్చ మొదలైంది. జిల్లాలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య టోల్ వార్ రాజుకుంది. నార్కట్ పల్లి అద్దంకి నాలుగు వరుసల రహదారిని రాంకీ, క్యూబ్ లిమిటెడ్ సంస్థలు బీవోటీ పద్దతిలో నిర్మించాయి. ఇందులో భాగంగా పిడుగురాళ్ల సమీపంలో టోల్ గేట్ ను ఆ సంస్థలు ఏర్పాటు చేశాయి. నార్కట్ పల్లి అద్దంకి రాష్ట్ర రహదారిని రూ.1200 కోట్లతో నాలుగేళ్ల కిందటే అభివృద్ది పరిచారు. బీవోటీ పద్దతిలో రోడ్డు నిర్మించిన సంస్థలే 20 సంవత్సరాల పాటు టోల్ వసూలు చేసుకుంటూ, రోడ్డు నిర్వహణ కూడా చూడాల్సి ఉంటుంది.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ రెండు సంస్థలు రోడ్డు నిర్వహణను గాలికొదిలేశాయి. టోల్ వసూళ్లలో మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఈ వ్యవహారం గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆయన ప్రతి రోజూ నరసరావుపేట నుంచి గురజాలకు వెళుతూ ఈ రోడ్డు మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు నాలుగు వరుసల రాష్ట్ర రహదారి గుంతల మయంగా మారింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన వైసీపీ ఎమ్మెల్యే క్యూబ్, రాంకీ సంస్థలకు హుకుం జారీ చేశారు. రెండు వారాల్లో రోడ్లపై గుంతలు పూడ్చకుంటే పిడుగురాళ్ల సమీపంలోని టోల్ ప్లాజాను ముట్టడిస్తానని హెచ్చరించారు.
Must Read ;- వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య టోల్ వార్
రాంకీ ఎవరిదంటే?
రాంకీ సంస్థ అధినేత ఇప్పుడు వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. వైసీపీ ఎంపీ అయోథ్య రామిరెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు కావడంతో వారి నిర్వహణలో ఉన్న రోడ్లు ఎంత అధ్వాన్నంగా తయారైనా వైసీపీ నేతలు నోరు మెదపడం లేదు. కానీ గురజాల యువ వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాత్రం రాంకీ, క్యూబ్ సంస్థలకు డెడ్ లైన్ పెట్టారు. రెండు వారాల డెడ్ లైన్ ముగియడంతో ఈ నెల 29న పిడుగురాళ్ల సమీపంలోని టోల్ ఫ్లాజా ముట్టడికి సిద్దం అవుతున్నారు.
పిండుకోవడమేనా, బాగుచేసిది ఏమైనా ఉందా?
ప్రతి నెలా పిడుగురాళ్ల టోల్ ఫ్లాజా ద్వారా రూ.6 కోట్లు వసూలు చేస్తున్న రాంకీ, క్యూబ్ సంస్థలు అసలు రోడ్డు నిర్వహణ మాది కాదన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఇక ఏపీలో వైసీపీ పాలన వచ్చాక నార్కట్ పల్లి అద్దంకి రహదారి నిర్వహణకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. దీంతో రోడ్డు గుంతల మయంగా మారింది. కోట్లాది రూపాయల టోల్ వసూలు చేస్తూ ప్రయాణీకులను ఇబ్బందులకు గురిచేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read ;- రాసిపెట్టుకోండి : మూడేళ్ల తరవాత వైసీపీ ఉండదు











