భర్త కటకటాలు లెక్కిస్తుంటే భార్య మాత్రం అందాలు ఒలకబోస్తూ ‘హంగామా’ చేస్తోంది. ఇంకెవరి గురించి.. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించే. రాజ్ కుంద్రా మాత్రం బూతు సినిమాల భాగోతంతో వార్తల్లో నలుగుతుంటే శిల్ప మాత్రం ఈ రోజు ‘హంగామా 2’తో డిస్నీప్లస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
14 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ భామ మొహానికి మేకప్ వేసి కెమెరా ముందుకు వచ్చింది. శిల్ప శెట్టిది మూడు పదలు నటజీవితం. 47 ఏళ్ల వయసులోనూ యోగా ప్రభావమో ఏమోగాని నాజూకుగా కనిపిస్తుంది. 1993లో ‘బాజీగర్’ సినిమాతో షారుఖ్ తో కలిసి తెరంగేట్రం చేసింది. హిందీ, కన్నడ, తెలుగు కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. తెలుగులో విక్టరీ వెంకటేష్ తో ‘సాహసవీరుడు సాగర కన్య’ చిత్రం ద్వారా పరిచయమైంది. రాజ్ కుంద్రా అరెస్టు వార్త ఆమె రెండో ఇన్నింగ్స్ కు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో గాని వార్తల్లో మాత్రం నలుగుతోంది. ప్రియదర్శన్, పరేష్ రావెల్ లు కూడా కొంత గ్యాప్ తర్వాత జనం ముందుకు వచ్చారు.
సినిమాల్లో చేయాలనుకున్నప్పుడు మొదట ‘నిక్కమ్మ’ అవకాశం వచ్చిందట. అభిమన్యు దస్సానీ, షిర్లే సేతియాల సినిమా ఇది. దీనికి అంగీకరించిన తర్వాత నిర్మాత రతన్ జైన్ ‘హంగామా 2’ కోసం అడిగారట. నో చెప్పలేకపోయిందట శిల్ప. ఈ రెండు చిత్రాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆమె వివరించింది. ‘చురా కే దిల్ మేరా’ చేస్తున్నామని రతన్ నన్ను తెలివిగా ఒప్పించారు. నాలోని నటి ఇంకా బతికే ఉంది కాబట్టి అంగీకరించా. ప్రియదర్శన్ కూడా ఆరేళ్ల తర్వాత దర్శకత్వం చేశారు. ఆయన సినిమాలో నటించాలనకున్నా కానీ కుదరలేదు.. అదిప్పుడు కుదిరింది’ అని శిల్ప వివరించింది.
శిల్ప తన తొలి చిత్రం బాజీగర్ తోనే రెండు ఫిలిం ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ సహాయ నటి అవార్డు మొదటి చిత్రానికే వరించింది. యాక్షన్ చిత్రం ‘ మే ఖిలాడి తూ అనారి’ కూడా నటిగా ఆమె మంచి పేరు సంపాదించి పెట్టింది. ‘ధడ్కన్’తో రొమాంటిక్ భామగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత కొంత కాలం ఆమె బుల్లితెర వైపు వెళ్లిపోయింది. యోగా వీడియోలతో పేరు సంపాదించింది. రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్నాక నటనకు దూరమైంది. పెళ్లి తర్వాత దాదాపు ఏడేళ్లు సినిమాలకు దూరంగా ఉంది. ఆ సమయాన్ని బుల్లితెరకు కేటాయించింది.
యాప్ లతో అనుబంధం
రాజ్ కుంద్రా యాప్ ల వ్యాపారానికి పునాది యోగా యాప్ లతోనే పడిందనుకోవాలి. ఎందుకంటే శిల్పాశెట్టి యోగా వీడియోలకు ఈ యాప్ లే వేదికయ్యాయి. సొంత యాప్ లో యోగా వీడియోలు అప్ లోడ్ చేస్తూ ఆమె మంచి పేరు సంపాదించింది. అందరూ ఆమె యోగా పాఠాలను అనుసరించేవారు. ఆరోగ్యం, ఫిట్ నెస్ తన హాబీ అని ఆమె అంటుండేది. టీవీ తర్వాత ఆమె సోషల్ మీడియా మీద బాగా దృష్టి సారించింది. సోషల్ మీడియాని కమర్షయల్ గా ఎలా ఉపయోగించుకోవచ్చో శిల్పకు బాగా తెలుసు.
రాజ్ కుంద్రా భోగా యాప్ లకు భీజం కూడా ఇంట్లోనే పడిందని అనుకోవాలేమో. 2010లో ‘ద డిజాయర్’ తర్వాత ఆమె సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇన్నాళ్లకు ‘హంగామా 2’తో జనం ముందుకు వచ్చింది. ‘సినిమాలకు కంటెంటే ముఖ్యం. కమర్షియల్ సినిమాలే నాకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. మంచి కంటెంట్ ఉంటే అది నటుడికి కూడా పేరు తెస్తుంది. నేను సినిమా అంగీకరించేటప్పుడు ఈ విషయాన్ని ప్రధానంగా చూస్తా. ఓ ప్రేక్షకురాలిగా నేను ఎలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతానో నటిగా అలాంటి సినిమాలే చేయడానికి ఒప్పుకుంటా’ అని ఆమె వివరించింది.
తను చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంటాననని ఆమె చెప్పింది. తను ఇంకో సినిమాను కూడా అంగీకరించినట్టు చెప్పింది. ఇందులో టైటిల్ పాత్రను పోషించబోతోందట. దీని తర్వాత ఓ వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నట్లు వివరించింది. సెలక్టివ్ గా పనిచేయడం తనకు ఇష్టమని ఆమె చెబుతోంది. తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో పాజిటివ్ గా ఉంటుందనుకున్న శిల్ప తాజా పరిణామాలతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. రాజ్ కుంద్రా వ్యవహారంలో శిల్పను విచారణకు పిలిచే అవకాశం లేకపోలేదు. కాకపోతే ఇప్పటిదాకా ఆమె సమన్లు ఏవీ అందలేదు.
Must Read ;- అరెస్టు కాకుండా రాజ్ కుంద్రా రూ. 25 లక్షల లంచం?











